కమల కూటమిలో కత్తుల కౌగిలి

Update: 2018-06-06 02:05 GMT

బలవంతుని ముందు ఒదిగి ఉంటారు. బలహీనపడుతున్నట్లు కనిపిస్తే వెక్కిరింతలు మొదలు పెడతారు . తమ డిమాండ్లతో మరింత కుంగదీస్తారు. కుటుంబం నుంచి రాజకీయం వరకూ అన్ని చోట్లా ఇదే తంతు. హ్యూమన్ సైకాలజీ. నరేంద్రమోడీ తిరుగులేని శక్తిగా అప్రతిహత విజయాలు సాధిస్తున్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలుగా చేరిన పార్టీలు ఇప్పుడు విభేదాలకు సైతం సిద్ధమైపోతున్నాయి. ఆయన నీడలో సేదతీరితే చాలు అధికారం హాయిగా అనుభవించేయొచ్చని కలలు కన్నవారికి కాసింత అనుమానాలు మొదలయ్యాయి. మోడీ విజయప్రవాహంలో ఎటువంటి అలసట లేకుండా సాఫీగా సెయిల్ చేసి విజయతీరాలకు చేరిపోవాలని భావించిన రాజకీయపక్షాలు ప్రస్తుతం బేరసారాలకు దిగుతున్నాయి. కచ్చితంగా గెలుపు సాధ్యం కాదేమోననే సందేహంతో తమ స్టేక్ పెంచుకోవాలని చూస్తున్నాయి. జాతీయ పార్టీ బీజేపీపై ఆధిక్యం సాధించే ఎత్తుగడలు వేస్తున్నాయి. జేడీయూ, శివసేన, అకాలీదళ్ వంటి ప్రధాన మిత్రపక్షాల కొత్త పాట శ్రుతిమించి రాగాన పడుతోంది. మిత్రపక్షాలతో భేటీ అయ్యి 2019 ఎన్నికలకు ఎన్డీఏను సిద్దం చేయాలనుకుంటున్న బీజేపీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.

బీహార్ లో బీపీ...

ఉత్తరప్రదేశ్ లో తనకు వ్యతిరేకంగా సంఘటితమవుతున్న విపక్షాలు బీజేపీకి చెమటలు పట్టిస్తున్నాయి. జేడీయూ, ఎల్జేపీ , ఆర్ఎల్ఎస్పీ వంటి మిత్రపక్షాలతో బలంగా ఉన్నామని భావిస్తున్న బీహార్ లో రాజకీయ బీపీ పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో బీజేపీని జూనియర్ పార్టనర్ గా మార్చేయాలని జేడీయూ పావులు కదుపుతోంది. నిజానికి 2014 లోక్ సభ ఎన్నికల్లో జేడీయూ కేవలం రెండే సీట్లు తెచ్చుకోగలిగింది. లాలూ ప్రసాద్ ఆర్జెడీ 4 సీట్లు, కాంగ్రెసు 2 సీట్లు సాధించింది. మిగిలిన సీట్లన్నీ బీజేపీ మిత్రపక్షాలవే. మొత్తం 40 స్థానాలకు గాను 23 సీట్లను బీజేపీ గెలుచుకుంది. తనతో జట్టుకట్టినందుకు రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ లోక్ జనశక్తి కి మోడీ వేవ్ లో ఆరు సీట్లు దక్కాయి. ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయలోక్ సమతా పార్టీకి సైతం రెండు సీట్లు గెలుచుకోగలిగింది. ఇదంతా మోడీ కరిష్మాగానే చెప్పుకోవాలి. అదంతా గతం, 2019 కి పరిస్థితి అదేవిధంగా ఉంటుందని చెప్పలేకపోతున్నారు. నిన్నామొన్నటివరకూ అణిగిమణిగి ఉన్న మిత్రపక్షాలు గొంతు పెంచుతున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ స్వయంగా నిప్పు రాజేస్తున్నాడు.

అందరిలాంటి వాడే...

రెండు సార్లు బీజేపీతో జత కట్టి, మరోసారి కాంగ్రెసు, ఆర్జెడీలతో చెలిమి చేసి బీహార్ లో మూడుసార్లు అధికారంలోకి వచ్చిన సీనియర్ నేత నితీశ్ కుమార్. నరేంద్రమోడీ అంటే వ్యక్తిగతంగా పడదు. ఆయనకు తనను తాను సమఉజ్జీగా భావిస్తాడు. అందుకే మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పొత్తును విడిచిపెట్టి బయటికి వచ్చేశాడు. 2014 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి ఘోరంగా దెబ్బతిన్నాడు. తర్వాత కాంగ్రసు, ఆర్జెడీలతో చేతులు కలిపి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని నిలబెట్టుకున్నాడు. మోడీకి దీటుగా నిలవగల వ్యక్తిగా , కాంగ్రెసు సహా విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా కూడా ఆయన పేరు నానింది. 2019 ఎన్నికలలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని రాజకీయ జోస్యం చెప్పేశారు. కానీ 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ మేజిక్ చూశాకా దేశంలో బీజేపీకి తిరుగులేదని భావించి నితీశ్ ప్లేటు ఫిరాయించేశారు. మోడీతో తనకున్న వైరాన్ని పక్కనపెట్టేశారు. తన ప్రధాని పదవి ఆశలు నెరవేరేవి కాదని నిర్ధరణకు వచ్చేశారు. అవినీతి కేసులతో పక్కలో బల్లెంలా ఉన్న ఆర్జెడీని వదిలించేసుకుని మోడీతో చేతులు కలిపేశారు. బీజేపీ, జేడీయూ సంకీర్ణం ఏర్పాటైంది. పార్టీ సీనియర్ నేత శరద యాదవ్ వ్యతిరేకించినా లెక్క చేయలేదు. తనకున్న రాజకీయఅవకాశాలను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసేసుకున్నారు. ప్రధాని రేసులోని వ్యక్తిగా ప్రతిపక్షాలు నితీశ్ పై పెట్టుకున్న నమ్మకం వమ్మయిపోయింది. ఇప్పుడు మళ్లీ బీజేపీ , మోడీ హవా తగ్గుతోందని గ్రహించి జేడీయూ ని బలోపేతం చేసుకోవడం పై ద్రుష్టి పెట్టాడాయన. బీజేపీ ని నష్టపరిచి తన పార్టీకి ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలనే వ్యూహంలో నిమగ్నమయ్యాడు.

ముగింపు సాధ్యమేనా..?

అనువుగాని చోట అధికులమనరాదు అన్నట్లుగా బీజేపీ అధినాయకులైన మోడీ, అమిత్ షాలు ఇప్పుడిప్పుడే వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నారు. మిత్రులను దూరం చేసుకుంటే భారీగానే నష్టపోతామనే విషయం వారికి అర్థమైంది. అందుకే కత్తులు దూస్తున్న శివసేనతో సైతం విభేదాలు మరిచి చర్చలు మొదలు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలు, ముంబై నగరపాలక ఎన్నికల నాటి చేదు అనుభవాలను మరిచిపోవాలని సేనకు విజ్ణప్తి చేస్తున్నారు. కూల్ చేయాలని చూస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన కంటే బీజేపీ బలంగా తయారైంది. బాల్ ఠాక్రే, ప్రమోద్ మహాజన్ ల క్రుషితో 1989లో కుదుర్చుకున్న పొత్తు మోడీ హవా మొదలయ్యేవరకూ సాఫీగానే నడిచింది. మోడీ, అమిత్ షాల దూకుడు, ఆధిపత్య ధోరణుల కారణంగా రెండు పార్టీల సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఎన్డీఏ రాజకీయ పక్షాల సమావేశానికి ముందుగానే దీనిని ప్యాచప్ చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. శివసేన తన కోర్టులోకి బంతి వస్తే ఆడుకొంటుంది. అందువల్ల మరాఠా చిచ్చు అంత తొందరగా చల్లారిపోతుందని చెప్పలేం. 2014లో బీహార్లో కేవలం రెండు లోక్ సభ స్థానాలను మాత్రమే తెచ్చుకున్న జేడీయూ 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామంటూ చెబుతోంది. మిగిలిన 15 మాత్రమే బీజేపీకి వదులుతామంటోంది. ఇక్కడ బీజేపీకి 23 లోక్ సభ స్థానాలు, లోక్ జనశక్తి కి 6, ఆర్ఎల్ ఎస్పీ కి రెండు స్థానాలున్నాయి. జేడీయూ డిమాండు నెరవేరిస్తే వీరంతా మట్టికొట్టుకుపోవాలి. సిట్టింగు స్థానాల్లో సైతం ఆ పార్టీల ఎంపీలు పోటీ చేయలేరు. బీజేపీ తన ఎంపీలు పోటీ చేసే స్థానాలను సగానికి కుదించుకోవాలి. ఇదంతా పార్టీలో అంతర్గత సంఘర్షణకు దారితీస్తుంది. బీజేపీ తనను చిన్నచూపు చూస్తోందని పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ చిర్రెత్తిపోతోంది. బీజేపీ ఇక్కడ జూనియర్ పార్టనర్. పెద్దగా ఎదగాలనే ప్రయత్నంలో ఉంది. తోక కత్తిరించాలనే ఎత్తుగడలో ఉంది అకాలీదళ్. ఎన్డీఏలో ఈ కత్తుల కౌగిలి ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. ఎన్డీఏ పక్షాల సమావేశంలో దీనికి ముగింపు పలకాలనేది కమలనాథుల యోచన. ఇందుకోసం మిత్రులతో రాజీ పడేందుకు సైతం సిద్దపడాలని బీజేపీ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం.

ఎడిటోరియల్ డెస్క్

Similar News