వారికి రాజు గారే ఇన్సిపిరేషనట ?

వైసీపీలో జగన్ కి ఎదురు నిలిచి చెప్పే సాహసం గత పదేళ్ళ పార్టీ ప్రయాణంలో ఎవరూ చూసి ఎరగరు. మంచో చెడ్డో జగన్ ఏది అంటే అదే [more]

Update: 2020-12-05 02:00 GMT

వైసీపీలో జగన్ కి ఎదురు నిలిచి చెప్పే సాహసం గత పదేళ్ళ పార్టీ ప్రయాణంలో ఎవరూ చూసి ఎరగరు. మంచో చెడ్డో జగన్ ఏది అంటే అదే ఫైనల్. అలా నచ్చిన వాళ్ళే పార్టీలో ఉన్నారు. లేనివారు బయటకు పోయారు. అంతే తప్ప ఉన్న పార్టీ కొమ్మనే నరుకుతూ రచ్చ చేసే కల్చర్ వైసీపీ ఇప్పటిదాక ఎరగదు, దానికి ఆద్యుడుగా రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజునే చెప్పుకోవాలి. ఆయన జగన్ అయితే ఏంటి అంటూ ప్రతీ రోజూ ఠంచనుగా రచ్చ బండ పెట్టి మరీ పార్టీ పరువుని బండకేసి బాదేస్తున్నారు.

అక్కడ నో సౌండ్ ….

ఆయన కామెంట్స్ కి మొదట్లో రివర్స్ అటాక్ చేస్తూ వైసీపీ పెద్దలు కొందరు తల గోక్కున్నారు. కానీ ఆ తరువాత వ్యూహమో మరేంటో తెలియదు కానీ వైసీపీ ఫుల్ సైలెంట్ అయిపోయింది. రఘురామ కృష్ణంరాజు మాటకు మరో మాట అని ఆయన్ని హీరోను చేద్దామనుకోవడం లేదు అని కొందరు పార్టీ నాయకులు చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యూహమే ఇపుడు బెడిసికొడుతోంది. రాజు గారు రచ్చ బండ అంటూ ఢంకా భజాయించి మరీ వైసీపీ మీద విరుచుకుని పడిపోతూంటే ఇవత‌ల వైపు నుంచి జవాబు లేకపోవడంతో ఆయన‌ మాటలే జనాల్లోకి పోతున్నాయి. దాంతో పార్టీకి అతి పెద్ద డ్యామేజ్ జాతీయ మీడియా సాక్షిగా జరిగిపోతోంది.

కట్టు తప్పేస్తున్నారు ….

గోదావరి జిల్లాల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటే సౌమ్యుడు అని పేరు. ఆయన వయసు కూడా డెబ్బైలకు చేరింది. నిజంగా ఆయన రాజకీయ జీవితాన్ని పొడిగించింది జగనే. బోస్ ఎమ్మెల్యేగా ఓడినా ఎమ్మెల్సీని చేసి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు, ఆ తరువాత ఇపుడు రాజ్యసభ సభ్యుడిని చేశారు. అయితే అంతటి పెద్దాయన వైసీఎపీలో గ్రూప్ రాజకీయాలకు తెర తీస్తున్నాడు. ఆయన పార్టీ గీతను దాటేసి మరీ సొంత పార్టీ నేతల మీదనే బహిరంగ లేఖలు రాస్తున్నారు. ఆయనకు అటు రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఇటు టీడీపీ పెద్దలు కూడా మద్దతు ఇవ్వడం చూస్తూంటే గోదావరి జిల్లాల్లో వైసీపీ సీన్ చిరిగి చేట అయిందనే అనుకోవాలి. పోరాడితే పోయేదేముంది అన్న రాజు గారు మార్క్ స్టైల్ ని బోస్ పట్టుకున్నారా అని కూడా పార్టీలో మాట వినిపిస్తోంది.

చాలా మందే ఉన్నారా….?

ఇక చూసుకుంటే ఎంపీల్లో చాలా మంది ఇప్పటికే జగన్ మీద గుర్రుగా ఉన్నట్లుగా టాక్ నడుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు కూడా తమకు విలువ, గౌరవం పార్టీలో లేవా అంటూ గొంతు పెంచుతున్నారు. వీరందరికీ రఘురామ కృష్ణంరాజు ఇన్సిపిరేషనట. ఏడాదిగా జగన్ని, పార్టీని రఘురామ కృష్ణంరాజు ఇష్టం వచ్చినట్లుగా విమర్శిస్తున్నా ఏమీ చేయలేని పార్టీ మా మీద ఏం యాక్షన్ తీసుకుంటుంది అన్న ధీమా పెరగడంతో ఎక్కడికక్కడ పార్టీ నేతలు గీత దాటుతున్నారు. దీని మీద టీడీపీ నేత చినరాజప్ప వంటి వారే కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీలో జగన్ పట్టు తప్పిందని, వర్గ పోరుతో ఆ పార్టీ కుప్పకూలడం ఖాయమని జోస్యం కూడా చెబుతున్నారు. దీని మీద జగన్ కనుక దృష్టి పెట్టకపోతే ఒకరికి తోడు అన్నట్లుగా పది మంది రెబెల్ రాజాలు రెడీ అయిపోతారు.

Tags:    

Similar News