మీటర్ రివర్స్ తిప్పకుంటే కష్టమే మరి

ఏపీ సర్కార్ కి ఇప్పుడు ప్రజలకు వస్తున్న విద్యుత్ బిల్లులు షాక్ లు ఇస్తున్నాయి. రెండు నెలలకు ఒకేసారి బిల్లులు ఇవ్వడం తో పాటు వేసవి లో [more]

Update: 2020-05-16 08:00 GMT

ఏపీ సర్కార్ కి ఇప్పుడు ప్రజలకు వస్తున్న విద్యుత్ బిల్లులు షాక్ లు ఇస్తున్నాయి. రెండు నెలలకు ఒకేసారి బిల్లులు ఇవ్వడం తో పాటు వేసవి లో అత్యధికంగా కరెంట్ అంతా ఎక్కువ వాడటం, లాక్ డౌన్ ప్రభావంతో ప్రజలు ఇళ్ళకే పరిమితం కావడంతో కళ్ళు తిరిగేరీతిలో మీటర్ గిర్రున తిరిగి వినియోగదారులకు మైండ్ బ్లాంక్ చేస్తుంది. అదే ఇప్పుడు విపక్షాలకు అస్త్రంగా మారడంతో అధికారపార్టీ డిఫెన్స్ లో పడింది. దాంతో చాపకింద నీరులా ప్రజల్లో పెల్లుబికుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు సర్కార్ మంత్రులను సీన్ లోకి దింపింది. అయితే అటు విపక్షాలు ఇటు వినియోగదారుల ఆగ్రహం మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.

రెండు బిల్లులు ఇవ్వక పోవడంతో …

వినియోగదారుల విద్యుత్ మీటర్లకు లాక్ డౌన్ కారణంగా మార్చి నుంచి ఏప్రిల్ మాసానికి సంబంధించిన బిల్లులను విద్యుత్ శాఖ తీయలేదు. అయితే అంతకు నెలలో చెల్లించిన బిల్లునే ఆన్ లైన్లో చెల్లించాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది. వినియోగదారులు అత్యధికంగా పాత బిల్లుల మొత్తాన్ని చెల్లించారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో మార్చి , ఏప్రిల్ నెలల బిల్లులను ఒకే బిల్లు రూపంలో రీడింగ్ నమోదు చేసి ఇచ్చేశారు విద్యుత్ శాఖ నియమించిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది. ఇందులో ఏ నెలలో ఎంత వాడకం అయ్యిందో తీసే అవకాశం ఉండదు. కారణం మీటర్ రీడింగ్ నమోదు చేసుకునే యంత్రాలకు వుండే సాఫ్ట్ వేర్ లు గతంలో నమోదు అయిన రీడింగ్ నుంచి ప్రస్తుత రీడింగ్ వరకు బిల్లులు తీస్తాయి. దాంతో యూనిట్స్ స్లాబ్ లు మారిపోయి విద్యుత్ శాఖ ప్రకటించే అత్యధిక స్లాబ్ రేట్ లో ఉండే కేటగిరికి వినియోగదారుడి సర్వీసు వెళుతుంది. ఫలితంగా యూనిట్ ధర కూడా అత్యధికంగా చెల్లించాలిసి వస్తుంది. అదే ఏ నెలకు ఆ నెల డివైడ్ చేసి ఉంటె స్లాబ్ లు యూనిట్ ధర తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా బిల్లులు డివైడ్ చేయకుండా ఒకే బిల్లు ఇచ్చేయడంతో ప్రతి ఒక్క వినియోగదారుడు భారీ మొత్తాలను ఈ కష్టకాలంలో చెల్లించాలిసి వస్తుంది.

తప్పు సరిచేసుకోకపోతే…

నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేశామని. వెయ్యి రూపాయలు అందజేశామని, ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలు ఇప్పుడు విద్యుత్ బిల్లులు అందుకున్న వారికి కనిపించడం లేదు. వారికి దీనిపై సరైన వివరణ విద్యుత్ శాఖ ఇవ్వకపోవడంతో బాటు కట్టే మొత్తం రెండు నెలలకు చెల్లించాలిసి వస్తుండటంతో విపక్షాల వాదనకు జై కొడుతున్నారు. తక్షణం ఈ వ్యవహారాన్ని సరిచేయాలిసిన అధికారపక్షం ఏ నెలకు ఆ నెల బిల్లును ఇవ్వడంతో పాటు పాత బిల్లు మొత్తాన్ని మినహాయించి వినియోగదారుల చేతిలో పెట్టె పని చేయకుండా ఈ అంశాన్ని రాజకీయంగా చూస్తూ ఎదురుదాడి కి దిగడంతో ప్రయోజనం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా రెండు నెలల నుంచి ఇంట్లోనే ఉండటంతో విద్యుత్తు వాడకం ఎక్కువ అయి ఉండవచ్చు.

స్లాబ్ మారడంతో..

ఇప్పుడు ప్రతిఒక్కరికి ఎయిర్ కండిషన్డ్ అన్నది పేద రాజు తేడా లేకుండా వేసవిలో వినియోగిస్తున్నారు. ఇది ఖరీదు అయినప్పటికీ వాయిదాల రూపంలో ఎసి కంపెనీలు అందిస్తూ ఉండటంతో వీటి కొనుగోలు బాగా పెరిగింది. విద్యుత్ యూనిట్ల పెరుగుదలలో ఎసి ల వినియోగమే కీలకం. సాధారణంగా వేసవిలో ఏప్రిల్, మే లో ఏసీలు వినియోగించ కుండా ఉండేవారు బాగా తక్కువ. దాంతోబాటు రెండు నెలలు బిల్లులు ఒకే బిల్లుగా ఇవ్వడం స్లాబ్ మారి యూనిట్ రేటు పెరిగిపోవడం తో ఇప్పుడు ప్రతి వినియోగదారుడు విద్యుత్ బిల్లుల బాధితులే అయ్యారు. ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి జూన్ వరకు వినియోగదారులకు ఎపి సర్కార్ అవకాశం కల్పించినా ఇది కంటితుడుపు చర్యగానే అంతా భావిస్తున్నారు. మీటర్ రీడింగ్ లను తిరిగి తీయించి కట్టిన మొత్తాన్ని మినహాయించడంతో పాటు ఏ నెలకు ఆ నెల బిల్లు లు ఇచ్చేలా చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అంటున్నారు వినియోగదారులు. మరి సర్కార్ ఏమి చేయనుందో చూడాలి.

Tags:    

Similar News