ఫాస్ట్ ట్రాక్ ఫార్స్

చట్టం ముందు న్యాయం చాలా సందర్భాల్లో చిన్నబోతుంది. జనం భావోద్వేగాలు, సమూహం ఆలోచనలు ఉన్న తీరుగా చట్టాలు., కోర్టు లు ఆశించిన ఫలితాలు ఇవ్వవు. చట్ట పరిధి, [more]

Update: 2019-12-02 08:00 GMT

చట్టం ముందు న్యాయం చాలా సందర్భాల్లో చిన్నబోతుంది. జనం భావోద్వేగాలు, సమూహం ఆలోచనలు ఉన్న తీరుగా చట్టాలు., కోర్టు లు ఆశించిన ఫలితాలు ఇవ్వవు. చట్ట పరిధి, సాక్ష్యాధారాలు, వాదించే వారి సామర్థ్యం కూడా చాలా సందర్భాల్లో తీర్పులని ప్రభావితం చేస్తుంటాయి. హైదరాబాద్ లో వైద్యురాలిపై జరిగిన ఘటన తెలియగానే సగటు హృదయం కోరుకునే స్పందన., హత్య చేసిన వాళ్ళని అంతకంటే క్రూరంగా శిక్షించాలని. ఘటన గురించి తెలిసిన వారిలో మూడొంతుల కంటే ఎక్కువ మంది ఇలాంటి అభిప్రాయాన్ని, న్యాయాన్నే కోరుకుంటారు. మన చట్టాలకు నేర తీవ్రత కంటే, సాక్ష్యాధారాల బలమే శిక్షల ఖరారుకి ప్రామాణికం కాబట్టి సత్వర తీర్పు కొరలేం. ఈ క్రమంలో సహజంగానే పాలన యంత్రాంగం, రాజకీయ నాయకులు తమ సహజ ధోరణిలో నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం, చట్టం ముందు దోషులుగా నిలబెడతాం అని గంభీరంగా ప్రకటిస్తాయి. నిజానికి ఇవి రెండూ పరస్పర విరుద్ధ ప్రకటనలు. రెండు కలిసి బాధితులకు కోరుకున్న న్యాయం అన్ని సందర్భాల్లో జరగదు.

నేరము-శిక్ష…..

పదిహేనేళ్ల క్రితం విజయవాడ శారదా కాలేజీలో ఎంసీఏ విద్యార్థిని శ్రీలక్ష్మిని సహాధ్యాయి మెదర కత్తితో నరికి చంపాడు. అప్పుడు రాష్ట్రం మొత్తం అట్టుడికి పోయింది. ఈ ఘటన వెనుక ప్రేమోన్మాదం అని విస్తృత ప్రచారం జరిగినా, అది కూడా పాక్షిక సత్యమే. హత్య చేసిన మనోహర్ లోని క్రూరత్వమే జనం అతడిని కఠినంగా శిక్షించాలని కోరుకోడానికి కారణం అయ్యింది. హత్యను సమర్దించుకోడానికి మనోహర్ తన న్యాయవాదులతో చెప్పుకున్న వివరణలు ఎలా ఉన్నా జనం మొత్తం ఆవేశంతో ఊగి పోయారు. సరిగ్గా ఏడాదిన్నర తర్వాత 2005లో ఈ కేసు తీర్పు వెలువడింది. విజయవాడ సెషన్స్ కోర్ట్ హాల్లోకి కేవలం న్యాయ వాదులను, కొద్ది మంది మీడియా ప్రతినిధులు మాత్రమే అనుమతించారు.

ఆ హత్య అత్యంత అరుదా….

శ్రీ లక్ష్మీ హత్య కేసు తీర్పు వెలువరించిన రోజు కోర్టు బయట రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. న్యాయ మూర్తి తీర్పు వెలువరించే ముందు మనోహర్ అక్క, మేనత్త తరపున సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహన్ రావు వాదనలు వినిపించారు. శ్రీ లక్ష్మీ హత్య కేసు విషయంలో అప్పటి వరకు జరిగిన వాదనలకు భిన్నంగా ఆయన వాదన సాగింది. నేరాల కట్టడికి క్యాపిటల్ పనిష్మెంట్ ఒక్కటే మార్గం కాదని, రేరెస్ట్ ఆఫ్ రేర్, అత్యంత అరుదైన, అప్పటి వరకు కనివిని ఎరుగని సందర్భాల్లో మాత్రమే దోషులకు మరణ శిక్ష విధించాలని ఆయన వాదించారు. శ్రీలక్షి ఘటన దారుణం, పాశవికం అయినా అత్యంత అరుదైన ఘటన మాత్రం కాదని, మరణ శిక్షల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో మనోహర్ కి శిక్ష విషయంలో పునరాలోచించాలి అని ఆయన డిమాండ్ చేశారు.

అప్పుడు కూడా ఇదే తరహా ఆందోళన….

ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత జరిగిన తొలి ఘటన ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికడానికి కొంత కారణం అయ్యుండొచ్చు. ట్రయల్ జరిగినప్పటి నుంచి శిక్ష పడే వరకు నిత్యం శ్రీ లక్ష్మీ హత్య ఉదంతం జనం నోళ్ళలో నానుతూ వచ్చింది. చివరకి సెషన్స్ కోర్టులో హత్యాభియోగలపై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చలపతి రావు మరణ శిక్ష ఖరారు చేశారు. ఎంసీఏ విద్యార్థిని హత్య విషయంలో జనాగ్రహం, ఆందోళనలు చూసి తీర్పు ఇవ్వడంలో తానేమీ తీర్పు ఇవ్వడంలో ప్రభావితం కాలేదని కూడా ఆయన పేర్కొన్నారు. తర్వాత నిందితుడి తరవున ఉన్నత న్యాయస్థానం లో శిక్షను సవాలు చేయడం మరణ శిక్ష కాస్త యావజ్జీవంగా మారింది. ఈ సమయంలో కింది కోర్టు తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఉన్నత న్యాయ స్థానాలు తప్పు పట్టడం కూడా గుర్తు చేసుకోవాలి. ఏదైమైనా బాధిత కుటుంబం కోరుకున్న న్యాయం జరిగిందా, జనం ఆందోళనలు ఫలించాయా అంటే.., నిందితుడు జైల్లో ఉన్నాడు కనుక శిక్ష పడింది అనుకోవాలా., జనం కోరిన శిక్ష పడలేదు కాబట్టి న్యాయం జరగలేదు అనుకోవాలా…?

న్యాయం నిరాకరిస్తే…..?

శ్రీలక్ష్మి ఉదంతంలోనే సుప్రీంకోర్టు ఓ కీలక తీర్పు ఇచ్చింది. 2004లో నిందితుడి తరపున ఎవరు వాదించకూడదు అని బెజవాడ బార్ అసోసియేషన్ తీర్మానం చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. నిందితుడికి న్యాయ సహాయాన్ని తిరస్కరించే హక్కు న్యాయవాదులకు ఉండదు అని, వైద్యులు, లాయర్లు తమ కర్తవ్యాన్ని నిరాకరించే అవకాశం లేదని స్పష్టం చేసింది. అవసరం అయితే నిందితులకు తామే లీగల్ ఎయిడ్ అందిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత డేవిడ్ రత్న కుమార్, మరో న్యాయవాది నిందితుల తరవున వాదనలు వినిపించారు.

నేరాలు ఎక్కడ తగ్గాయి….?

శ్రీ లక్ష్మీ హత్య జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత డిసెంబర్ లో తెల్లవారు జామున మూడు నాలుగు గంటల మధ్య పిటిఐ వైర్ లో అలెర్ట్ బ్లింక్ అవుతూ , బెల్ మొగుతూ కనిపించింది. ఢిల్లీ శివారులో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థిని మీద అత్యాచారం, వివస్త్ర చేసి రోడ్డున విసిరేసారని రెండు లైన్లు… అప్పటికీ టీవీ ఏజెన్సీ కాపీలలో అది రాలేదు. పిటిఐ వైర్ మాత్రమే బ్లింక్ అవుతోంది. కాసేపటికి దాన్ని డిలీట్ చేసి మళ్ళీ అప్ డేట్ చేశారు. స్కూల్ బస్ లో ఆ ఘోరం జరిగింది అనే మరో అప్ డేట్. అన్ని పత్రికలకు అది మర్నాటి వార్త. వారంతాల్లో టీవీ డెస్క్ లు నిద్రపోతుంటాయి. బయటకు రాని ఇలాంటి ఘోరాలు చాలా జరిగి ఉంటాయి కానీ, వైర్ కాపీలో వచ్చిన ఒక్కో వాక్యం ఆ ఘటన ఊహిస్తే హృదయం మెలి తిప్పేంత బాధ. లోకల్ అప్ డేట్ కోసం ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేస్తే, రోజూ ఎన్నో రేప్ లు జరుగుతాయి, అన్నీ హడావుడి చేయలేముగా అన్నా సమాధానం వచ్చింది. పిటిఐ అప్ డేట్ లు విన్నాక అవతలి వ్యక్తి రియాక్షన్ మారిపోయింది. ఆ రోజు సాయంత్రానికి అది కార్చిచ్చుగా మారి చివరకి ఇండియా గేట్ నుంచి నార్త్ బ్లాక్ వరకు, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్ వీధులనే ముట్టడించే స్థాయిలో ఆందోళనలు జరిగాయి. అదే రోజు మధ్యాహ్నం పిటిఐ ఫోటోలు, పేర్లు పంపినా అవి వాడొద్దని సూచన కూడా చేసింది.అందుకే దేశం మొత్తానికి ఆమె నిర్భయగానే పరిచయం అయ్యింది. ఈ అసలు నేరాన్ని ప్రేరేపించిన వాడు మైనర్ కోటాలో తప్పించుకుంటే, మరొకడు జైల్లో ఖైదీల దాడిలో హతమయ్యాడు. ఆరేళ్ళ తరువాత కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు గాల్లో ఊగిసలాడుతోంది.

ఏది న్యాయం, ఏది చట్టం….

?

విజయవాడ అయేషా మీరా, వరంగల్ ప్రణీత, పటమట బ్యాంక్ ఉద్యోగి భార్య హిమ బిందు….. హైదరాబాద్ అభయ…. ఇలా ఒక్కో కేసుది ఒక్కో కథ…. ఒక్క ప్రణీత ఆసిడ్ దాడి ఘటనలో మాత్రమే ప్రజలు కోరిన తక్షణ న్యాయం జరిగింది.మిగిలిన చాలా కేస్ లలో కింది కోర్టు తీర్పులు, వాటిలో లోపాలు, న్యాయాన్ని కొనగలిగే దోషుల సామర్ధ్యం మీద శిక్షలు ఆధారపడి ఉంటాయి. ప్రతి నిమిషం, ప్రతి పూట, ప్రతి చోట ఏదొక చోట ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో గుండెల్ని మెలి తిప్పేవి కొన్ని, బాధితులు న్యాయం కోసం పోరాడలేనివి మరికొన్ని. మన న్యాయ వ్యవస్థ, చట్టబద్ధంగా దోషులు తప్పించుకునే అవకాశాలు కల్పిస్తున్నపుడు ఫాస్ట్ ట్రాక్ తీర్పులు కూడా ఓ ఫార్స్ అవుతుంది. ఇప్పుడు కూడా డాక్టర్ ప్రియాంకరెడ్డి వ్యవహారంలో పశువుల కంటే హీనమైన దోషుల్ని శిక్షించలేని అసమర్థ వ్యవస్థలను చూసి బాధపడటం తప్ప ఏమీ ఆశించకూడదు.

Tags:    

Similar News