ఆవిడపై జగన్ కి ఎంత నమ్మకమో

జగన్ ఒకసారి నమ్మారంటే వారిని విడిచిపెట్టరు. అది ఆయనకు తన తండ్రి వైఎస్సార్ నుంచి వచ్చిన గొప్ప గుణం. జగన్ తనతో పాటు పార్టీలో ఉంటూ కష్టాలలో [more]

Update: 2019-07-31 08:00 GMT

జగన్ ఒకసారి నమ్మారంటే వారిని విడిచిపెట్టరు. అది ఆయనకు తన తండ్రి వైఎస్సార్ నుంచి వచ్చిన గొప్ప గుణం. జగన్ తనతో పాటు పార్టీలో ఉంటూ కష్టాలలో కలసి అడుగులు వేసిన వారి రుణాన్ని తీర్చుకున్నారు కూడా. ఓడిన వారిని సైతం మంత్రులుగా చేసిన ఘనత జగన్ కే దక్కింది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలలో జగన్ మెచ్చిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. వారిలో విజయనగరం జిల్లాకు చెందిన కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అంటే జగన్ కి ప్రత్యేకమైన అభిమానం. ఆమె దీక్షా దక్షతల మీద అంతులేని నమ్మకం. జగన్ పాదయాత్ర సమయంలో జరిగిన సభలో పుష్ప శ్రీవాణి ఎమోషనల్ గా అన్న మాటలు నాడు జగన్ ని ఎంతలాగానో కట్టిపడేశాయి. నా కట్టె కాలేవరకూ వైసీపీతోనే. జగనన్న చేయి వీడను అంటూ ఆమె చేసిన ప్రసంగం నాడు జగన్ మరచిపోలేదు. అందుకే వైసీపీ అధికారంలోకి రావడంతోనే ఉప ముఖ్యమంత్రి వంటి కీలకమైన పదవిని ఆమెకు అప్పగించారు.

పిన్న వయసులో….

జగన్ మంత్రివర్గంలో అతి పిన్న వయసు కలిగిన మహిళ మంత్రి పుష్ప శ్రీవాణి. ఆమె వయసు 31 సంవత్సరాలు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి 2014లో కురుపాం రాజు అయిన పరీక్షిత్ రాజుని పెళ్ళి చేసుకున్నారు. అదే ఏడాది జగన్ ఆమెకు టికెట్ ఇచ్చి నిలబెట్టారు. తొలిసమరంలోనే ఆమె గెలిచి సత్తా చాటారు. సొంత ఇంట్లోనే వైరి వర్గాలు సొంత మామ శత్రుచర్ల చంద్రశేఖరరాజు టీడీపీలో చేరిపోయారు. పెదమామ, మాజీ మంత్రి విజయరామరాజు ఎత్తులు వ్యూహాలు అందరికీ తెలిసినవే. వాటిని ఎప్పటికపుడు చిత్తు చేసుకుంటూ పుష్పశ్రీవాణి తాజా ఎన్నికల్లో అతి పెద్ద మెజారిటీతో గెలిచిన తీరు నిజంగా ఆమె సమర్ధతకు నిదర్శనమే. ఇక జగన్ సైతం మాట నిలబెట్టుకుని ఆమెని డిప్యూటీ సీఎం ని చేశారు. ఆమె పనితీరు విషయంలో ఎప్పటికపుడు సలహా సూచనలు ఇస్తూ చేయి పట్టుకుని మరీ తనతో పాటుగానే ముందుకు తీసుకెళ్తున్నారు.

గిరిజన సలహా మండలి చైర్ పర్సన్ గా….

డిప్యూటీ సీఎం పదవి అతి కీలకమైనది అనుకుంటే దానితో పాటు మరో కీలకమైన పదవి గిరిజన సలహా మండలి చైర్ పర్సన్. తాజాగా జగన్ ఆదేశాలు జారీ చేస్తూ మరింత బరువుని ఆమెపై మోపారనే అనుకోఅవలి. ఆమె ఎన్ని బాధ్యతలు మోపినా చేయగలదు అన్న జగన్ నమ్మకమే కొత్త పదవి అంటున్నారు. మరో వైపు జిల్లా రాజకీయాలను జగన్ పూర్తిగా గమనిస్తున్నారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఉన్నా కూడా యువ నాయకత్వాన్ని తయారుచేయాలని జగన్ డిసైడ్ అయ్యారనుకోవాలి. రేపటి రాజకీయాలకు పుష్ప శ్రీవాణి వంటి వారు అవసరం ఉందని భావించే జగన్ ఆమెకు విశేష ప్రాధాన్యతను ఇస్తున్నారు. గిరిజనుల్లో సమర్ధవంతమైన నాయకత్వం ఆమెలో చూసిన జగన్ రానున్న రోజుల్లో జిల్లాలోనూ ఉత్తరాంధ్రలోనూ కూడా ఆమెను కీలకమైన నేతగా మలచేందుకు సిధ్ధపడుతున్నారు. మొత్తానికి జగన్, పుష్ప శ్రీవాణిల మధ్య ఉన్న అన్నా చెల్లెళ్ల అనుబంధం అధికారంలో ఉన్న వేళ కూడా మరింతగా గట్టిపడుతోందనిపిస్తోంది.

Tags:    

Similar News