ప్రియమైన పిలుపు…!

కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు ప్రియాంక గాంధీ ముందుకు రావాలని గడచిన నాలుగైదేళ్లుగా ఆపార్టీ నేతలు కోరుకొంటున్నారు. 2019లో బీజేపీ వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన [more]

Update: 2020-03-04 16:30 GMT

కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు ప్రియాంక గాంధీ ముందుకు రావాలని గడచిన నాలుగైదేళ్లుగా ఆపార్టీ నేతలు కోరుకొంటున్నారు. 2019లో బీజేపీ వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. పార్టీ వారసుడు రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ తిరిగి బాధ్యతలు స్వీకరించేందుకు ససేమిరా అనడంతో పార్టీ దిక్కులు చూస్తోంది. ప్రియాంక ఇటీవలి కాలంలో కొంత యాక్టివ్ గానే ఉంటున్నారు. కానీ దేశవ్యాప్తంగా పార్టీని పునర్నిర్మించే కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఉత్తరప్రదేశ్ లోని ఒక ప్రాంతానికే తన బాధ్యతలను కుదించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు వేదికగా పార్టీ వాయిస్ వినిపించే పనిలోకి అయినా ప్రియాంక గాంధీని దింపాలని పార్టీలోని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. సోనియా, రాహుల్ గాంధీలు సైతం ఇందుకు అనుకూలంగానే ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే ప్రియాంక మనసులో ఏముందనే సంగతి మాత్రం తెలియదు. ఈ నెలలో సాగనున్న రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక చోట నుంచి పెద్దల సభలో ఆమె ప్రవేశించాలని కాంగ్రెసు నేతలు అభ్యర్థిస్తున్నారు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలను పార్టీ ఆశిస్తోంది. పెద్దల సభలో కాంగ్రెసు వాణి బలంగా వినిపించే అవకాశం ఉన్నప్పటికీ ఇంతవరకూ ఫోకస్ రావడం లేదు. ప్రియాంక ప్రవేశిస్తే ఆ కొరత తీరుతుంది. దాంతోపాటు అధికారికంగా విధానపరమైన నిర్ణయాల్లో పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పడానికి వీలవుతుంది. ఇంతవరకూ గులాం నబి అజాద్ వంటి నేతలు రాజ్యసభలో మాట్లాడుతున్నప్పటికీ పార్టీ వాయిస్ ప్రజల్లోకి వెళ్లడం లేదు. వారికి ప్రసారమాధ్యమాలు, ప్రజలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పార్టీ శ్రేణులు సైతం గుర్తించడం లేదు. లోక్ సభలో ఎలాగూ సోనియా, రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభ లో కూడా ప్రియాంక ఉంటే చట్టసభల్లో రాజకీయ పోరాటానికి కొంత ఉత్తేజం లభించినట్లవుతుంది.

రాహుల్ కష్టాలు…

రాజకీయాల్లో యువతరం ప్రవేశించాలి. దేశ విధానాల్లో మార్పులు రావాలనేది కాంగ్రెసు వారసుడు రాహుల్ ఆశయం. అయితే పార్టీలోనే ఆయన ఆలోచన విధానాలకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. పార్టీలో పాతుకు పోయిన వృద్ధతరం రాహుల్ మాటలను పెద్దగా పడనీయడం లేదు. నాలుగైదు సార్లు కేంద్రమంత్రులుగా , ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే ఇంకా తమకు పదవులు కావాలని పట్టుకుని వేలాడుతున్నారు. రాజస్థాన్ , మధ్యప్రదేశ్ వంటి చోట్ల యువ ముఖ్యమంత్రులకు స్థానమివ్వాలని రాహుల్ బలంగా భావించారు. కానీ పార్టీలో తన మాట చెల్లలేదు. సోనియాగాంధీ ఆశ్రయంతో పాతకాపులే పదవులు కొట్టేస్తున్నారు. తమ మాట నెగ్గించుకుంటున్నారు. అవినీతి ముద్రలు, చాందసభావజాలాలతో కొట్టుమిట్టాడుతున్న చిదంబరాలు,అహ్మద్ పటేళ్లు, గులాం నబీ అజాద్ , దిగ్విజయ్ సింగ్ వంటివారే ఇంకా పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నారు. వివిధ అంశాలపై వీరి వైఖరి నచ్చకపోవడం, తాను తీసుకున్న నిర్ణయాలు సైతం మార్చుకోవాల్సి రావడంతోనే రాహుల్ గాంధీ విసుగెత్తిపోయారనేది పార్టీ వర్గాల ఆరోపణ. పార్టీలో కొత్త రక్తాన్ని ఎక్కించడానికి , ఉత్తేజం నింపడానికి అడుగడుగునా పెద్దనాయకులు అడ్డుతగులుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పదవులను త్యాగం చేసి కొంచెం దూరంగా ఉంటున్నారు రాహుల్. తనను చూసైనా వృద్ధ నాయకులు పదవులు విడిచిపెడతారేమోనని రాహుల్ ఆశించారు. కానీ నాయకులు ఎవరూ అంతటి త్యాగాలు చేసేందుకు సిద్ధం కాలేదు.

సంధాన కర్త….

ప్రియాంక రాజ్యసభలో ప్రవేశిస్తే కచ్చితంగా పార్టీ వాయిస్ గా ఆమె మారతారు. క్రమేపీ కార్యకలాపాలపైన అదుపు సాధిస్తారు. పార్టీకి నేరుగా ఆమె జవాబుదారీ అవుతారు కాబట్టి నిర్ణయాల్లో వేగం పెరుగుతుంది. రాహుల్ తో సమన్వయం చేసుకుంటూ లోక్ సభ, రాజ్యసభల్లో పార్టీని మరింత సమర్థంగా నడపడానికి వీలవుతుంది. అందుకే ఆమె పై ఒత్తిడి పెరుగుతోంది. సోనియా కోటరీగా మారిన కాంగ్రెసు పెద్దలకు కళ్లెం వేయాలంటే ప్రియాంక రావడమే సరైన పరిష్కారంగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాహుల్, సోనియా ల మధ్య పార్టీ పరంగా నిర్ణయాల్లో విభేదాలు తలెత్తిన సందర్బాల్లో ప్రియాంక చురుకైన పాత్ర పోషిస్తారనేది పార్టీ వర్గాల సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే సంధానకర్త పాత్ర పోషిస్తారని పార్టీ నేతలు చెబుతుంటారు. వ్యక్తిగతంగా కుటుంబ బాధ్యతల్లో ఆమెపై ఒత్తిడి తగ్గిన నేపథ్యంలో రాజకీయంగా తగినంత సమయం కేటాయించేందుకు ప్రస్తుతం వీలవుతుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రియాంకను రాజ్యసభలో చూడాలని కాంగ్రెసు శ్రేణులు ముచ్చటపడుతున్నాయి.

క్రౌడ్ పుల్లర్…

ప్రియాంక గాంధీ యువతరానికి ప్రతినిధి మాత్రమే కాదు, చురుకుదనం, వ్యవహార నైపుణ్యం తెలిసిన నాయకురాలు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నియోజకవర్గాల్లో ప్రచారం, ఎన్నికల వ్యూహాలను ఆమె స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. అయితే తన పరిధిని పెంచుకుని దేశవ్యాప్తంగా పార్టీకి అండగా నిలిచే విషయంలో ఆమె చొరవ చూపడం లేదు. దేశానికి ఇప్పుడు కాంగ్రెసు పార్టీ అవసరం చాలా ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. నరేంద్రమోడీ, అమిత్ షా నాయకత్వంలో బీజేపీ బాగా బలపడింది. అదే సమయంలో కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా దెబ్బతింది. ఏకపక్ష భావనలతో దేశ లౌకిక స్వరూపం దెబ్బతింటోందనే ఆందోళన కాంగ్రెస్ వాదుల్లో కనిపిస్తోంది. అధికారం చేజిక్కించుకున్నా, లేకపోయినా ప్రతిఘటన శక్తిగా అయినా కాంగ్రెస్ పుంజుకోవడం దేశానికి అవసరమని మేధావులు సైతం అంగీకరిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెసు నాయకత్వంలో ఆ జవసత్తువలు కొరవడ్డాయి. ప్రియాంక చేదోడుగా నిలిస్తే కాంగ్రెసు కోలుకొంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జనాకర్షణ శక్తి కలిగిన ప్రియాంక గాంధీ దేశంలో పర్యటనలు చేస్తూ వివిధ అంశాలను ప్రజల్లో ప్రచారం చేయడానికి ఇదే అనువైన సమయమని పార్టీలోని ప్రముఖులు సైతం అంగీకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పట్ల కొన్ని వర్గాలు, ప్రాంతీయ పార్టీల్లో అనుమనాలు , సందేహాలు నెలకొన్న స్థితిలో ఆయా అంశాలపై కాంగ్రెసు పార్టీ విధానాలను వివరించి చెప్పడం ద్వారా మద్దతు కూడగట్టవచ్చు. తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోవచ్చు అనేది ఆశావాదుల భావన. ప్రియాంక ఈ మొర ఆలకిస్తారా? లేక తన పాత పద్ధతిలోనే ఉదాసీనంగా ఉండిపోతారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News