భీమవరం అంజిబాబు బుజ్జగింపులు

రాజ‌కీయాల్లో అల‌క‌లు.. బుజ్జగింపులు కామ‌న్‌. సాధార‌ణంగా ఏ పార్టీలో అయినా ఎన్నిక‌ల‌కు ముందు నాయ‌కులు టికెట్ రాలేద‌నో? తాము సూచించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వలేద‌నో? లేదా తాము [more]

Update: 2020-02-07 00:30 GMT

రాజ‌కీయాల్లో అల‌క‌లు.. బుజ్జగింపులు కామ‌న్‌. సాధార‌ణంగా ఏ పార్టీలో అయినా ఎన్నిక‌ల‌కు ముందు నాయ‌కులు టికెట్ రాలేద‌నో? తాము సూచించిన అభ్యర్థికి టికెట్ ఇవ్వలేద‌నో? లేదా తాము వ్యతిరేకించే అభ్యర్థికి టికెట్ ఇచ్చార‌నో అల‌గ‌డం.. వారిని అధినేత‌లు బుజ్జగించ‌డం తెలిసిందే. అయితే, ఇప్పుడు దీనికి భిన్నంగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని బ‌తికించుకునే క్రమంలో పార్టీకి దూర‌మ‌వుతార‌ని సిగ్నళ్లు పంపుతున్న నాయ‌కుల‌ను బుజ్జగిస్తున్నారు. జ‌మిలి ఎన్నిక‌లు జ‌రిగితేనో.. జ‌గ‌న్ జైలు కు వెళ్తేనో.. రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని, సో.. అప్పుడు మ‌న పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని ఆయ‌న అల‌క‌బూనిన నాయ‌కుల‌కు హితోప‌దేశం చేస్తున్నారు.

పార్టీ మోసం చేేసిందని……

తాజాగా భీమ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే పుర‌ప‌ర్తి ఆంజనేయులు ఉర‌ఫ్ అంజిబాబును చంద్రబాబు ఊర‌డిస్తు న్నారు. టీడీపీలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుల్లో ఈయ‌న కూడా ఒక‌రు. 2009, కాంగ్రెస్ త‌ర‌పున విజ‌యం సాధించిన అంజిబాబు మాజీ మంత్రి టీడీపీ నాయ‌కుడు గంటా శ్రీనివాస‌రావుకు స్వయానా వియ్యంకుడు. గంటా కుమార్తెను అంజిబాబు కుమారుడు వివాహం చేసుకున్నారు. దీంతో ఇద్దరి మ‌ధ్య కుటుంబ సంబంధాలు కూడా ఏర్పడ్డాయి. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌న‌ను మోసం చేసింద‌నే భావ‌న అంజిబాబులో బ‌లంగా ఉంది. దీంతో ఆయ‌న పార్టీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు.

మూడో స్థానానికి…..

2014లో రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోవ‌డంతో అంజిబాబు ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ మారిన‌ప్పటికీ భీమ‌వ‌రం నుంచి విజ‌యం సాధించారు. ఇదే ఊపులో 2019లోనూ విజ‌యం సాధించాల‌ని అనుకున్నారు. అయితే, ఇక్కడ నుంచి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేయ‌డంతో లోపాయికారీగా టీడీపీ ఆయ‌న‌కు స‌హ‌క‌రించింది. దీంతో అంజిబాబు మూడో స్థానానికి ప‌డిపోయారు.

బాబు భీమవరం వెళ్లినా…

ప‌వ‌న్‌ను కావాల‌నే టీడీపీ అధిష్టానం భీమ‌వ‌రంలో పోటీ చేయించేలా ఎంక‌రేజ్ చేసింద‌ని, దీనివ‌ల్ల తాను చాలా ఇబ్బంది ప‌డ్డాన‌ని, ఆర్థికంగా నష్టపోవ‌డంతో పాటు మూడో స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింద‌న్న ఆవేద‌న ఆయ‌న‌లో ఉంది. త‌న‌కు పార్టీ నుంచి స‌హ‌కారం లేనందుకే తాను ఓడిపోయాన‌ని భావించిన అంజిబాబు అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత చంద్రబాబు భీమ‌వ‌రం వెళ్లినా కూడా ఆయ‌న అటు వైపే చూడ‌లేదు.

హైదరాబాద్ కు పిలిపించుకుని మరీ…..

ఇక ఆయ‌న పార్టీ కార్యక్రమాల‌కు దూరంగా ఉండ‌డంతో పార్టీ మార‌తార‌న్న ప్రచారం కూడా జరిగింది. అయితే, ఇటీవ‌ల అంజిబాబును చంద్రబాబు హైద‌రాబాద్‌కు పిలిపించుకుని చ‌ర్చించారు. దీంతో అంజిబాబు కూల్ అయిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి భీమ‌వ‌రం టీడీపీలో ఎగిసిన అసంతృప్తిని చంద్రబాబు చ‌ల్లార్చార‌ని అంటున్నారు. చంద్రబాబు అంజిబాబును ఎంత చ‌ల్లార్చినా ఆయ‌న మాత్రం త‌న వియ్యంకుడు మాజీ మంత్రి గంటా రూట్లోనే వెళ‌తారన‌డంలో సందేహం లేదు. మ‌రి అంజిబాబు టీడీపీ ప్రయాణం ఎప్పటి వ‌ర‌కు ఉంటుందో ? చూడాలి.

Tags:    

Similar News