రెబ‌ల్ ఎంపీని ఆడిస్తోందెవ‌రు ? ఆ అండ ఉందనేనా?

వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌ కృష్ణంరాజు వ్యవ‌హారం మ‌రింత ముదిరింది. ఏకంగా ఆయ‌న వైసీపీ అధినేత‌, సీఎం, త‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చిన జ‌గ‌న్‌నే బ‌ద్నాం [more]

Update: 2021-05-01 14:30 GMT

వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌ కృష్ణంరాజు వ్యవ‌హారం మ‌రింత ముదిరింది. ఏకంగా ఆయ‌న వైసీపీ అధినేత‌, సీఎం, త‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చిన జ‌గ‌న్‌నే బ‌ద్నాం చేసేందుకు.. ప్రయ‌త్నించ‌డం. ఇప్పుడు ఏకంగా ఆయ‌న బెయిల్ ర‌ద్దు కోరుతూ.. సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేయ‌డం వంటి ప‌రిణామాలు వైసీపీలో చాలా హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటి వ‌రకు అంతో ఇంతో చూసీ చూడ‌న‌ట్టు వ్యవ‌హ‌రించిన వైసీపీ నేత‌లు కూడా ఇప్పుడు ఎంపీ ర‌ఘురామ‌ కృష్ణంరాజుపై నిప్పులు చెరుగుతున్నారు. ఏకులా వ‌చ్చి మేక‌య్యాడంటూ.. కొంద‌రు కారాలు మిరియాలు నూరుతున్నారు.

టీడీపీ వెనక ఉందని ఇప్పటి వరకూ….

ఈ క్రమంలో వైసీపీ అధిష్టానం కూడా ర‌ఘురామ‌ కృష్ణంరాజు వెనుకాల ఎవ‌రు ఉన్నారు? అనే విష‌యాన్ని నిశితంగా ప‌రిశీలిస్తోంది. వాస్తవానికి ఇప్పటి వ‌ర‌కు ర‌ఘురామ‌ కృష్ణంరాజు వెనుక‌ టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నాడ‌ని భావిస్తూ వ‌చ్చిన వైసీపీ నాయ‌కులు ఇటీవ‌ల తిరుప‌తి పార్లమెంటు ఉప పోరు సంద‌ర్భంగా .. మేం గెలిస్తే.. మీ(టీడీపీ) ఎంపీల‌తో పాటు మీ క‌నుస‌న్నల్లో మెలుగుతున్న ర‌ఘురామ‌ కృష్ణంరాజుతో కూడా రిజైన్ చేయించాలి! అని స‌వాల్ విసిరారు. అంటే.. ఇప్పటి వ‌ర‌కు వైసీపీ నేత‌లు.. ర‌ఘు వెనుక టీడీపీ నేత‌లు ఉన్నార‌ని.. వారే ఆయ‌న‌ను ఆడిస్తున్నార‌ని.. వారి అండ చూసుకునే రెచ్చిపోతున్నాడ‌ని అనుకున్నారు.

బీజేపీ ఉండటంతో….?

కానీ, ఇప్పుడు ప‌రిణామాలు మారిపోయాయి. ర‌ఘురామ‌ కృష్ణంరాజు వెనుక‌.. కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్న పార్టీ ఉంద‌నేది వైసీపీ నేత‌లు దృఢంగా న‌మ్ముతున్నారు. ఎందుకంటే.. బెయిల్ ర‌ద్దు చేయించే సాహ‌సం.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికీ చేయ‌రు. అంతేకాదు.. ఇదే క‌నుక జ‌రిగితే.. త‌న‌పైనే అప‌వాదు వ‌స్తుంద‌ని.. పార్టీ కూడా ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదుర్కొంటుంద‌ని బాబుకు ఒక అంచ‌నా ఉంది. ఏదైనా ఉంటే.. విమ‌ర్శల‌తో స‌రిపెడ‌తారు కానీ.. బెయిల్ ర‌ద్దు వ‌ర‌కు విష‌యాన్ని లాగే సాహ‌సం మాత్రం ర‌ఘురామ‌ కృష్ణంరాజుచేయ‌డ‌ని వైసీపీ నేత‌లు గ‌ట్టిగానే న‌మ్ముతున్నారు.

బలం లేకున్నా…?

ఇక‌, కేంద్రంలోని బీజేపీకి మాత్రం ఇక్కడ బ‌లం ఉన్నా లేకుండా.. బ‌ల‌మైన పార్టీగా ఉన్న వైసీపీని డైల్యూట్ చేసేందుకు ర‌ఘురామ‌ కృష్ణంరాజును వాడుకుంటుందంటున్నారు. బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న జ‌గ‌న్‌ను త‌ప్పించ‌డ‌మే ప‌ర‌మావధి. గ‌తంలో త‌మిళ‌నాడులోనూ ఇలాంటి ప్రయోగ‌మే చేసి.. ఒక రాజ‌కీయ అస్థిర‌త‌ను తెచ్చేందుకు ప్రయ‌త్నించింది. ఇప్పుడు ఏపీలోనూ జ‌గ‌న్ క‌నుక బెయిల్ ర‌ద్దయి.. సీఎం ప‌ద‌వి కోల్పోతే.. రాజకీయ అస్థిర‌త ఏర్పడి.. త‌మ‌కు అవ‌కాశం ఉంటే పుంజుకోవ‌డం లేదా.. ఏపార్టీని బ‌లంగా ఎద‌గ‌నివ్వకుండా చేయ‌డం అనే ద్విసూత్ర ప్రాతిప‌దిక‌న బీజేపీ ఆడిస్తున్నట్టు వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు.

తెర వెనక సాయం?

గ‌తంలో ర‌ఘురామ‌ కృష్ణంరాజు త‌మ‌కు ఎదురుతిరిగాడ‌ని, ఆయ‌న ఎంపీ స‌భ్యత్వాన్ని ర‌ద్దు చేయాల‌ని పార్టీ నేత‌లు స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసినా.. ఇప్పటి వ‌ర‌కు ప‌ట్టించుకోలేదు. పైగా ఎంపీ ర‌ఘురామ‌ కృష్ణంరాజు కోరిన‌వెంట‌నే వై కేట‌గిరీ భ‌ద్రత క‌ల్పించారు. ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. బీజేపీ పైకి చేతులు క‌లుపుతున్నట్టు క‌నిపిస్తూనే.. తెర‌వెనుక చేయాల్సింది చేస్తోంద‌ని.. వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. మ‌రి ఈ ప‌రిణామం.. ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News