జాతీయ స్థాయిలో జగన్ పరువు తీసే ప్లాన్.. ?

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు జగన్ కి మధ్య ఆజన్మ వైరం ఏదో ఉన్నట్లుంది. లేకపోతే రెండేళ్ళుగా జగన్ ని ఊపిరి తీసుకోకుండా ఇబ్బందుల పాలు చేస్తూనే [more]

Update: 2021-06-06 03:30 GMT

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు జగన్ కి మధ్య ఆజన్మ వైరం ఏదో ఉన్నట్లుంది. లేకపోతే రెండేళ్ళుగా జగన్ ని ఊపిరి తీసుకోకుండా ఇబ్బందుల పాలు చేస్తూనే ఉన్నారు. ఆయన్ని ఏదో రకంగా దారికి తేవాలనుకున్న జగన్ ప్రయత్నాలు అన్నీ కూడా బెడిసికొడుతున్నాయి. పైగా తోక తొక్కిన పాముల రఘురామ కృష్ణంరాజు రెచ్చిపోతున్నారు. ఆయన్ని సీఐడి అధికారులు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు అన్నది ఏ కాస్తా కూడా వైసీపీ పెద్దలకు రిలీఫ్ ఇవ్వకపోగా రఘురామ కృష్ణంరాజు మరింత దూకుడు పెంచేశారు. ఆయన బెయిల్ మీద ఉంటూనే ఢిల్లీలో చేయాల్సినవన్నీ చేస్తున్నారు. తాజాగా ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ తో జగన్ సర్కార్ పరువు ఢిల్లీలో పూర్తిగా పోయే సీన్ కనిపిస్తోంది.

ఎంపీల మద్దతు ..?

దేశంలో ఎంత మంది ఎంపీలు ఉన్నారో అంతమందికీ రఘురామ కృష్ణంరాజు తన జైలు కధను అరెస్ట్ బాధను ని హరికధ మాదిరిగా వివరిస్తూ లేఖలు రాశారు. ఎపుడు పార్లమెంట్ సమావేశాలు జరిగినా మీ అందరి మద్దతు పార్టీలకు అతీతంగా నాకు ఇవ్వాలని అభ్యర్ధించారు. తన మీద థర్డ్ డిగ్రీని ఏపీ సీఐడీ అధికారులు ప్రయోగించారు అంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక ఎంపీ హక్కులు ఏపీ సర్కార్ పూర్తిగా కాలరాసిందని కూడా ఆయన వాపోయారు. తన మీద రాజద్రోహం కేసు కూడా పెట్టారని రఘురామ కృష్ణంరాజు చెప్పడంతో ఇపుడు పార్టీలకు అతీతంగా ఎంపీల మద్దతు రాజుకు దక్కుతోందిట.

ఆ హామీ కూడా…?

మరో వైపు తన మీద దాడి చేసిన వారి మీద సభా హక్కుల ఉల్లంఘణ నిబంధన మేరకు చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కోరిన రఘురామ కృష్ణంరాజు పనిలో పనిగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించి ఆయన నుంచి గట్టి హామీ తీసుకున్నారుట. అంటే రేపటి రోజున కరోనా తగ్గి పార్లమెంట్ కనుక సమావేశం జరిపితే రఘురామ కృష్ణంరాజు ఏకంగా నిండు సభలో ఏపీ సర్కార్ పరువు తీయడానికి అంతా రెడీ చేసుకున్నట్లుగా అర్ధమవుతోంది. మరి రాజు తన గోడుని అక్కడ వెళ్లబోసుకుంటే మిగిలిన ఎంపీలు మద్దతు ఇస్తే జాతీయ స్థాయిలో ఏపీ సర్కార్ పరువు పూర్తిగా పోవడం ఖాయమనే కలవరం అయితే వైసీపీలో కనిపిస్తోంది.

అంతులేని కధగా….?

రఘురామ కృష్ణంరాజు తనకు ఆరోగ్యం బాలేదని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఆయన మీద విచారణకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చినా ఆయనను మళ్ళీ పిలిచే పరిస్థితి ఉంటుందా. ఒక వేళ ఉన్నా ఆయన వస్తారా అన్నది చర్చ. ఆయన తన అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకునే ఢిల్లీ వీధుల్లో తిరిగి చేయాల్సిన యాగీ అంతా చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నోరు విప్పడంలేదు కానీ తన చర్యలు అన్నీ మీడియాకు చక్కగా తెలియచేస్తున్నారు. ఆయన విషయంలో మరో మారు రాంగ్ స్టెప్ వేసిన పాపానికి వైసీపీ మౌన ప్రేక్షకురాలిగా ఇదంతా చూడాల్సి వస్తోంది. మరో వైపు రఘురామ కృష్ణంరాజు మీద పెట్టిన రాజద్రోహం సెక్షన్ మీద పునర్ నిర్వచించాల్సి ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇలా సీఐడీ పెట్టిన అన్ని సెక్షన్లూ వీగిపోతూండగానే రఘురామ కృష్ణంరాజు మాత్రం ఏకంగా ఏపీ సర్కార్ కే ఇపుడు రెబెల్ అయిపోయారు అంటున్నారు. ఏడేళ్ల క్రితం ఎంపీగా చేసిన‌ జగన్ రేపటి పార్లెమెంట్ సమావేశాల్లో మరోమారు మారుమోగనున్నారా.. చూడాల్సిందే.

Tags:    

Similar News