ఆశ అటకెక్కినట్లే.. బై..బై ..జమిలీ

దేశంలో శాసనసభలకు, లోక్ సభకు ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న భారతీయ జనతాపార్టీ ఆలోచన దాదాపు అటకెక్కేసినట్లే. ఆ పార్టీ కేంద్ర స్థాయి వర్గాల నుంచి అందుతున్న [more]

Update: 2021-02-28 16:30 GMT

దేశంలో శాసనసభలకు, లోక్ సభకు ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించాలన్న భారతీయ జనతాపార్టీ ఆలోచన దాదాపు అటకెక్కేసినట్లే. ఆ పార్టీ కేంద్ర స్థాయి వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అగ్రనాయకత్వం ఈ అంశంపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఒకేసారి ఎన్నికలు జరపాలన్న సైద్ధాంతిక వాదనను మాత్రం విడిచిపెట్టకుండా కొనసాగిస్తూ 2027 నాటికి సాకారం చేయాలనేది లక్ష్యంగా చెబుతున్నారు. జమిలీపై ప్రధాని నరేంద్రమోడీ పలు దఫాలుగా తన మనసులోని ఆలోచనను ఇప్పటికే బయట పెట్టారు. అంతకుముందు అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ వంటి నాయకులు కూడా ఒకేసారి ఎన్నికలు జరపడంలో కలిసొచ్చే అంశాలను ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే అప్పట్లో బీజేపీకి అంతటి బలం లేకపోవడం వల్ల అది కేవలం సూచనప్రాయమైన ఆలోచనగానే మిగిలిపోయింది. నరేంద్రమోడీ రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణాత్మకమవుతుందని అందరూ భావించారు. కేంద్రంలో మంచి మెజార్టీ, దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో జమిలీ ఎన్నికలు జరిగిపోతాయని అంచనా వేశారు. కానీ అనూహ్యంగా ఈ నిర్ణయం నుంచి కేంద్రం వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పరంగా ఉన్న ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లుగా తటస్థ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎదురీత…మొదలు….

నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర వ్యతిరేకత ప్రస్తుతం దేశంలో నెలకొని ఉంది. అయితే మోడీకి ఉన్న కరిష్మాను తట్టుకుని ఈ ప్రతికూలత ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందా? అంటే ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం. కానీ ఆందోళనలు, ప్రదర్శనలు, నిరసనల రూపంలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ హోరెత్తిపోతోంది. మోడీని విమర్శిస్తే గతంలో విరుచుకుపడే మేధావి, మధ్యతరగతి, విద్యా , వ్యాపార వర్గాలు ప్రస్తుతం తటస్థ పాత్ర పోషిస్తున్నాయి. వెనకేసుకుని రావడం లేదు. నరేంద్రమోడీ నాయకత్వాన్ని భుజాన మోసిన యువతరం తాము మోసపోయామనే భావనను వ్యక్తం చేస్తోంది. నెగటివ్ సోషల్ మీడియా పోస్టింగులు ఇందుకు అద్దం పడుతున్నాయి. అయితే భావోద్వేగాల పరంగా ఓటర్లు తీర్పులు చెప్పడం కద్దు. ఎన్నికల నాటికి ఎటువంటి అంశాలు ప్రజల్లో ఎమోషన్ రేకెత్తిస్తాయో ఎవరూ చెప్పలేరు. వివిధ వర్గాల నుంచి కచ్చితంగా వ్యతిరేకత మొదలైంది. దానికి సరైన సమాధానం చెప్పడం పార్టీకి కష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో జమిలీ, ముందస్తు ఎన్నికల వంటి చర్యలకు దిగితే అసలుకే మోసం రావచ్చనే అంచనాతోనే మోడీ నాయకత్వం ఆ ఆలోచననుంచి ప్రస్తుతానికి వైదొలిగినట్లు చెప్పుకోవచ్చు.

ఫలితాల తర్వాత సమీక్ష..

రానున్న రెండు నెలల్లో అయిదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇందులో పశ్చిమబెంగాల్ ఎన్నికపైన బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి పట్ల అంచనాలేమీ లేవు. అసోంలో గట్టెక్కుతామనే ఆశలున్నాయి. అది పెద్ద రాజకీయ విజయం కాదు. పశ్చిమబెంగాల్ ఫలితం కనుక బీజేపీకి అనుకూలంగా వస్తే మిగిలిన చోట్ల పరాజయం పాలైనా పర్వాలేదు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించినట్లే చెప్పుకోవచ్చు. ఎలాగూ మిగిలిన రాష్ట్రాల్లో ఆ పార్టీకి పెద్ద గా స్టేక్స్ లేవు. ఒకవేళ బెంగాల్ ఓటర్లు కమల నాథులను తిరస్కరిస్తే దేశవ్యాప్తంగా దాని ప్రభావం పడుతుంది. నరేంద్రమోడీ, బీజేపీ వ్యతిరేక ఓటును సంఘటితం చేసేందుకు ప్రతిపక్షాల్లో కదలిక మొదలు కావచ్చు. ఈ ప్రతిఘటనను ఎదుర్కోవడంపై బీజేపీ దృష్టి పెట్టాల్సిరావచ్చు. రాజకీయ సమీకరణలు, పునరేకీకరణల నేపథ్యంలో శాసనసభల ఎన్నికల తర్వాత బీజేపీ లో అంతస్సమీక్ష ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ తమకే దక్కితే దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అక్కడ పరాజయం పాలైతే ఇప్పటికే పట్టు సాధించిన ఉత్తరాది రాష్ట్రాలపై ఆ ప్రభావం పడకుండా ప్రతిరక్షణ వ్యూహం ఆలోచించాల్సి ఉంటుందని అగ్రనాయకులు చెబుతున్నారు .

అజెండాకు బ్రేకుల్లేవ్…

జమిలీ ఎన్నికలకు వెళితే బీజేపీ సైద్దాంతిక అజెండాకు బ్రేకులు పడే అవకాశాలున్నాయని ఆ పార్టీలోని మేధావి వర్గం భావిస్తోంది. బీజేపీకి కేంద్రంలో సొంతంగా మెజార్టీ రాకపోయినా, సగానికి పైగా రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి రాలేకపోయినా ఇబ్బందులు ఎదురవుతాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చిన్నాచితక పార్టీలపై ఆధారపడాలి. అవి పెట్టే డిమాండ్లను అంగీకరించాలి. పరిహారంగా మోడీ నాయకత్వంలో ఇంతవరకూ సాధించిన సైద్ధాంతిక విజయాలను సైతం వదులుకోవాల్సి వస్తుంది. ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్ విభజన, ఎన్ ఆర్ సీ అమలు, రామాలయ నిర్మాణం వంటి విషయాల్లో బీజేపీ తన అజెండాను అమలు చేయగలిగింది. వాటి పూర్తి ఫలితం ఎన్నికల్లో ప్రతిఫలించాలంటే నిర్మాణాత్మకంగా కనిపించాలి. రామాలయ నిర్మాణం పూర్తి కావాలి. ఢిల్లీలో నూతన పరిపాలన ప్రాజెక్టు సెంట్రల్ విస్తా ఆకారం దాల్చాలి. ఆ తర్వాతే ఎన్నికలకు వెళితే బాగుంటుందనేది బీజేపీ ఇటీవల నిర్వహించిన సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాల సారాంశం. అందువల్ల జమిలీ, ముందస్తు ఎన్నికల వంటి దుస్సాహసాలకు ఒడిగట్టేందుకు ప్రస్తుతం అవకాశం లేదు. మోడీ అటువంటి నిర్ణయం తీసుకుంటే అసలుకే ఎసరు రావచ్చనే అనుమానాలు పార్టీలో పొడసూపుతున్నాయి. మొత్తమ్మీద జమిలీ ఎన్నికలకు ప్రస్తుతానికి బై బై చెప్పేసినట్లే కనిపిస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News