కింగ్ మేకర్..‘కీ’ఎలక్షన్

పశ్చిమబెంగాల్ ఎన్నికలో అన్ని పార్టీలు సరిహద్దులు దాటేస్తున్నాయి. కేంద్ర బలగాలను, ఎన్నికల కమిషన్ ను సైతం తమ రాజకీయాల్లో పావులుగా వాడేస్తున్నాయి. సామదానభేదోపాయాల ప్రయోగం, దండ నీతి, [more]

Update: 2021-04-14 16:30 GMT

పశ్చిమబెంగాల్ ఎన్నికలో అన్ని పార్టీలు సరిహద్దులు దాటేస్తున్నాయి. కేంద్ర బలగాలను, ఎన్నికల కమిషన్ ను సైతం తమ రాజకీయాల్లో పావులుగా వాడేస్తున్నాయి. సామదానభేదోపాయాల ప్రయోగం, దండ నీతి, ఆర్థిక వనరుల వినియోగం అన్నిచోట్లా కామన్. కుల,మతాలను వాడుకోవడమూ రాజకీయపార్టీలకు కొత్త కాదు. కానీ భవిష్యత్ భారత రాజకీయాలకు దిక్సూచిగా నిలుస్తుందని భావిస్తున్న నేపథ్యంలో పశ్చిమబంగలో బీజేపీ, తృణమూల్ ల యుద్ధం కొత్త విన్యాసాలకు దారితీస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావోద్వేగ రాజకీయాలను పతాక స్థాయికి తీసుకెళుతున్నారు.. మైనారిటీ ఓటు చేజారకుండా చూసుకోవడానికి ఆమె చేయని ప్రయత్నమంటూ లేదు. హిందూ ఓట్లను సంఘటితం చేయడానికి బీజేపీ కిందుమీదులవుతోంది. జై శ్రీరామ్ ఇప్పుడక్కడ కామన్ పలకరింపు అయిపోయింది. ప్రధాన పోటీలో లేకుండా పోయిన ఒకనాటి పాలకపార్టీలు కాంగ్రెసు, వామపక్షాలు, మత వాద పార్టీలతో జట్టుకట్టి దయనీయమైన పరిస్థితిని చవిచూస్తున్నాయి. అయితే విజేతను నిర్ణయించేది ఈ కూటమేనంటూ వార్తలు వస్తున్నాయి. హిందూ, ముస్టిం ఓట్లలో ఎంతమేరకు ఈ మూడో కూటమి తెచ్చుకోగలుగుతుందనేది చాలా కీలకం. దానిపైనే తృణమూల్, బీజేపీల గెలుపు ఆదారపడి ఉంటుందంటున్నారు. ట్రయాంగిల్ ఫైట్ లో అటు బీజేపీ ఓట్లకు, ఇటు తృణమూల్ ఓట్లకు గాలం వేసి పరువునిలబెట్టుకొనే పనిలో పడింది ఈ కూటమి.

45 శాతం దాటితేనే….?

త్రిముఖ పోటీ లో సాధారణంగా 40శాతం దరిదాపుల్లోకి వచ్చే పార్టీ సులభంగా అధికారాన్ని చేజిక్కించుకోగలుగుతుంది. కానీ పశ్చిమబంగ లెక్కలు వేరుగా కనిపిస్తున్నాయి. నాలుగో దశ నాటికే చూస్తుంటే ఇక్కడి ఎన్నికలు ముఖాముఖిగా మారిపోయాయి. వామపక్ష, కాంగ్రెసు కూటమి దాదాపు పోటీలో లేనట్లుగా ప్రజలు భావిస్తున్నారు. తృణమూల్, బీజేపీల మధ్య పోటీ నువ్వా, నేనా? తీరులో ఫేస్ టు ఫేస్ గా రూపు దాల్చింది. . దీంతో అదికారం చేపట్టాలనుకుంటున్న పార్టీ కనీసం 45 శాతం పైచిలుకు ఓట్లు తెచ్చుకోక తప్పని అనివార్యత ఏర్పడింది. తాము దాదాపు అధికారంలోకి వచ్చేశామని బీజేపీ క్లెయిం చేస్తోంది. 2016లో నామమాత్రపు సీట్లకు పరిమితమైన కమలం పార్టీ తర్వాత తన స్థానాన్ని బలపరచుకుంది. సొంత బలం కంటే వామపక్ష, కాంగ్రెసు బలహీనతలు ఇందుకు దోహదం చేశాయి. అధికార తృణమూల్ కాంగ్రెసుకు ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించడంలో ఈ రెండు పార్టీలు విఫలమయ్యాయి. దాంతో బీజేపీ ప్రతిపక్ష ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపించింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో అధికారపార్టీకి దీటుగా బీజేపీకి సీట్లు కట్టబెట్టారు ప్రజలు. 40 శాతం ఓట్లిచ్చారు. కానీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థాయి పర్ ఫామెన్స్ చూపిస్తే సరిపోదనేది సెఫాలజిస్టుల అంచనా. వామపక్ష, కాంగ్రెసు పార్టీలు మరింతగా బలహీనపడటంతో 90 శాతం మేరకు ఓట్లు బీజేపీ, తృణమూల్ మద్య కేంద్రీక్రుతం అయినట్లు అంచనాలు వెలువడుతున్నాయి. అంటే అధికారం దక్కించుకోవాల్సిన పార్టీ కనీసం 45శాతం తెచ్చుకోవాల్సిందే. ఈ ఈక్వేషన్ బీజేపీకి ఇబ్బందికరంగానే కనిపిస్తోంది. కాంగ్రెసు, కమ్యూనిస్టులు బలంగా ఓట్లు చీల్చగలిగితేనే బీజేపీకి లాభం చేకూరుతుంది.

పీకే సవాల్ ఫలిస్తుందా..?

పశ్చిమబెంగాల్ లో ఎన్నికలకు ముందు నాలుగు విడతలుగా వ్యూహకర్త ప్రశాంతకిశోర్ బృందం సర్వేలు చేసింది. తృణమూల్ కాంగ్రెసుకు 45 నుంచి 47 శాతం వరకూ ఓటింగు వస్తుందని అంచనా వేసింది. బీజేపీ ఓటింగ్ 2019 కి మించకుండా 40శాతం లోపుగానే ఉంటుందనేది ఐ పాక్ గణాంకాల సారాంశం. దీనిపై రకరకాల మదింపు తర్వాత ప్రశాంత కిశోర్ బీజేపీకి సవాల్ విసిరారు. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ వ్యూహ కర్త గా పనిచేయడం మానేస్తానని బహిరంగంగా ప్రకటించారు. బీజేపీ 100లోపు సీట్లకే పరిమితమవుతుందని వెల్లడించారు. తన టీమ్ అధ్యయనంపై విశ్వాసం ఒకవైపు, బీజేపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం మరో లక్ష్యంగా ఆయన ఈ ప్రకటన చేశారు. అయితే ఇప్పటికే ముగిసిన సగం ఎన్నికలను పరిశీలిస్తే బీజేపీ అధికార పార్టీకి గట్టిగానే సవాల్ విసిరినట్లు తెలుస్తోంది. పీకే టీమ్ సైతం ఎగ్జిట్ పోల్ సర్వేలో తాము ఊహించిన దానికంటే బీజేపీ బలంగా ఉందని లెక్కలు వేసినట్లు చెబుతున్నారు. దాంతో మిగిలిన దశల పోలింగ్ పై ప్రభావంపడేలా మమత ఎదురుదాడిని ఉదృతం చేశారు. బయటి వ్యక్తులు బెంగాల్ ను శాసించాలని చూస్తున్నారనే ప్రచారం పెంచారు. మమత పై జరిగినట్టుగా చెబుతున్న దాడి నుంచి సానుభూతిని రాబట్టాలని వ్యూహాన్ని సవరించుకున్నారు. మొత్తమ్మీద బెంగాల్ ఎన్నిక మమతా బెనర్జీ కి ఎంత ప్రతిష్ఠాత్మకమో ప్రశాంతకిశోర్ కు కూడా అదే తరహాలో కనిపిస్తోంది. ఒకవేళ పశ్చిమ బెంగాల్ లో తన అంచనాలు తప్పితే వ్యూహకర్త పదవి నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా చెబుతున్నారు. పూర్తి స్థాయి రాజకీయవేత్తగా సొంత రాష్ట్రమైన బిహార్ పై దృష్టి పెట్టాలనుకుంటున్నారు.

వ్రతం చెడ్డా…

ఉనికిని చాటుకోవడానికి, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కమ్యూనిస్టులు, కాంగ్రెసు నేతలు పడరాని పాట్టు పడుతున్నారు. సిద్దాంతాలను పక్కనపెట్టి మతవాద పార్టీలతోనూ చేతులు కలిపారు. కూటమి కట్టారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుందన్న గ్యారంటీ లభించడం లేదు. ఈ పార్టీలు వెస్టుబెంగాల్ లో మరింత బలహీన పడతాయనేది అంచనా. జాతీయ స్థాయి ప్రాధాన్యాన్ని వామపక్సాలు కోల్పోతాయి. కాంగ్రెసు పార్టీ పెద్ద రాష్ట్రాల్లో తన స్తానం ప్రశ్నార్థకం చేసుకుంటోంది. ఒకవేళ మమతకు భంగపాటు ఎదురైతే బీజేపీ కి 2024 సార్వత్రిక ఎన్నికలకు నైతిక బలం చేకూరుతుంది. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయం సాధించగలిగితే పార్టీకి తిరుగులేదన్న వాస్తవం దేశమంతా చాటి చెప్పినట్లవుతుంది. బీజేపీ పరాజయం పాలైతే ఆత్మావలోకనం తో పాటు ఆత్మరక్షణలో పడిపోతుంది. విపక్షాలు జట్టు కడితే తీవ్రమైన ఒత్తిడి తప్పకపోవచ్చు. స్వాతంత్ర్య సమర కాలం నుంచి రాజకీయ మార్పులకు తొలి వేదికగా ఉంటూ వచ్చింది పశ్చిమబెంగాల్. ఇప్పుడే తీర్పు చెప్పనుందో వేచి చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News