ప్రధానులు...‘చక్ర’వర్తులు...!!

Update: 2018-12-20 15:30 GMT

రాజకీయాల్లో పదవులను అధిష్టించేవారుంటారు. వారికి అన్నివిధాలుగా సహకరించి పదవీభాగ్యం కలిగేలా చూసే కింగ్ మేకర్లుంటారు. తలలో నాలికలా వ్యవహరించే అనుచరులు, పల్లకి మోసే కార్యకర్తలు, ప్రాపకం పొందుతూ పైరవీలు చేసే కోటరీ అంతా కలిస్తేనే రాజకీయం. భారత రాజకీయాలు ఎన్నికలకు చేరుతున్న తరుణంలో తాజాగా ‘చక్ర’వర్తులు పుట్టుకొస్తున్నారు. ద్విపాత్రాభినయం చేయాలనుకోవడం వీరి ప్రత్యేకత. అవకాశం దొరికితే ప్రధాని కావాలి. లేకపోతే చక్రం తిప్పే సారథి కావాలి. రెండే మార్గాలు. కింగ్ మేకర్ పాత్రతో సరిపుచ్చుకుందామనుకునే అల్పసంతోషులు కాదు వీరు. దీనివల్ల 2019 ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఏర్పడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారథుల సంఖ్య పెరిగిపోయింది. ఇది రాజకీయాల్లోని అస్థిరతకు అద్దం పడుతోంది. జాతీయ పార్టీలు బలంగా ఉంటే ఇటువంటి స్థితి ఉత్పన్నం కాదు. వాటి బలహీనత కారణంగా ప్రాంతీయంగా ప్రజాకర్షణ, ఆదరణ కలిగిన నేతలు చక్రం తమ చేతిలోకి తీసుకోవాలని చూస్తున్నారు. కాంగ్రెసు తో కూడి ఏర్పడే కూటమికే ఈ తలనొప్పుల బెడద ఎక్కువగా కనిపిస్తోంది. రాహుల్ అనుభవరాహిత్యాన్ని ఆసరాగా చేసుకుంటూ ఆడింది ఆటపాడింది పాటగా కూటమిని తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకునే యావ మొదలైంది.

స్ట్రెయిట్ గా స్టాలిన్...

తమిళనాడులో ఏఐఏడీఎంకే దాదాపు నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి రోజులు లెక్కపెట్టుకుంటోంది. ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం తన తైనాతీని పెట్టి కీలుబొమ్మగా ప్రభుత్వాన్ని నడుపుతోందనుకోవచ్చు. జనాకర్షణ కలిగిన సమర్థ నాయకుడు లేని నేపథ్యంలో మైనారిటీ ప్రభుత్వం ఇప్పటికే కుప్పకూలి ఉండేది. డీఎంకే నాయకులు కేంద్రంతో కొంతమేరకు ఈవిషయంలో చర్చలు జరిపినట్లు కూడా ప్రచారం ఉంది. రాష్ట్రపతి పాలన పెట్టి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పెడితే డీఎంకే అధికారంలోకి వస్తుంది. దానివల్ల తమకు పెద్ద ప్రయోజనం లేదని గ్రహించిన కమలనాథులు ఏఐఏడీఎంకే పాలన కొనసాగడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. లోపాయికారీగా 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే సహకారంతో కొన్ని సీట్లు గెలుచుకోవచ్చని ప్లాన్ వేశారు. ఈలోపు తాము కూడా సొంతంగా కొంత బలపడే ఛాన్సు ఉందని స్థానిక నాయకులు అధిష్ఠానానికి నివేదించారు. మొత్తం పరిస్థితిని ఆకళింపు చేసుకున్న తర్వాతనే రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అంటూ డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటన చేశారు. కాంగ్రెసుకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే మిత్రపక్షాల్లో తమకు ప్రథమ ప్రాధాన్యం ఉండాలనే ఉద్దేశం ఈప్రకటనలో దాగి ఉంది.

బహుముఖ లౌక్యంతో బాబు...

చంద్రబాబు పైకి కొన్ని నిజాలు చెప్పలేరు. ఏపీ రాజకీయాలను కుమారుడు లోకేశ్ కు అప్పగించి కేంద్రానికి వెళ్లాలనే యోచన ఆయనలోనూ దాగి ఉంది. అయితే లోకేశ్ తనను తాను ప్రూవ్ చేసుకోకపోవడం వల్ల రిస్కు చేయలేకపోతున్నారు. పైపెచ్చు ప్రధాని అభ్యర్థిగా తన పేరు వేరెవరూ ప్రతిపాదించకపోవడమూ ఆయనకు ఇబ్బందిగా మారింది. రాహుల్ , మమత, మాయావతి , శరద్ పవార్ వంటి వారినెవరినీ ఈ రేసులో ప్రోత్సహించకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. అవకాశం కలిసొస్తే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. అయితే ఎవరో ఒకరు తన మెడలో గంట కట్టాలి. ఒకవేళ అది జరగకపోతే చక్రవర్తిగా చక్రం తిప్పడంతో సంత్రుప్తి పడతారు. కాంగ్రెసు, ఇతర ప్రాంతీయ పార్టీలతో ఈ విషయంలో చాకచక్యంగా, లౌక్యంగా ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు. దేవెగౌడ, మమత, మాయావతి వంటి వార్లపేర్లు బయటికి రావడాన్ని ఆయన ఇష్టపడటం లేదు. కాంగ్రెసు కూటమిలో ఉన్న నాయకుల్లో తానే అత్యధిక అనుభవం కలిగిన రాజకీయవేత్తననేది చంద్రబాబు భావన. ఆయన రాజకీయ చాణక్యాన్ని మిత్రులను కలపడానికి వాడుకోవాలనేది కాంగ్రెసు యోచన. మొత్తమ్మీద ఈ రాజకీయ చాలనంలో ఎవరు పై చేయి సాధిస్తారనేదే అంతుపట్టని రహస్యం.

మళ్లీ రాదు చాన్స్ ...

గతంలో ఎన్నడూ లేనంత అవకాశం ఈసారి తమకోసం ఎదురుచూస్తోందని భావిస్తున్నారు మమతా బెనర్జీ, మాయావతి, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్ వంటి వారు . వీరంతా పోటీ పడితే అనుభవజ్ణుడిగా మధ్యేమార్గంలో తన రొట్టె విరిగి నేతిలో పడదా? అని ఎదురుచూస్తున్నారు మాజీ ప్రధాని దేవెగౌడ. పశ్చిమబంగలో 35 నుంచి 39 స్థానాలు సాధించి తిరుగులేని శక్తిగా నిలిస్తే ప్రధాని అయ్యే చాన్సు తనదేనని భావిస్తున్నారు మమత. దళిత కార్డుతో ముందువరసలో తానే ఉన్నాననుకుంటున్నారు మాయావతి. కాంగ్రెసుకు ఓటు బ్యాంకు కావాలంటే తనను ప్రధానిగా ప్రతిపాదించాల్సిందేనని ఆమె కోరుకుంటున్నారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ తో తండ్రి ములాయం కు పెద్దగా సత్సంబంధాలు లేవు. దాంతో ప్రధాని రేసులో వెనకబడిపోయారు. అయినా ఆశ చావలేదు. చంద్రబాబు వంటినేతలు తనను ప్రతిపాదిస్తారని నమ్ముతున్నారు. మరాఠా స్ట్రాంగ్ మేన్ శరద్ పవార్ ది ఒక ప్రత్యేక కేసు. సీనియారిటీ దృష్ట్యా ఆయన ఎవరినీ ఏమీ అడగలేరు. తనకు మించిన అర్హులు వేరెవరూ లేరని అనుకుంటూ ఉంటారు. అడగనిదే అమ్మయినా పెట్టదు చందంగా ఆయన ప్రస్తావనకే రాకుండా పోతున్నారు. పూర్తి స్థాయి విజయం సాధించలేకపోయినా, 2019 ఎన్నికల్లో రాహుల్ బలపడి బీజేపీని కట్టడి చేయగలిగితే వీరి అవకాశాలకు గండి పడ్డట్టే. అందుకే వివిధ పార్టీల అగ్రనాయకులంతా ఈసారి చాన్సు మిస్ కాకూడదని పోటీలు పడుతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News