“సీమ” వెయిట్ చేస్తోంది

రాయలసీమ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వత్తిడి పెరుగుతోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి రెండు నెలలు కావస్తోంది. ఇంతవరకూ రాయలసీమ సమస్యలపై [more]

Update: 2019-07-31 05:00 GMT

రాయలసీమ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వత్తిడి పెరుగుతోంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి రెండు నెలలు కావస్తోంది. ఇంతవరకూ రాయలసీమ సమస్యలపై వైఎస్ జగన్ దృష్టి పెట్టలేదన్న విమర్శలు ఆ ప్రాంత వాసుల నుంచి విన్పిస్తున్నాయి. ప్రధానంగా కడప స్టీల్ ఫ్యాక్టరీ, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, అనంతపురం జిల్లాలో కరువు నివారణ చర్యలు వంటివి ఇందులో ప్రధానమైనవి.

అండగా నిలిచిన….

ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాయలసీమ వైఎస్ జగన్ కు అండగా నిలిచిందని చెప్పుకోవాలి. కర్నూలు, కడప జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక్క స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ఇక అనంతపురం జిల్లాలో కేవలం రెండింటిలో మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో చంద్రబాబు పోటీ చేసిన కుప్పం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలనూ వైసీపీకే ప్రజలు పట్టం కట్టారు.

కడప స్టీల్ ఫ్యాక్టరీ….

దీంతో వై.ఎస్. జగన్ పై రాయలసీమ వాసుల ఆశలు పెరిగాయి. రాయలసీమ ఉద్యమ సమితి గత కొంతకాలంగా పలు సమస్యలపై ఉద్యమిస్తూనే ఉంది. దీనికి సీనియర్ నేత మైసూరా రెడ్డి లాంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా కడప స్టీల్ ఫ్యాక్టరీకి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరిగి కేంద్ర ప్రభుత్వం సహకారంతో స్టీల్ ఫ్యాక్టరీని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు…..

ఇక కర్నూలు జిల్లాలో హైకోర్టును ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఉద్యమాలు నడుస్తున్నాయి. అయితే చంద్రబాబునాయుడు అమరావతిలోనే హైకోర్టును ఏర్పాటు చేశారు. ఇప్పుడు హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలింపు సాధ్యం కాదు. దీంతో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఉన్నారు. దీంతో పాటు అనంతపురం నుంచి అమరావతి జాతీయ రహదారి పనులను కూడా వేగవంతం చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. మొత్తం మీద రాయలసీమ సెగ జగన్ కు తగులుతుంది. దీనిపై జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News