ఆమె అలా….ఈమె ఇలా

యధ్భావం తద్భవతి అంటారు మనం ఎలా చూస్తే అలాగే లోకం కనిపిస్తుందని దాని అర్ధం. దీన్నే కాస్తా మార్చి రాసుకుంటే రాజకీయాల్లో ఎవరి స్టాండ్ ని బట్టి [more]

Update: 2019-08-06 08:00 GMT

యధ్భావం తద్భవతి అంటారు మనం ఎలా చూస్తే అలాగే లోకం కనిపిస్తుందని దాని అర్ధం. దీన్నే కాస్తా మార్చి రాసుకుంటే రాజకీయాల్లో ఎవరి స్టాండ్ ని బట్టి ఇతరులు అలాగ కనిపిస్తారన్నమాట. బీజేపీకి, వామపక్షాలకు తూర్పు పడమర లాంటి భారీ తేడా ఉంది. ఆ రెండూ ఎపుడూ కలవవు, ఒకటి ఎర్ర జెండా అయితే మరొకటి కాషాయం. దానికి తగినట్లుగానే కామెంట్స్ కూడా వస్తూంటాయి. జగన్ ప్రత్యేక హోదా కాడి వదిలేశాడని కామ్రెడ్స్ గుస్సా అవుతూంటే జగన్ ప్రత్యేక హోదా పేరు చెప్పి జనాలను మభ్యపెడుతున్నారని కాషాయదళం అంటోంది. జగన్ ప్రత్యేక హోదాకు ఎంత దూరమో, మరెంత దగ్గరో తెలియదు కానీ ఈ రెండు పార్టీల కామెంట్స్ చూస్తూంటే మాత్రం ఏది నిజం అన్న సంశయం రాక మానదు. అసలు జనాలు ఏది నమ్మాలో కూడా అర్ధం కాదు.

హోదా ఊసెత్తలేద‌న్న కామ్రేడ్….

జగన్ బీజేపీకి అనధికార మిత్రుడు, ఆ రెండు పార్టీల మధ్య కనబడని పొత్తులు ఉన్నాయని సీపీఎం జాతీయ నాయకురాలు బృందా కారత్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. విశాఖ టూర్లో ఆమె జగన్ ని ఓ స్థాయిలో కడిగిపారేశారు. ప్రత్యేక హోదా ఇవ్వమని బీజేపీ గట్టిగా చెబుతున్నా కనీసం మీ ఎంపీల గొంతు ఎందుకు పెగలదు అంతూ జగన్ ని గట్టిగా నిలదీశారు. హోదా ఊసు జగన్ మరచిపోయారని కూడా ఆమె ఆరోపిస్తున్నారు. అదే హోదా పేరు మీద జనంలో ఓట్లు తెచ్చుకున్న జగన్ 22 మంది ఎంపీలను దగ్గర పెట్టుకుని కేంద్రంలోని మోడీని ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని ఆమె నిలదీస్తున్నారు. మోడీ విధానాలు అంతగా నచ్చేశాయా, అందుకేనా ఆ పార్టీకి పార్లమెంట్ లో ఫుల్ సపోర్ట్ గా ఉంటూ అన్ని బిల్లులకు మద్దతు ఇస్తున్నారంటూ జగన్ ని ప్రశ్నిస్తున్నారు.

హోదా ఊసు మరవవా అంటున్న …

జగన్ హోదా ఊసు ఇంకా మరవకపోవడం దారుణమని బీజేపీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అంటున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అంశమని చెప్పినా కూడా జగన్ పదే పదే ఎందుకు ఆ విషయం ప్రస్తావిస్తున్నారంటూ చిన్నమ్మ మండిపడుతున్నారు. రాని హోదా కోసం పాకులాడడం జగన్ మానివేస్తే మంచిదని కూడా అమె ఉచిత సలహా ఇస్తున్నారు. జగన్ ఈ విషయాన్ని ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బాగుంటుందని కూడా అంటున్నారు. హోదా మేము ఇవ్వమని కూడా ఆమె పక్కా క్లారిటీగా చెబుతున్నారు. జగన్ ఈ విషయంలో మంకుపట్టు మానేసి కేంద్రం చేసే ఇతర సాయాన్ని తీసుకోవాలని సూచించారు. లేకపోతే చంద్రబాబుకు కి పట్టిన గతే జగన్ కీ పడుతుందని కూడా ఆమె శాపనార్ధాలు పెడుతున్నారు. మొత్తం మీద చూస్తే చిన్నమ్మ దృష్టిలో జగన్ హోదా అడుగుతూ నస పెట్టేస్తున్నారు. అదే కామ్రేడ్ బ్రుందా కారత్ కి మాత్రం జగన్ హోదాను పాతరేసేసిన మోసపూరిత నాయకుడు. ఇందులో ఏది నిజం. ఏది అబద్దం.

Tags:    

Similar News