గోదావరికి పులసలు వచ్చేశాయోచ్

మాంసాహార ప్రియులకు అందని ద్రాక్ష ఏది అంటే పులస అని టక్కున చెప్పేస్తారు. ఇది గోదావరి జిల్లాల్లో అరుదైన ఎన్వీ డిష్ ల్లో ఒకటి. మత్సరాజం గా [more]

Update: 2020-07-14 00:30 GMT

మాంసాహార ప్రియులకు అందని ద్రాక్ష ఏది అంటే పులస అని టక్కున చెప్పేస్తారు. ఇది గోదావరి జిల్లాల్లో అరుదైన ఎన్వీ డిష్ ల్లో ఒకటి. మత్సరాజం గా అంతా పిలుచుకునే పులస కేవలం గోదావరి కి ఎర్ర నీరు వచ్చాక మాత్రమే లభిస్తుంది.గోదావరికి జులై నుంచి సెప్టెంబర్ వరకు సాధారణంగా వరద కొనసాగుతుంది. ఈ సీజన్ లోనే పులసలు లభిస్తూ మాంసాహార ప్రియుల జివ్హా చాపల్యం తీరుస్తూ ఉంటాయి. సముద్రంలో విలస గా పిలువబడి అక్కడినుంచి విలాసంగా ఎర్ర నీరు సేవిస్తూ వరద గోదావరి కి ఎదురీత ఈదుతూ ఎగువ గోదావరి వైపు వస్తుంది పులస.

ధర ఎంతయినా …

దీనికి అనేక ప్రత్యేకతలు ఉండటం మత్సకారుల వేటలో అరుదుగా కేవలం మూడు లేదా నాలుగు నెలలు మాత్రమే లభించడం వల్ల ఇది ఎప్పుడు దొరుకుతుందా అని తహతహలాడిపోతారు పులస ప్రియులు. పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి అనే సామెత వుంది అంటే ధర ఎంతయినా దీనిని సీజన్ లో ఒక్కసారి అయినా తినాలి అన్నది గోదావరి వాసుల కోరిక.

వేట కోసం ….

పులస చేపకు వాడే వల కూడా విభిన్నంగా ఉంటుంది. ఉదయం వేటకు వెళ్లేవారు సాయంత్రానికి ఒక్కోసారి ఒక్క పులస ను కూడా లభించని రోజులు ఎన్నో. చేప వలను తాకినా లేక మనిషి దానిని ముట్టుకున్నా పులస ప్రాణం వదిలేస్తుంది. అంత అరుదైన లక్షణాలు పులస సొంతం. అయితే ఒక్క చేప దొరికితే సదరు మత్సకారులకు పంట పండినట్లే. ఎందుకంటె ఇంత కరోనా కష్టకాలంలో కూడా చేప సైజును బట్టి ఐదు వేలరూపాయల నుంచి పన్నెండు పదిహేనువేలరూపాయలు ధర పలికేస్తుంది. ఈ చేప కోసం అడ్వాన్స్ లు ఇచ్చేవారు అనేకమంది ఉంటారు. మరికొందరు చేప దొరికాక వేలం పాడుకుని పట్టుకుపోతారు. ధవళేశ్వరం, బొబ్బర్లంక, మద్దూరు ఆర్మ్, విజ్జేశ్వరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పులస అమ్మకాలు సాగుతూ ఉంటాయి.

సినీ, రాజకీయ ప్రముఖులకోసం …

గోదావరి పులస కు దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ పులస రుచి చూసిన టాలీవుడ్, పొలిటికల్ ప్రముఖులతో బాటు బడాబాబులు పులస పులుసు పార్సిల్స్ ను గోదావరి జిల్లాల నుంచి ఎంత ఖర్చు అయినా తెప్పించుకుంటారు. తమ బంధువులు, మిత్రుల ద్వారా సీజన్ రాగానే వెంటపడి మరీ పులస పులుసు రప్పించుకుంటూ ఉండటంతో ఈ మత్సరాజం కి మరింత క్రేజ్ ఏర్పడింది.

పులుసు తయారీ కూడా ప్రత్యేకమే …

ఇక పులస చేప పులుసు తయారీ కూడా మిగిలిన పులుసు ల మాదిరి తయారు చేయరు. దీన్ని తయారు చేసే విధానమే స్పెషల్. పులసను శుభ్రం చేసి ముక్కలు చేశాక దాన్ని గతంలో అయితే కుండ లో దాన్ని తయారు చేసేవారు. ఇప్పుడు రొటీన్ గిన్నెల్లోనే తయారు చేస్తున్నారు. పులస పులుసు లో ఆవకాయ ఊట తో బాటు వెన్నపూస, లేత బెండకాయలు దీనిలో వేస్తారు. ఇలా తయారైన పులస ఒకరోజు నిల్వ ఉంచి తరువాత రోజు వేడి వేడి అన్నంలో తింటారు.

డూప్లికేట్ పులసలు వచ్చేస్తుంటాయి…

పులస సీజన్ రాగానే ఒరిజినల్ పులస ల కన్నా డూప్లికేట్ పులసలే ఎక్కువగా మార్కెట్ లో రెడీ గా ఉంటాయి. వీటిని మాంసాహార ముదుర్లు గాని గుర్తించలేరు. ఒడిస్సా నుంచి, యానాం నుంచి వచ్చే విలసలను పులసలుగా విక్రయిస్తూ ఉంటారు. ఒరిజినల్ పులస గా గుర్తించడానికి కొన్ని గుర్తులు పెట్టుకుంటారు అంతా. రంగులు వేసి విక్రయిస్తున్నారా లేక అసలైందా నకిలీదా అని పరీక్షించడం వేలరూపాయలు పెట్టి కొనేవారు గమనించాలి.

Tags:    

Similar News