ఆచార్యుడి సహనానికి పరీక్ష పెడుతున్నారా..?

Update: 2018-10-12 03:30 GMT

ప్రత్యర్థి పార్టీలు సీట్ల పంపకాలు అయ్యేలోపు తమ అభ్యర్థులు స్వీట్లు పంచుకుంటారని టీఆర్ఎస్ నేత కేటీఆర్ మహాకూటమిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అయితే, మహాకూటమి పరిస్థితి చూస్తే ఆయన మాటలే నిజమనేలా ఉంది. అమరుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పాలిస్తున్న కేసీఆర్ ను గద్దె దించడమే ప్రధాన అజెండాగా ఏర్పడుతున్న మహాకూటమికి ఎదురుదెబ్బలు తప్పేలా లేవు. ఓ వైపు ఎన్నికల షెడ్యూల్ వచ్చేసినా... సీట్ల సర్దుబాటు మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు. నెల రోజులుగా చర్చలు జరుపుతున్నా అసలు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది కూడా ఇంతవరకు తేలడం లేదు. ఇక ఏయే సీట్లు ఎవరికి అనే వరకు వచ్చాక లుకలుకలు భారీగానే ఉండనున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్ 90 శాతం స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంటే మహాకూటమి పార్టీలు మాత్రం వెనకబడిపోతున్నాయి. దీంతో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విరక్తి చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఒకదశలో ఆయన కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లో ఏదో ఒకటి తేల్చాలని డెడ్ లైన్ విధించారు. లేకపోతే తమ అభ్యర్థులను ప్రకటించేస్తామని ఆయన చెప్పారు. దీంతో అప్రమత్తమైన టీడీపీ కోదండరాంను బుజ్జగించి శాంతపరిచారు. దీంతో ఆయన రెండు రోజులు ఆగారు. అయితే, కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. దీంతో ఇవాళ పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

ఉమ్మడి మేనిఫెస్టోనే కీలకం...

మహాకూటమి ముందు ప్రధానంగా రెండు సవాళ్లు కనిపిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు ఒకటైతే, ఉమ్మడి మేనిఫెస్టో మరొకటి. ఇప్పడు పాలన ఒక కుటుంబం చేతిలో ఉందని ప్రధానంగా ఆరోపణలు చేస్తున్న మహాకూటమిలోని పార్టీలు.. తాము అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో ఉమ్మడి మేనిఫెస్టో తయారుచేయాలని నిర్ణయించాయి. ఇప్పటికే కూటమిలోని అన్ని పార్టీలు ప్రత్యేకంగా మేనిఫోస్టో కమిటీలు వేసుకుని వారి వారి మేనిఫెస్టోలు సిద్ధం చేసుకున్నారు. అయితే, ఒక్కటిగా పోటీచేస్తున్నప్పుడు మేనిఫెస్టో కూడా ఒక్కటే ఉండాలని, టీఆర్ఎస్ విఫలమైన ఉద్యమ ఆకాంక్షలకు ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ ఉమ్మడి మేనిఫెస్టో అమలు బాధ్యతలను ప్రొ.కోదండరాం కే ఇవ్వాలని కూడా చర్చ జరిగింది. అయితే, ఇంతవరకూ ఈ మేనిఫెస్టోకు సంబంధించి ఒక తుది రూపు రావడం లేదు. దీంతో ఇక ప్రజల్లోకి ఎప్పుడు వెళతామనేది కోదండరాం ప్రశ్నిస్తున్నారు.

సీట్ల లెక్కలు తేల్చేదెన్నడు...

మహాకూటమి చర్చలు కేవలం టీ తాగడానికి వెళుతున్నట్లుగా ఉందని స్వయంగా కోదండరాం వ్యాఖ్యానించారంటే ఆయన ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్థం అవుతుంది. సీట్ల కోసం తాము కూటమిలో చేరడం లేదని, ఈ ప్రభుత్వాన్ని దింపి అమరుల ఆకాంక్షలను అమలు చేయడం, ప్రజలకు ప్రజాస్వామ్య పాలన అందించడమే తమ లక్ష్యమని కోదండరాం అంటున్నారు. అదే సమయంలో కూటమిలో గౌరవప్రదమైన భాగస్వామ్యం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇక ఇప్పటికే ఆలస్యమైనందున త్వరగా మహాకూటమిలో ఉమ్మడి మేనిఫెస్టో ఏర్పాటు, అమలు, సీట్ల సర్దుబాట్లకు సంబంధించి తుది రూపు ఇవ్వాలని ఆయన అంటున్నారు. ఇక సీట్ల పంపిణీ విషయానికి వస్తే కూటమి కచ్చితంగా ఉండాలని భావిస్తున్న కోదండరాం మొదట 30 స్థానాలు అడిగినా 16 స్థానాలు ఇచ్చినా సర్దుకుపోవాలని నిర్ణయించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అవి కూడా ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. మొదట 3 సీట్లే ఇవ్వాలని అనుకున్న ఇప్పుడు 9 వరకు ఇద్దామనే నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. మహాకూటమి చర్చలు ఎంతకూ తెగకపోవడంతో కోదండరాం విరక్తి చెందుతున్నట్లు కనిపిస్తోంది. కేవలం పొత్తుల ద్వారానే టీఆర్ఎస్ ఓటమి సాధ్యమని ఆయన బలంగా నమ్ముతున్నందునే ఎంత కోపం ఉన్నా బయటపడటం లేదు.

Similar News