అప్పుడయితే..అలాగయితేనే సెట్ అవుతారట

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు విషయంలో వైసీపీ అధినేత జగన్ గట్టిగా ఉన్నారు. ఆయనపై అనర్హత వేటు పడాలన్నదే జగన్ ప్రధాన డిమాండ్. ఈమేరకు సాధ్యమయినంత వత్తిడిని [more]

Update: 2021-07-24 15:30 GMT

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు విషయంలో వైసీపీ అధినేత జగన్ గట్టిగా ఉన్నారు. ఆయనపై అనర్హత వేటు పడాలన్నదే జగన్ ప్రధాన డిమాండ్. ఈమేరకు సాధ్యమయినంత వత్తిడిని బీజేపీపై తెచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది. రఘురామ కృష్ణరాజుపై వేటు పడితేనే తనకు పార్టీలోనూ, ప్రజల్లోనూ ఇమేజ్ పెరుగుతుంది. 22 మంది ఎంపీలను పెట్టుకుని ప్రత్యేక హోదాతో పాటు కనీసం తనపై తిరగబడిన ఎంపీని ఏం చేయలేకపోయారన్న అపప్రధను జగన్ ఎదుర్కొనాల్సి ఉంటుంది.

అన్ని రకాలుగా….

అందుకే రఘురామ కృష్ణరాజు విషయంలో అన్ని రకాలుగా వత్తిడి తెచ్చేందుకు జగన్ టీం ఢిల్లీలో ప్రయత్నిస్తుంది. పార్లమెంటు సమావేశాల్లో రెండు ఉభయ సభల్లో వివిధ అంశాలపై ఆందోళన చేస్తుంది. గత రెండేళ్లుగా వైసీపీ ఎప్పుడూ ఇంత దూకుడుగా వెళ్లింది లేదు. పేరుకు ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అని ఆందోళనలకు దిగుతున్నా అసలు డిమాండ్ రఘురామ కృష్ణరాజుపై అనర్హత వేటు వేయడమే.

అనర్హత వేటుకు….

బీజేపీ పెద్దలకు ఇది తెలియంది కాదు. ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి రఘురామ కృష్ణరాజుకు నోటీసులు అందాయి. వాటి నుంచి వివరణ అందిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశముందంటున్నారు. రఘురామ కృష్ణరాజుతో పాటు మరో ఇద్దరు టీఎంసీ ఎంపీలపై కూడా ఇదేరకమైన ఫిర్యాదులు స్పీకర్ కార్యాలయానికి అందాయి. అందుకే రఘురామ కృష్ణరాజు విషయంలో ఆలస్యం జరుగుతుందని చెబుతున్నారు.

ఆర్థిక పరమైన…?

మరోవైపు అనర్హత వేటుతో పాటు ఇటు రఘురామ కృష్ణరాజును ఆర్థికంగా దిగ్బంధనం చేసే పనిలో కూడా వైసీపీ ఉంది. ఆయన కంపెనీలపై రాష్ట్రపతి నుంచి అధికార వర్గాల వరకూ ఫిర్యాదులు చేస్తుంది. ఆ కంపెనీలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. ఇలా రఘురామ కృష్ణరాజుకు ఆర్థికపరమైన చిక్కులు కల్పిస్తేనే ఆయన సెట్ అయ్యే అవకాశముందని భావించిన వైసీపీ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. మొత్తం మీద రఘురామ కృష్ణరాజు విషయంలో జగన్ పట్టు సడలించే అవకాశం లేదని చెబుతున్నారు. మరి బీజేపీ ఎవరిని కోరుకుంటుందనేది వేచి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News