కరోనా కరువుపై కొరివి..?

మొత్తం వాక్సిన్ల బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇందులో ఏదో మతలబు ఉందని రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. [more]

Update: 2021-06-11 16:30 GMT

మొత్తం వాక్సిన్ల బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇందులో ఏదో మతలబు ఉందని రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. కరోనా వాక్సిన్లు, పేదల సాయం పేరిట కేంద్ర ప్రభుత్వానికి లక్షా ఇరవై అయిదువేల కోట్ల రూపాయల మేరకు భారం పడుతుందని అంచనాలు రూపొందించారు. ఎలాగూ రాష్ట్రాలు చేతులెత్తేశాయి. కేంద్రమే బాధ్యత వహిస్తోంది కాబట్టి కొత్త సెస్సు వేసేందుకు సమాయత్తం అవుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఏమీ మాట్టాడలేని పరిస్థితి. వాటిపై భారం తగ్గిందనే సాకు చూపిస్తారు. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ప్రభుత్వాలు వాక్సిన్లు సొంతంగా సమకూర్చుకోవాలంటే తెలంగాణ 3వేల కోట్ల రూపాయలు, ఏపీ 4,200 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని లెక్కలు వేసుకున్నాయి. అలాగే తమ జనాభాను బట్టి ఇతర రాస్ట్రాలూ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా్ల్సి వచ్చి ఉండేది. ఈ భారమంతా కేంద్రం తీసుకుంటోంది. అందువల్ల ఖజానా నింపుకోవడానికి కొత్త సెస్సు వేస్తామని చెప్పే అవకాశాలున్నాయంటున్నారు. జీఎస్టీ సమావేశాల్లో భాగంగా కేంద్రం, రాష్ట్రాలతో భేటీ కానుకుంది. ఈ సమావేశం అనంతరం కేంద్రం తమ కొత్త పన్నును ప్రజలపై రుద్దే అవకాశం ఉందనేది రాజకీయ వర్గాల సమాచారం.

రెండు పిట్టలు…

నిజానికి వాక్సిన్లలో 75 శాతం కేంద్రం సేకరించి 25 శాతం ప్రయివేటు ఆసుపత్రుల కొనుగోలు కు అవకాశం ఇస్తోంది. కేంద్రానికి ఒక్కో డోసు 150 రూపాయలకే లభిస్తోంది. ప్రయివేటు ఆసుపత్రులు అందించే టీకాలు, చిన్నపిల్లలకు మినహాయింపు తీసేస్తే కేంద్రం రెండు విడతలు కలిపి 120 కోట్ల డోసులు సేకరిస్తే సరిపోతుంది. గరిష్టంగా 36 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇప్పటికే బడ్జెట్ లో 35వేల కోట్లను కేంద్రం కేటాయించింది. అంటే కేంద్రం కొత్తగా ఖర్చు చేసేదేమీ ఉండదు. కానీ రాష్ట్రాల వంతు బాధ్యతను కూడా తామే తీసుకుంటున్నామనే నెపంతో కరోనాను సెస్సు రూపంలో ఎన్ క్యాష్ చేసుకునే ఎత్తుగడలో కేంద్రం ఉందని రాజకీయ వేత్తలు, ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. అందుకే కరోనా బారం లక్షా ఇరవై అయిదువేల కోట్ల రూపాయలంటూ కేంద్రం కొత్త లెక్కలు చెబుతోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా రాష్ట్రాల నిస్సహాయతను తమకు అనుకూలంగా మలచుకోదలచింది. రాష్ట్రాలు కూడా టీకాల బాధ్యత వహించి ఉంటే సెస్సు విధించడం సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ విధించినా ఈ పన్నులో తమ వంతు వాటా కోసం రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేసి ఉండేవి.

పన్ను చెల్లింపు యంత్రాలా..?

నిజానికి ప్రజలు ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. ఆదాయాలు పడిపోయాయి. కొత్తగా సెస్సులు విధిస్తే తట్టుకోగల పరిస్థితి లేదు. ప్రజలను తమను అధికారంలోకి తెచ్చే ఓటర్లుగాను, పన్ను చెల్లింపు యంత్రాలుగానూ మాత్రమే రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. నాణ్యమైన మానవ వనరులుగా, దేశానికి భవిష్యత్తుగా భావించడం లేదు. వ్యవస్థీ కృత విధానాలతో ప్రజలను పన్నుల రూపంలో బాదేస్తున్నాయి. ఇందుకు కేంద్రం, రాష్ట్ం అనే తేడా లేదు. వాటాల కోసమే తప్ప ప్రజలకు ఉపశమనం కలిగించాలనే విషయంలో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వమూ డిమాండ్ చేయడం లేదు. కేంద్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించే వామపక్షాలు, మమతా బెనర్జీ వంటి వారు కూడా జీఎస్టీ పన్నుల వంటి వాటిపై హెచ్చరికలు పంపడం లేదు. మొక్కుబడి ప్రకటనలతో కేంద్రానికి నిరసన తెలపడం మినహా జీఎస్టీ కౌన్సిల్ లో తీవ్రస్థాయిలో విభేదించడం లేదు. తమ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పన్నుల్లో వాటా ఉండటమే ఇందుకు కారణం. దేశ వ్యాప్తంగా ఏకీకృత పన్నుతో అధిక మొత్తాల్లో ప్రజల నుంచి నిధులను రాబడుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలుస్తోంది.

దొందూ దొందే ….

రాజకీయ విభేదాలే తప్ప కేంద్రం, రాష్ట్రాలు ప్రజలపై విధించే పన్నుల విషయంలో ఏకాభిప్రాయంతోనే ముందుకు పోతున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు ఇందుకు ఉదాహరణ. జీఎష్టీ లోకి తీసుకురాకుండా ప్రభుత్వాలు వీటిపై ఎడాపెడా పన్నులు బాదుతూ ఖజానాను నింపుకుంటున్నాయి. కేంద్రానికి ఎక్సైజ్ పన్నుకు తోడు అదనపు సెస్సుల రూపంలో లక్షల కోట్లు సమకూరుతున్నాయి. రాష్ట్రాలకు అమ్మకం పన్ను రూపంలో వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. కేంద్రం పన్నులోనూ వాటా వస్తోంది. అందుకే ఏ ఒక్క రాస్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోలియం రేట్లపై , పన్నులపై తమ నిరసనను తెలపడం లేదు. దొంగలు , దొంగలు ఊళ్లు పంచుకున్నారనే మొరటు సామెతకు నిదర్శనగా ప్రభుత్వాలు నిలుస్తున్నాయి. దేశంలో రవాణా, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు అన్నిటికీ అవసరమైన పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. అప్పుడు నిర్ణీత పరిధిని మించి పన్ను విధించడం సాధ్యం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60శాతం పైగా పెట్రోలు, డీజిల్ పై పన్నులు వసూలు చేస్తున్నాయి. కేవలం నలభై రూపాయలకు లభించాల్సిన పెట్రోలు లీటరు వంద రూపాయలు దాటింది. అదే జీఎస్టీ పరిధిలోకి తెస్తే గరిష్ట స్థాయిలో 28 శాతానికి మించి పన్ను విధించడం సాధ్యం కాదు. అందులోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల వాటా ఉంటుంది. పెట్రోలియం ఉత్పత్తులు లీటర్ 70 రూపాయలకే లభిస్తాయి. ప్రజలకు ఇటువంటి సదుపాయం కల్పించడం కేంద్ర, రాష్ట్రాలకు ఇష్టం లేదు. అందుకే ఒకే దేశం ఒకే పన్ను అంటూ జీఎస్టీని తెచ్చినా పెట్లోలు, మద్యం మాత్రం మినహాయించుకుని ప్రజలపై అదనపు భారం మోపుతున్నాయి. జీఎస్టీ అమలవుతున్న దేశాల్లో ఎక్కడా లేని ద్వంద్వ విధానం ఇది. తాజాగా జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ భేటీ లో అయినా పెట్రోలియం ఉత్పత్తుల పన్నుపై చర్చ సాగి, జీఎస్టీలో కి తెచ్చే ప్రయత్నాలు మొదలైతే ప్రజలకు భవిష్యత్తులో ఉఫశమనం కలుగుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News