ఉప ముఖ్యమంత్రి ఉద్యోగానికే ఉపద్రవం..?

ఆమె అదృష్ట జాతకురాలు అని అంతా అంటారు. లేకపోతే ఏళ్ళకు ఏళ్ళు పార్టీ కోసం పనిచేస్తూ పలు మార్లు ఎమ్మెల్యేలుగా నెగ్గినా ఎందరికో అమాత్య యోగం అందని [more]

Update: 2021-05-17 05:00 GMT

ఆమె అదృష్ట జాతకురాలు అని అంతా అంటారు. లేకపోతే ఏళ్ళకు ఏళ్ళు పార్టీ కోసం పనిచేస్తూ పలు మార్లు ఎమ్మెల్యేలుగా నెగ్గినా ఎందరికో అమాత్య యోగం అందని పండే అవుతున్న వేళ కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచి ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయిపోయారు అంటే పుష్ప శ్రీవాణి లక్ ని వేరే లెక్కేసి చెప్పాలా. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె విజయనగరంలో పొలిటికల్ గా పేరు గడించిన శత్రుచర్ల మామలతోనే సవాల్ చేసి మరీ కుటుంబంలోనే అతి పెద్ద రాజకీయ పదవిని దక్కించుకున్నారు. జగన్ మెచ్చిన మహిళా నాయకురాలిగా పుష్ప శ్రీవాణి గుర్తింపు పొందారు. అటువంటి పుష్ప శ్రీవాణి పదవికి ఇపుడు ముప్పు వచ్చిపడిందని అంటున్నారు.

ఎస్టీ కాదంటూ….

ఆమె ఎస్టీ కాదంటూ ఒక రిటైర్డ్ టీచర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద విచారించిన హైకోర్టు ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, రాష్ట్ర గవర్నర్, ఇతర ప్రభుత్వ వ్యవస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆమెది కొండ దొర సామాజిక వర్గం కాదని ఆ పిటిషంలో రిటైర్డ్ టీచర్ పేర్కొన్నారు. దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా సమర్పించారు. ఎస్టీ కాని పుష్ప శ్రీవాణి కురుపాం ఎస్టీ సీటు నుంచి ఎలా పోటీ చేస్తారు అంటూ కూడా మౌలికమైన ప్రశ్ననే సంధించారు. పైగా ఆమె ఉప ముఖ్యమంత్రిగా ఎలా బాధ్యతలు ఎలా నిర్వహిస్తారు అని కూడా నిలదీశారు.

చెల్లెలు కానప్పుడు…?

ఇక ఎస్టీ కోటాలో ఒక టీచర్ ఉద్యోగానికి అనర్హురాలు అంటూ ఆమె చెల్లెలు రామ తులసిని సర్కార్ తొలగించిన సంగతిని కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. చెల్లెలు ఎస్టీ కాకపోతే అక్క పుష్ప శ్రీవాణి ఎలా అవుతుంది అంటూ పేర్కొనడంతో దీని మీద హైకోర్ట్ స్పందించి ఈ సంగతి తేల్చాలంటూ అందరికీ నోటీసులు ఇవ్వడంతో ఇపుడు పుష్ప శ్రీవాణి ఇరకాటంలో పడ్డారు. మరో ఆరు నెలల్లో ఎలాగో జగన్ పెట్టిన కోటా మేరకు ఉప ముఖ్యమంత్రి పదవి పోతుంది. ఈలోగానే కొంప మునిగింది అంటున్నారు. దీనితో పాటు ఆమె ఎమ్మెల్యే సీటుకు కూడా ఎసరు వచ్చిందని అంటున్నారు.

ఇరకాటమే …?

తాను ఎస్టీనేనని పుష్ప శ్రీవాణి చూపిస్తున్న రుజువు ఏంటి అంటే తహ‌శీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం. అయితే ఇలాంటి విషయాల్లో ఆర్డీవో కానీ ఆ పై స్థాయి అధికారులు మాత్రమే ఇచ్చిన ధృవీకరణ పత్రం మాత్రమే చెల్లుబాటు అవుతుంది తప్ప తహ‌శీల్దార్ ఇచ్చింది చెల్లదు అని పిటిషన్ దారు వాదిస్తున్నారు. దాంతో పాటు ఏపీ గిరిజన సంఘం నేతలు కూడా ఆమెను వెంటనే ఆ పదవి నుంచి తప్పించి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీని మీద 2019 లోనే గవర్నర్ కి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో పిటిషన్ దారులు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో ఇపుడు ఈ కేసు జటిలంగానే మారబోతోంది అంటున్నారు. మరి పుష్ప శ్రీవాణి ఏ విధంగా సమర్దించుకుని దీని నుంచి బయటపడతారో చూడాలి.

Tags:    

Similar News