Prasanth kishore : ప్రశాంత్ కిషోర్ అంచనాలే నిజమవుతాయా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంలో దిట్ట. ఆయన అంచనాలు ఎప్పటికీ తప్పుకావు. గ్రౌండ్ లెవెల్ లో ఉన్న రియాలిటీని బట్టి ఆయన [more]

Update: 2021-10-28 16:30 GMT

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయ పరిస్థితులను అంచనా వేయడంలో దిట్ట. ఆయన అంచనాలు ఎప్పటికీ తప్పుకావు. గ్రౌండ్ లెవెల్ లో ఉన్న రియాలిటీని బట్టి ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఉత్తరాదిన కాకుండా దక్షిణాదిన ఆయన సంస్థ ఐ ప్యాక్ వివిధ రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యూహాలను అందిస్తూ ఉంది. అలాంటి ప్రశాంత్ కిషోర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.

మరో మూడు దశాబ్దాలు….

మరో మూడు, నాలుగు దశాబ్దాల పాటు బీజేపికి ఎదురులేదని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మోదీ దేశంలో స్ట్రాంగ్ గా ఉన్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కాంగ్రెస్ దీన స్థితిని ఆయన చెప్పకనే చెప్పారు. మోదీ దేశంలో ప్రభావం చూపగల నేతగా ప్రశాంత్ కిషోర్ చెప్పడాన్ని చూస్తే వచ్చే ఎన్నికలలోనూ కాంగ్రెస్ కు అధికారం రావడం కష్టమేనని అర్థం అవుతుంది. దీనిపై కాంగ్రెస్ నేతలు బయటకు ఖండిస్తున్నా వారి మనసులో ఉన్న మాట కూడా ఇదే.

ఏడేళ్ల నుంచి….

కాంగ్రెస్ గత ఏడేళ్ల నుంచి దేశంలో బలపడే పరిస్థితి కన్పించడం లేదు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సయితం కష్టాలను కోరి కొని తెచ్చుకుంటుంది. మరోవైపు అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి. ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో పోటీ బీజేపీ, ప్రాంతీయ పార్టీల మధ్యనే ఉంది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం కొరవడింది. రాష్ట్రాల్లో నాయకత్వం బలోపేతం చేయకుండా, ఢిల్లీ నుంచే శాసించాలన్న పాత పద్ధతులనే కాంగ్రెస్ అనుసరిస్తుంది.

భ్రమల్లో ఉన్నారా?

అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు సయితం అసంతృప్తితో ఉన్నారు. ఇది కూడా ఆ పార్టీకి ప్రతికూల అంశమే. ప్రజలు వారంతట వారే మోదీ ప్రభుత్వంపై తిరగబడతారన్న ఆశతోనే కాంగ్రెస్ అధినాయకత్వం ఉంది. ఈ పాత స్ట్రాటజీలు మార్చుకోవాలని ప్రశాంత్ కిషోర్ పరోక్షంగా కాంగ్రెస్ కు సూచించారు. భ్రమల నుంచి రాహుల్ గాంధీ బయటపడితేనే కాంగ్రెస్ కు మంచిరోజులని ప్రశాంత్ కిషోర్ సూచించడాన్ని బట్టి బీజేపీ ఎంత బలంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ ను కాంగ్రెస్ పాజిటివ్ గా తీసుకుని తప్పులు సరిదిద్దుకుంటేనే భవిష్యత్ ఉంటుంది.

Tags:    

Similar News