పీకే పాత్ర మారుతోందా..?

గెలుపు గుర్రాలను ఎంచుకుని వాటికి సరైన మార్గం చూపించడంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దిట్ట. పార్టీల జయాపజయాలను పూర్తిగా తలకిందులు చేయడం ఎవరి వల్లాకాదు. కానీ [more]

Update: 2021-05-20 15:30 GMT

గెలుపు గుర్రాలను ఎంచుకుని వాటికి సరైన మార్గం చూపించడంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ దిట్ట. పార్టీల జయాపజయాలను పూర్తిగా తలకిందులు చేయడం ఎవరి వల్లాకాదు. కానీ పోటాపోటీ వాతావరణం ఉన్నప్పుడు మొగ్గు తన కాతాదారుకు దక్కేలా చూడగలడు. అదే సమయంలో బొటాబొటిగా నెగ్గుతుందనుకున్న పార్టీకి కచ్చితమైన ఆధిక్యం వచ్చేలా ప్రజల్లో ప్రచార హంగామా సృష్టించగలడు. వ్యూహకర్త స్థానం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రశాంత్ కిశోర్ ఇటీవలే ప్రకటించాడు. బెంగాల్ లో తృణమూల్ అద్భుత విజయం తర్వాత తన నిష్క్రమణను ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. ఎప్పటినుంచో పూర్తి రాజకీయ వేత్తగా మారాలనేది ఆయన ఆలోచన. సొంత రాష్ట్రమైన బిహార్ లో తనకు అనుకూలమైన పరిస్థితులు లేవు. సొంతంగా గెలవగల, గెలిపించగల నాయకత్వ సామర్థ్యం, జనాకర్షణ లేవు. తన బలాలు, బలహీనతలు స్పష్టంగా తెలుసు. అందువల్ల నాయకుడిగా మారడానికి ఏదో ఒక పార్టీని ఎంచుకోక తప్పని అనివార్యత. అదే సమయంలో తనకు తగిన ప్రాధాన్యం లభించదేమోననే అనుమానం. అందుకే తాత్కాలికంగా రాజకీయాలకూ దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్తితుల్లో మళ్లీ ప్రశాంత్ కిశోర్ పై ఒత్తిడి పెరుగుతోంది. ప్రదాని నరేంద్రమోడీ బలహీనపడుతున్న నేపథ్యంలో నిరూపితమైన వ్యూహకర్త అవసరం జాతీయ రాజకీయాలలో ఏర్పడింది. అందుకు ప్రశాంత్ కిశోర్ తగిన వ్యక్తి అని దేశంలోని చాలా పార్టీలు భావిస్తున్నాయి.

ఫుల్ ప్యాక్..

ప్రశాంత్ కిశోర్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ , ఆయన నెలకొల్పిన ఐ ప్యాక్ తన పని తాను చేసుకుంటూ పోతోంది. దేశ రాజకీయాలు, పరిణామాలపై ఎప్పటికపుడు సర్వేలు నిర్వహిస్తూ నివేదికలు తయారు చేస్తోంది. ఇటీవలి కాలంలో ప్రధాని ఇమేజ్ దారుణంగా పడిపోయిన విషయంపై ఐ ప్యాక్ గణాంకాల సహా ఒక రిపోర్టు రెడీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో సోషల్ మీడియాలో బీజేపీ, నరేంద్రమోడీ హవా కొనసాగుతుండేది. యువతరం, విద్యావర్గాల్లో ఏర్పడిన వ్యతిరేకత కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎదురుగాలి వీస్తోంది. దీనిని చానలైజ్ చేసి తీవ్రమైన వ్యతిరేక ప్రభంజనంగా మలచడానికి ఒక టూల్ కిట్ అవసరమనేది ఐ ప్యాక్ అంచనా. ఈ పరిస్థితులను గమనించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు కేసులు నమోదు చేస్తోంది. ఢిల్లీలో పోస్టర్ల కేసు ఈ తరహాలో తీసుకున్న చర్యగానే పరిగణించాలి. వ్యూహకర్తగా పనిచేయకపోయినప్పటికీ ఇంకా ప్రశాంత్ కిశోర్ గైడెన్స్ లోనే ఐ ప్యాక్ పనిచేస్తోంది. దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ అతనే. నిధుల సమీకరణ మొదలు సేవలకు ఛార్జీల వరకూ అంతా పీకే ఆధ్వర్యంలోనే సాగుతోంది. తన నిష్క్రమణను ప్రకటించిన దృష్ట్యా మళ్లీ బహిరంగంగా వ్యూహకర్త పాత్ర ప్రశాంత్ కిశోర్ పోషించకపోవచ్చని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

పావులు కదులుతున్నాయి..

2012 నుంచి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ దేశంలో ఒక ఒరవడిని సృష్టించారు. నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్ లోనే తన తొలి ప్రయోగం చేశారు. అక్కడి శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి మంచి విజయం సాధించి పెట్టారు. తర్వాత ప్రధాని పీఠంపై మోడీ కూర్చోవడంలో కీలక భూమిక పోషించారు. నూతన ప్రచార విధానాలను ప్రవేశపెట్టారు. సోషల్ మీడియాను సమర్థ సాధనంగా వినియోగించారు. తాజాగా ప్రతిపక్సాలకు అనుకూలమైన వాతావరణం దేశంలో ఏర్పడుతోంది. ఇటువంటి స్థితిలోనే 2013లో జాతీయ రాజకీయ వ్యూహాలను మోడీకి అనుకూలంగా పీకే మలచగలిగారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు అటువంటి సాధన సంపత్తి సమకూరితే బీజేపీకి దీటైన పోటీ సాధ్యమవుతుంది. అందుకు అనుగుణంగా ప్రశాంత్ కిశోర్ను ఒప్పించే పనిని కాంగ్రెసు పార్టీ నిర్వహించాలని సీనియర్ రాజకీయ వేత్తలు కోరుకుంటున్నారు.

కలయికే సమస్య..

మోడీకి ఇటీవల వివిధ ప్రతిపక్షాలు తమ అసమ్మతిని వినిపిస్తూ లేఖ రాశాయి. కాంగ్రెసుతోపాటు 15 పెద్ద పార్టీలు ఇందులో ఉన్నాయి. ఒకే ఒక అంశం ఆధారంగా అన్ని పార్టీల నేతలు ఒకే స్వరంతో స్పందించడం విపక్ష రాజకీయాల్లో కీలక పరిణామం. ఇదే ప్రాతిపదికగా చేసుకుంటూ ముందుకెళితే బీజేపీకి గడ్డు కాలం తప్పదు. అయితే వీటన్నిటిని కలిపి ఉంచేందుకు వ్యూహకర్తగా కాకుండా అనుసంధాన కర్తగా ప్రశాంత్ కిశోర్ తనదైన పాత్ర పోషిస్తారని ప్రతిపక్సాలు ఎదురుచూస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లో తన అజెండాతో ప్రత్యర్థులపై తన క్లెయింట్లకు ఆదిక్యం దక్కేలా చూడగలిగారు ప్రశాంత్ కిశోర్. ఏపీలో ప్రవేశపెట్టిన వెల్ఫేర్ స్కీములకు సూత్ర ధారి అతనే. అలాగే పశ్చిమబెంగాల్ లో త్రుణమూల్ కు దూరమైన వర్గాలను తిరిగి అక్కున చేర్చుకునేందుకు అవసరమైన దిద్దుబాటు చర్యలకు ప్రశాంత్ కిశోర్ ప్రణాళికే మూల కారణం. తమిళనాడులో ఏఐఏడీఎంకేకు ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినప్పటికీ డీఎంకే ఎన్నికల ప్రణాళిక మెరుగ్గా ఉండేందుకు పీకే సలహాలు పనిచేశాయి. వీటన్నిటి నేపథ్యంలో జాతీయస్తాయిలో విపక్సాలు ఒకే వేదికపైకి వచ్చి పోరాటం చేయడానికి, ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వడానికి కనీస ఉమ్మడి ప్రణాళిక పీకే ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటోందని సీనియర్ రాజకీయ వేత్తలు చెబుతున్నారు. ఐ ప్యాక్ వద్ద ఇప్పటికే ప్రపంచంలోని వివిధ దేశాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలపై సమగ్రమైన సమాచారం ఉంది. వాటిని మనదేశానికి ఎలా వర్తింప చేయాలనే అంశమూ సిద్ధంగానే ఉంది. ఇక ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగి ఒక రూపమిచ్చి, ప్రతిపక్షాలను ఒకే వేదికపైకి తేవడమే మిగిలిఉంది. కానీ పీకే కు ఈ బాధ్యతను అప్పగించడానికి పిల్లి మెడలో గంట కట్టేదెవరో? వేచి చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News