ప్రశాంత్ కిషోర్ హ్యాండిచ్చారా?

Update: 2018-09-18 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వ్యూహాలు రూపుదిద్దుకుంటోంది. వైసీపీ ఇంకా డైలమాలో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు వ్యూహకర్త ప్రశాంతకిశోర్ దాదాపు హ్యాండిచ్చేశారు. అయితే జాతీయ మీడియాసంస్థల తరఫున నిర్వహించిన కొన్ని సర్వేలు వైసీపీకి అడ్వాంటేజ్ ఉందంటూ తేల్చి చెబుతున్నాయి. ఇది కొంత ఊరటనిస్తోంది. సర్కారీ వ్యతిరేకత లాభించి వైసీపీ వైపు సంఘటితమైతే కచ్చితంగా పాజిటివ్ వేవ్ క్రియేట్ చేసుకోవచ్చని అంచనా వేస్తోంది. పవన్ కల్యాణ్ ఓటింగుపై ఇంతవరకూ కచ్చితమైన అంచనా లేకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. చంద్రబాబు నాయుడి పొలిటికల్ మేనేజ్ మెంట్ పై ఇప్పుడిప్పుడే వైసీపీ అగ్రనాయకత్వం ఒక అవగాహనకు వస్తోంది. ప్రతివ్యూహాలను సిద్దం చేసుకోకపోతే దెబ్బతింటామని ఇటీవలనే జగన్ ద్వితీయశ్రేణి నాయకులను హెచ్చరించారు. 2014లో అతివిశ్వాసంతో వైసీపీ దెబ్బతింది. ఇప్పుడు ఆత్మవిశ్వాసలోపం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి తదనుగుణంగా ప్రచార ప్రణాళికను సిద్దం చేసే ప్రశాంతకిశోర్ తప్పుకోవడమూ కొంతమేరకు బాధిస్తోంది.

పీకే ప్రభావం ఉంటుందా?...

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి వ్యూహకర్తగా ప్రశాంతకిశోర్ రంగప్రవేశం చేసిన తర్వాత నైతిక స్థైర్యం పెరిగింది. పార్టీ లోపాలను, ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది పీకే బృందం. దానికనుగుణంగా జగన్ వ్యవహారశైలినుంచి పార్టీ విధానాల వరకూ అనేక సూచనలు చేసింది. ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర చేపట్టాలని ప్రశాంతకిశోర్ సూచించారు. నవరత్నాల పేరిట మినీ ఎన్నికల ప్రణాళికను రూపకల్పన చేశారు. ఇప్పటికి దాదాపు పన్నెండు సర్వేలు నిర్వహించారు. ఎక్కడెక్కడ వైసీపీని బలహీనతలు వెన్నాడుతున్నాయో కనిపెట్టి వాటిని సరిదిద్దే బాధ్యతలు నిర్వర్తించారు. పాదయాత్రలో నిరంతరం తన బృందాన్ని నీడలా నియమించారు. ప్రజాస్పందనను కనిపెట్టి మార్పుచేర్పులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకునిగా జేడీయూలో చేరిపోయారు. తాను వైసీపీకి సమయం కేటాయించలేనని తేల్చి చెప్పేశారు. తన బృందం కొనసాగుతుందని చెప్పినప్పటికీ వైసీపీ నాయకులు మాత్రం ఇక పీకే సేవలు ముగిసినట్లేనని వ్యాఖ్యానిస్తున్నారు. గడచిన నాలుగు నెలలుగా పీకే టీమ్ లు పెద్ద యాక్టివ్ గా లేవని, అందువల్ల కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదని కొందరు నాయకులు చెబుతున్నారు. పీకేకు, జగన్ కు మధ్య ఆలోచనల్లో కొంత అంతరం ఏర్పడిందని ఆ తర్వాతనే పీకే తన యాక్టివ్ రోల్ ను కుదించుకున్నారనేది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాపు లకు దూరమవుతోందా?...

ఆంధ్రప్రదేశ్ జనాభాలో దాదాపు 15 శాతం వరకూ ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునే విషయంలో ఇంకా వైసీపీ వెనకబడే ఉంది. రిజర్వేషన్లు సాధ్యం కాదని, కేంద్రం నిర్ణయించాలని ఒకానొక సందర్బంలో తేల్చి చెప్పేశారు జగన్. తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కొంత సర్దుబాటు, దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. కానీ ఆ సామాజిక వర్గంలో పూర్తి సానుకూలత తెచ్చుకోలేకపోయారు. పవన్ కల్యాణ్ ఫాక్టర్ కూడా ఇందుకు కారణం. తాజాగా విజయవాడలో వైసీపీ ని దెబ్బతీసే మరో ఘట్టం చోటు చేసుకుంది. కాపులు తమ ఐకాన్ గా వంగవీటి రంగాను చూస్తుంటారు. అతని కుమారుడు రాధాకు టిక్కెట్టు ఇచ్చే విషయంలో సందిగ్ధతకు తెరలేపారు జగన్. కొత్తగా పార్టీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైపు మొగ్గు చూపడంతో రాధా అనుచరులు తిరుగుబాటు బాటలో నడుస్తున్నారు. ఇది కేవలం విజయవాడకే పరిమితం కాదు. కాపు సామాజిక వర్గం ఏకమొత్తంగా వైసీపీకి దూరమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. మరోవైపు రాధా కనుక వస్తే ఆహ్వానించేందుకు సిద్దమవుతోంది జనసేన. ఈ పరిణామం జగన్ కు ఇబ్బందికరమే. అసలే కాపుల్లో అంతంతమాత్రంగా ఉన్న ఇమేజ్ ఈ ఉదంతంతో మరింత గా దిగజారుతుందేమోననే ఆందోళన మొదలైంది.

ప్రజాక్షేత్రంలో ...

ఎన్నికష్టాలు, ఎదురీతలు ఉన్నప్పటికీ వైసీపీకి ఊరటనిచ్చే అంశం ఒకటుంది. జాతీయ మీడియా నిర్వహించిన సర్వేలో 43 శాతం వరకూ ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వెలువడిన అంచనాలు ఆత్మసంతృప్తినిస్తున్నాయి. కొండంత భరోసానింపుతున్నాయి. ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశంపార్టీ కంటే దాదాపు అయిదు శాతం మేరకు అధిక ఓటింగు లభిస్తుందని సర్వే అంచనా వేసింది. అయితే శాంపిల్ సైజు అతి తక్కువగా ఉండటం ప్రధానలోపంగా అధికార పార్టీ చెబుతోంది. నమూనా నియోజకవర్గాల్లో మాత్రమే ఈ సర్వే నిర్వహించారు. అది కూడా నియోజకవర్గానికి రెండు వందల లోపు నమూనాలనే తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సర్వే ఒక పాజిటివ్ అంశమే. ప్రజల్లో పార్టీ కష్టపడితే మంచి ఫలితాలు లభిస్తాయన్నదానికి నిదర్శనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పట్నుంచి పొరపాట్లు చేయకుండా ఓట్లను సంఘటితం చేసుకుంటూ పోతే అధికార సాధన కష్ట సాధ్యం కాదని నాయకులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News