ప్రశాంత్ కిషోర్ ప్లస్ అయ్యారా..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీగా జరిగాయి. ఫలితాలపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా పోటీ మాత్రం తీవ్రంగా [more]

Update: 2019-04-16 02:30 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీగా జరిగాయి. ఫలితాలపై ఎవరి అంచనాలు ఎలా ఉన్నా పోటీ మాత్రం తీవ్రంగా జరిగింది. సర్వేలు మాత్రం ఎక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. దీంతో వైసీపీలో ఉత్సాహం నెలకొంది. అయితే, ఇప్పుడు వైసీపీ ఉన్న ఈ పరిస్థితి, రెండేళ్ల క్రితం పార్టీ పరిస్థితికి చాలా తేడా ఉంది. గత ఎన్నికల్లో గెలుస్తుందనుకున్న పార్టీ ఓడిపోవడంతో వైసీపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. పార్టీ ఓడిపోగానే అనేకమంది నేతలు గుడ్ బై చెప్పేశారు. ప్రమాణస్వీకారం కూడా చేయకముందే వైసీపీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులు పార్టీని వీడి టీడీపీలో చేరడం మొదలుపెట్టారు. పైగా, వెళుతూ వెళుతూ జగన్ ని తిట్టి పోశారు. మూడేళ్లలో వైసీపీ చాలా బలహీనపడింది. ఓ దశలో ఇదే పరిస్థితి ఉంటే వచ్చే ఎన్నికల్లో కనీసం పోటీ కూడా ఇవ్వదనే విశ్లేషణలు వచ్చాయి.

రెండేళ్లలో సీన్ రివర్స్…

అయితే, ఈ రెండేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ తిరిగి బలం పుంజుకొని, గత ఎన్నికల కంటే మరింత బలపడి తెలుగుదేశం పార్టీకి ఈసారి గట్టి పోటీ ఇచ్చింది. వైసీపీ మళ్లీ బలపడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి జగన్ పాదయాత్ర అయితే మరొకటి ప్రశాంత్ కిషోర్ రాక. జగన్ పాదయాత్రకు ముందు, అంటే రెండేళ్ల క్రితం ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అనతికాలంలోనే ఎన్నికల వ్యూహకర్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ కిషోర్. ఆయన ట్రాక్ రికార్డులో అపజయాలు ఉన్నా విజయాలే ఎక్కువ. అయితే, సౌత్ లో మొదటిసారి జగన్ తో ఆయన ఒప్పందం చేసుకున్నారు. దక్షిణాధిన ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు నడవవు అని అంతా అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదట్లో ప్రశాంత్ తో వైసీపీ ఒప్పందాన్ని ఎద్దేవా చేసి తర్వాత పట్టించుకోవడం కూడా మానేసింది. కానీ, ప్రశాంత్ కిషోర్ ప్రభావాన్ని ఎన్నికల ముందు టీడీపీ గుర్తించింది. అందుకే జగన్ తో పాటూ ప్రశాంత్ కిషోర్ ను టార్గెట్ చేసింది ఆ పార్టీ. ఓ దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయి బిహార్ ను అవమానించేలా ప్రశాంత్ ను దూషించి విమర్శలు మూటగట్టుకున్నారు.

వినూత్న నినాదాలతో ప్రజల్లోకి…

రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లో పని ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ సంస్థ వైసీపీకి బాగా ఉపయోగపడింది. పాదయాత్రకు సంబంధించి ప్రచార వ్యవహారాలను ఈ సంస్థే చూసుకుంది. రెండేళ్లుగా అనేక సర్వేలు ఐప్యాక్ సంస్థ నిర్వహించింది. నియోజకవర్గాల వారీగా పార్టీల బలాబలాలు, అభ్యర్థుల బలాలపై సర్వేలు చేసి ఏ అభ్యర్థిని నిలబెట్టాలో జగన్ కు సూచనలు చేసింది. దీంతో పాదయాత్ర సమయంలోనే చాలా నియోజకవర్గాలకు జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తూ వచ్చారు. గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీ బలమైన అభ్యర్థులను నిలబెట్టడంలో ఐప్యాక్ సంస్థ కృషి ఉంది. ఇక, ఎన్నికల కోసం ఐప్యాక్ సంస్థ తెరపైకి తెచ్చిన నినాదాలు కూడా బాగా ప్రజల్లోకి వెళ్లాయి. ‘రావాలి జగన్ – కావాలి జగన్’, ‘బై బై బాబు’, ‘నిన్ను నమ్మం బాబు’ వంటి నినాదాలు ప్రజల నోళ్లలో నానాయి. సోషల్ మీడియాలోనూ ఈ నినాదాలు ఊపేశాయి. పోల్ మేనేజ్ మెంట్ లో జగన్ కు ప్రశాంత్ కిషోర్ పలు సూచనలు చేశారు. దీంతో గతసారి పోల్ మేనేజ్ మెంట్ లో విఫలమైన వైసీపీ ఈసారి సక్సెస్ అయ్యింది. ఎన్నికల తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ టీం సర్వే జరిపి వైసీపీ అధికారంలోకి రాబోతోందని జగన్ కు చెప్పింది. ఇక, రెండేళ్లుగా తన పార్టీ కోసం సేవలు అందిస్తున్న ప్రశాంత్ కిషోర్ టీంను జగన్ సైతం ప్రత్యేకంగా కలుసుకొని అభినందనలు తెలిపారు.

Tags:    

Similar News