కరివేపాకులా మారిపోనున్నారా?

రఘురామ కృష్ణంరాజు తొలిసారి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. అయితే తొలిసారి తాను గెలిచిన పార్టీతో వైరాన్ని కొని తెచ్చుకున్నారు. ఇది రఘురామ కృష్ణంరాజు రాజకీయ భవిష్యత్ కు [more]

Update: 2021-06-20 14:30 GMT

రఘురామ కృష్ణంరాజు తొలిసారి పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. అయితే తొలిసారి తాను గెలిచిన పార్టీతో వైరాన్ని కొని తెచ్చుకున్నారు. ఇది రఘురామ కృష్ణంరాజు రాజకీయ భవిష్యత్ కు ఇబ్బందిగా మారే అవకాశాలున్నాయి. రఘురామ కృష్ణంరాజు ను మరో మూడేళ్ల పాటు రాజకీయ పార్టీలు పట్టించుకుంటాయి. విపక్షాలకు ఆయన వరంగా దొరకడంతో ఆయనకు ఈ మూడేళ్లు అండగా నిలుస్తాయి. ఆ తర్వాత రఘురామ కృష్ణంరాజు వైపు చూడను కూడా చూడవు.

మరోసారి పోటీకి…?

రఘురామ కృష్ణంరాజు నర్సాపురం పార్లమెంటు నుంచి మరోసారి గెలిచే అవకాశాలు తక్కువ. అక్కడ క్షత్రియ సామాజికవర్గం సయితం ఆయన చేసిన అల్లరి, చిల్లర చేష్టలను చూసి విసిగిపోయింది. పార్టీ అధినాయకత్వంతో సఖ్యతగా మెలగాల్సిన రఘురామ కృష్ణంరాజు కావాలని విభేదాలు తెచ్చుకున్నారన్న టాక్ ఆ సామాజికవర్గం నుంచే బలంగా విన్పిస్తుంది. ఇక ఆయన వ్యవహార శైలిని దగ్గరగా పరిశీలించిన వారు ఎవరైనా తమ పార్టీలో చేర్చుకునే సాహసం చేయరు.

ఏ ప్రాంతీయ పార్టీ అయినా?

రఘురామ కృష్ణంరాజుకు ఇగో ఎక్కువ. తనను ప్రత్యేకంగా ప్రతి ఫ్రేమ్ లో చూడాలన్నది ఆయన కోరిక. పార్లమెంటు సభ్యుల విషయంలో ఏ పార్టీలోనూ అది సాధ్యం కాదు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీల్లో ఎంపీలకు ప్రాధాన్యత తక్కువగానే ఉంటుంది. ఈ పరిస్థతుల్లో రఘురామ కృష్ణంరాజు మెంటాలిటీ తెలిసిన ఏ రాజకీయ పార్టీ ఆయనను దగ్గరకు తీసుకోదన్నది వాస్తవం. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ వంటి పార్టీలు రఘురామ కృష్ణంరాజుకు మద్దతిస్తున్నా అది కొంత కాలం వరకే.

మూడేళ్ల వరకే?

ఎన్నికల సమయానికి వచ్చేసరికి రఘురామ కృష్ణంరాజుకు అన్ని పార్టీలు హ్యాండ్ ఇవ్వకతప్పదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఆయనను తెచ్చుకుని పెట్టుకుంటే కొరివితో తలగోక్కున్నట్లేనన్న అభిప్రాయం రాజకీయ పార్టీల నుంచే విన్పిస్తుంది. నిలకడలేనితనం, దూకుడు మనస్తత్వం, తానే గొప్ప అన్న ధీమా పాలిటిక్స్ లో పనికి రావు. అనర్హత వేటు పడక పోతే రఘురామ కృష్ణంరాజును మరో మూడేళ్ల పాటు విపక్షాలు అండగా నిలుస్తాయి. తర్వాత పక్కన పెట్టడం ఖాయం. అనేక మంది నేతలు ఇలా తమ రాజకీయ జీవితం నుంచి నిష్క్రమించిన సందర్భాలు ఉన్నాయి.

Tags:    

Similar News