ట్రెండ్ సెట్టర్ అయ్యారు… హోప్స్ పెంచారు

దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు విజయం ఆయన వ్యక్తిగతమే కాదు పార్టీకి భవిష్యత్ పై ఆశలు పెంచారని చెప్పక తప్పదు. రఘునందన్ రావు ఈ ఎన్నికలలో [more]

Update: 2020-11-10 14:30 GMT

దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు విజయం ఆయన వ్యక్తిగతమే కాదు పార్టీకి భవిష్యత్ పై ఆశలు పెంచారని చెప్పక తప్పదు. రఘునందన్ రావు ఈ ఎన్నికలలో గట్టి పోటీ ఇస్తారనుకున్నారు కాని ఆయనకే విజయం వరిస్తుందని ఎవరూ ఊహించలేదు. చివరకు బీజేపీ సయితం పైకి ప్రకటనలు చేస్తుంది తప్ప లోపల సెకండ్ ప్లేస్ వస్తే చాలని అనుకుంది. అటువంటి పరిస్థితుల్లో రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి అధికార టీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చారు.

సొంత నియోజకవర్గంలో….

రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాక. రఘునందన్ రావు 1968లో జన్మించారు. ఆయన ప్రజా సమస్యల పట్ల చిన్న నాటి నుంచే స్పందించే వారు. రఘునందన్ రావు న్యాయవాది వృత్తి చేపట్టారు. అంతకు ముందు పటాన్ చెరువు కు ఒక దినపత్రికలో న్యూస్ కంట్రిబ్యూటర్ గా పనిచేశారు. ఐదేళ్లు జర్నలిస్ట్ గా పనిచేసిన రఘునందన్ రావు తర్వాత న్యాయవాది వృత్తిని చేపట్టారు.

తొలుత టీఆర్ఎస్ లో చేరి….

ఆ తర్వాత 2001లో రాజకీయాల పట్ల ఆకర్షితులై తెలంగాణ రాష‌్ట్ర సమితిలో చేరారు. ఇటు న్యాయవాద వృత్తి చేస్తూనే రాజకీయాల్లో రాణించాలని రఘునందన్ రావు భావించారు. టీఆర్ఎస్ లో బలమైన గొంతున్న నాయకుడిగా పేరు గడించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో సమావేశం అయినందుకు రఘునందన్ రావు ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో రఘునందన్ రావు బీజేపీలో చేరారు.

మూడు సార్లు పోటీ చేసి….

అప్పటి నుంచి రఘునందన్ రావు బీజేపీలోనే కొనసాగుతున్నారు. వరసగా మూడు సార్లు దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ సానుభూతి ఈ ఎన్నికల్లో బాగా పనిచేసింది. మరోవైపు రఘునందన్ రావు కుటుంబ సభ్యుల ఇళ్లపై జరిగిన పోలీసు దాడులు కూడా ఆయనపై సానుభూతిని పెంచాయని చెప్పకతప్పదు. మొత్తం మీద రఘునందన్ రావు ట్రెండ్ సెట్టర్ గా మారారు. టీఆర్ఎస్ ను ఓడించి రఘునందన్ రావు బీజేపీకి తెలంగాణలో భవిష్యత్ పై ఆశలు పెంచినట్లే.

Tags:    

Similar News