రాజుకు రాజుతోనే చెక్….అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన జ‌గ‌న్‌

రాజ‌కీయాల్లో గెలుపు మాత్రమే ముఖ్యం కాదు. ప‌దువులు అలంక‌రించ‌డ‌మూ ప్రాధాన్యం కాదు… ప‌దికాలాల పాటు రాజ‌కీయాల్లో ఉండాలంటే.. అన్నింటినీ మించి పార్టీ ప‌ట్ల, అధినేత ప‌ట్ల కూడా [more]

Update: 2020-05-04 02:00 GMT

రాజ‌కీయాల్లో గెలుపు మాత్రమే ముఖ్యం కాదు. ప‌దువులు అలంక‌రించ‌డ‌మూ ప్రాధాన్యం కాదు… ప‌దికాలాల పాటు రాజ‌కీయాల్లో ఉండాలంటే.. అన్నింటినీ మించి పార్టీ ప‌ట్ల, అధినేత ప‌ట్ల కూడా ఎంతో విన‌యం, విధేయ‌త ఉండాల్సిన అవ‌స‌రం దేశ‌వ్యా ప్తంగా క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు కూడా అన్ని పార్టీల్లోనూ తెలిసిందే. ఈ విష‌యంలో జాతీయ పార్టీలు, స్థానిక పార్టీలు అన్నీ కూడా ఒక్కటే. ఎంత ప్రజాద‌ర‌ణ ఉన్నప్పటికీ.. పార్టీలైన్‌ను పాటించ‌కుండా.. పార్టీతో విభేదించ‌డ‌మో.. లేక‌.. పార్టీ అధినేతకు, పార్టీలైన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయ‌డ‌మో చేస్తే.. ఏ పార్టీ కూడా స‌హించ‌డం లేదు. ఈ విష‌యంలో అన్ని పార్టీల‌దీ ఒకే ప‌ద్ధతి. మ‌రీ ముఖ్యంగా ఏపీలో బ‌లంగా ఉన్న వైసీపీలో ఈ విధానం తు.చ త‌ప్పకుండా అమ‌ల‌వుతోంది.

బాబు లాగే….

పార్టీ విప‌క్షంలో ఉన్నప్పుడైనా.. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చాకైనా కూడా పార్టీ లైన్‌తో విభేదించేవారిని, పార్టీ అధినేత‌పై విమ‌ర్శలు గుప్పించిన వారిని ప‌క్కన పెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంలో చంద్రబాబు అయినా, జ‌గ‌న్ అయినా ఒక్కటే ఫార్ములా అమ‌లు చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు త‌న‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నార‌న్న కార‌ణంతో అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న కేఈ. కృష్ణమూర్తికి బాబు ప్రయార్టీ త‌గ్గించేశారు. అయితే పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా భిన్నమైన వాద‌న‌లు, భిన్నమైన వ్యవ‌హార శైలితో వ్యవ‌హ‌రిస్తే.. వారిని ఏం చేయాలి? పార్టీని ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టాల‌నే నేత‌ల‌ను ఏమ‌నాలి ? ఖ‌చ్చితంగా వారికి చెక్ పెట్టి తీరాలి. వైసీపీ అధినేత జ‌గ‌న్ అదే చేశారు.

పార్టీలో చేరిన వెంటనే…

న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణరాజు.. గ‌తంలో బీజేపీలో ఉన్నా.. వైసీపీలోకి రాగానే ఆయ‌న కోరిక మేర‌కు జ‌గ‌న్ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆయ‌న గెలుపున‌కు దోహ‌ద‌ప‌డ్డారు. పాద‌యాత్ర కావొచ్చు, స్థానిక క్షత్రియ వ‌ర్గాన్ని ఏక‌తాటిపై న‌డిపించ‌డం కావొచ్చు. జ‌గ‌న్ వ్యూహ‌మే లేక‌పోయి ఉంటే.. న‌ర‌సాపురంలో జ‌న‌సేన త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన నాగ‌బాబు చేతిలో ర‌ఘురామ‌కృష్ణరాజు ఓట‌మిపాల య్యేవార‌నేది విశ్లేష‌కుల వాద‌న‌. ఆయ‌న అతి స్వల్ప మెజార్టీతో మాత్రమే గెలిచారు.

అన్నింటా వివాదాలే….

మ‌రి ఇలా గెలిచిన ర‌ఘురామకృష్ణంరాజు ఎలాంటి విధేయ‌త చూపాలి. కానీ, ఆయ‌న పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవ‌హ‌రించారు. తెలుగు మీడియం వ‌ద్దని ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడ‌తామ‌ని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తే.. దానిని విభేదించిన‌ట్టుగా ఆయ‌న పార్లమెంటులో దీనిపై చ‌ర్చ పెట్టాల‌న్నారు. ఇక‌, తాను గెలిచిన త‌ర్వాత త‌న కుటుంబ స‌మేతంగా వెళ్లి ప్రధాని మోడీని క‌లిసి త‌న‌కు కేంద్రంలోనూ పెద్ద ఎత్తున బ‌లం ఉంద‌ని, తాను సామాన్యుడిని కాద‌నే ప్రచారం చేసుకునేందుకు ప్రయ‌త్నించ‌డ‌మూ తెలిసిందే. ఇక‌, అమిత్ షా వ‌ద్ద కూడా త‌న‌కు ప‌లుకుబ‌డి ఎక్కువ‌ని చెప్పుకొనే ప్రయ‌త్నం చేశారు. ఇక ఢిల్లీలో కోట్లు ఖ‌ర్చు చేసి ఆయ‌న ఎంపీలకు ఇచ్చిన విందు జాతీయ స్థాయిలో సంచ‌ల‌నం అయ్యింది.

ఈయనను పక్కన పెట్టి….

ఇలాంటివ‌న్నీ కూడా పార్టీలైన్‌కు వ్యతిరేక‌మే. కొత్తగా ఎన్నికైన ఎంపీకి ఇలాంటి ల‌క్షణాలు ఉంటే ఏ పార్టీ మాత్రం స‌హిస్తుంది. అందుకే జ‌గ‌న్ ర‌ఘురామ‌కృష్ణరాజుకు ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడే పెట్టారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు కుమారుడు రంగ‌రాజు ను పార్టీలోకి తీసుకున్నారు. న‌ర‌సాపురం ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వయ‌క‌ర్త బాధ్యత‌లు అప్పగించారు. అంతేకాదు, ఎంపీని ప‌క్కన పెట్టమ‌ని న‌రసాపురం పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న ఎమ్మెల్యేల‌తో పాటు ఉండి, న‌ర‌సాపురం, పాల‌కొల్లు స‌హా అన్నినియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జ్‌ల‌కు ఆదేశాలు ఇచ్చార‌న్న ప్రచారం పార్టీ వ‌ర్గాల్లోనే ఉంది.

ఇప్పుడు సరే భవిష్యత్ ఏంటి?

దీంతో ఇప్పుడు ర‌ఘురామ‌కృష్ణరాజు ఊసు కానీ, రాజ‌కీయాలు కానీ ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న‌కు ప్రాధాన్యమూ ల‌భించ‌డం లేదు. దీంతో ఇప్పుడు ర‌ఘురామ‌కృష్ణరాజు ప‌రిస్థితి వ‌చ్చే నాలుగు సంవ‌త్సరాలు అధికారంలో ఉంటారు కాబ‌ట్టి బాగానే ఉన్నా.. సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం చూసుకున్నప్పుడు ఇప్పుడు వేసిన అడుగులు ఖ‌చ్చితంగా ఆయ‌న‌కు శాపంగా మార‌తాయ‌ని అంటున్నారు. ఇక భ‌విష్యత్తు అవ‌స‌రాల నేప‌థ్యంలో గోక‌రాజు రంగ‌రాజుకు వీలును బ‌ట్టి న‌ర‌సాపురం ఎంపీ సీటు లేదా ఉండి అసెంబ్లీ సీటు ఇవ్వవ‌చ్చని టాక్ ఉంది. మ‌రి ర‌ఘురామ‌కృష్ణరాజు త‌న రాజ‌కీయ భ‌విష్యత్తు కోసం త‌గ్గుతారా ? ఇదే దూకుడు కంటిన్యూ చేస్తారా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News