వైసీపీలోకి ప్రతిభా భార‌తి.. మంత‌నాలు షురూ

రాజ‌కీయాల్లో ఎదురు చూపులు ఎన్నాళ్లని ఫ‌లిస్తాయి ? ఎంత‌కాలం.. ఆశ‌లు పెట్టుకుని ఆవిరి చేసుకుంటారు? అందుకే ఇప్పుడు టీడీపీ నాయ‌కులు.. `బాబు మార‌రు.. మ‌న‌మే మారాలి!` అని [more]

Update: 2020-10-14 15:30 GMT

రాజ‌కీయాల్లో ఎదురు చూపులు ఎన్నాళ్లని ఫ‌లిస్తాయి ? ఎంత‌కాలం.. ఆశ‌లు పెట్టుకుని ఆవిరి చేసుకుంటారు? అందుకే ఇప్పుడు టీడీపీ నాయ‌కులు.. 'బాబు మార‌రు.. మ‌న‌మే మారాలి!' అని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వ‌ర‌కు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు.. టీడీపీకి బై చెబితే.. ఇప్పుడు మ‌హిళా నాయ‌కులు కూడా బాబుకు టాటా చెప్పేందుకు రెడీ అయ్యార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. శ్రీకాకుళం జిల్లా రాజాం ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కురాలు.. మాజీ స్పీక‌ర్‌.. టీడీపీకి వీర విధేయురాలు.. ప్రతిభా భార‌తి.. త్వర‌లోనే సైకిల్ దిగేయ‌డం ఖాయ‌మ‌నే వార్తలు వ‌స్తున్నాయి.

నిర్వేదంలో…..

“ చూడ‌మ్మా.. రాజ‌కీయాల్లో అనేక అవ‌కాశాలు వ‌స్తాయి. ఉండాలా? వెళ్లాలా? అనేది మ‌న‌మే డిసైడ్ చేసుకోవాలి..! “-ఇటీవ‌ల స్థానిక మీడియా విలేక‌రితో మాట్లాడుతూ.. ప్రతిభా భార‌తి చేసిన కామెంట్ ఇది. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. 25 సంవ‌త్సరాలు పూర్తయిన సంద‌ర్భంగా టీడీపీ అనుకూల మీడియాకు చెందిన విలేక‌రి ప్రతిభా భార‌తి ఇంట‌ర్వ్యూ తీసుకున్నారు. ఈ స‌మ‌యంలో ఆమెలో స్పష్టంగా నిర్వేదం క‌నిపించింది. “గుర్తింపు అనేది మ‌నం అడిగితే రాదు..“ అన్న భార‌తి.. త‌న కుమార్తె విష‌యంలో మార్పు కోరుకుంటున్నట్టు స్పష్టంగా తెలిసింది.

కూతురి భవిష్యత్ కోసం…..

అనంతర ప‌రిణామాల్లో ప్రతిభా భార‌తి.. వైసీపీ నేత‌ల‌కు ట‌చ్‌లోకి వ‌చ్చార‌నే విష‌యంలో జిల్లాలో ప్రచారం జ‌రుగుతోంది. నిజ‌మే! ప్రతిభా భార‌తి వంటి ఎస్సీ నాయ‌కురాలు పార్టీ మారితే త‌ప్పులేద‌ని, ఈ విష‌యంలో ఆమె త‌ప్పు ఇసుమైంతైనా లేద‌ని స్థానిక ప్రజ‌లు కూడా అంటున్నారు. టీడీపీలో సుదీర్ఘకాలం ఎదురీత ధోర‌ణిలో రాజ‌కీయాలు చేసిన ఆమె.. స్పీక‌ర్‌గా చ‌క్రం తిప్పారు. దిగ్గజ నాయ‌కుడు అయిన మాజీ ముఖ్యమంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డితో ఢీ అంటే ఢీ అనే రీతిలో అసెంబ్లీలో రాజ‌కీయ పోరాటం చేశారనే పేరు తెచ్చుకున్నారు. అయితే, త‌ర్వాత కాలంలో చంద్రబాబు ఆమెను ప‌క్కన పెట్టారు.

ఎన్నేళ్లని వెయిట్ చేస్తాం……

ఆమె గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతున్నారు. త‌న ఓట‌మికి క‌ళా వెంక‌ట్రావు, కింజార‌పు ఫ్యామిలీ కార‌ణ‌మ‌ని ఆమె ఎన్నిసార్లు చెప్పినా బాబు ప‌ట్టించుకోలేదు. స‌రిక‌దా తాను అనారోగ్యంతో బాధ‌పడుతున్నాన‌ని, త‌న కుమార్తె గ్రీష్మకు అవ‌కాశం ఇవ్వాల‌ని ప్రతిభా భార‌తి అనేక సంద‌ర్భాల్లో విన్నవించారు. ఇప్పటికీ బాబు కరుణించ‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా త‌న కుమార్తెను ఎమ్మెల్యేగా చూడాల‌ని క‌ల‌లు కంటున్న భార‌తి.. ఇప్పటికే చేతులు కాలిపోయాయి. అనే ధోర‌ణిలో చింతిస్తున్నార‌నేది వాస్తవం అంటున్నారు స్థానిక నాయ‌కులు. ఇక‌, వైసీపీ కూడా ప్రతిభా భార‌తి వ‌స్తానంటే.. రెడ్ కార్పెట్ ప‌రిచేందుకురెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా.. ప్రతిభా భార‌తి వంటి నాయ‌కురాళ్లు దూరం కావ‌డం టీడీపీపై ప్రభావం ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు.

Tags:    

Similar News