పీకేను పీకేసింది అందుకేనట

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తన రాజకీయ వారసుడిగా నితీష్ కుమార్ ఒకప్పుడు ప్రకటించారు. పార్టీ ఉపాధ్యక్షుడిని చేశారు. పార్టీ భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నానని [more]

Update: 2020-01-30 17:30 GMT

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తన రాజకీయ వారసుడిగా నితీష్ కుమార్ ఒకప్పుడు ప్రకటించారు. పార్టీ ఉపాధ్యక్షుడిని చేశారు. పార్టీ భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నానని నితీష్ ప్రశాాంత్ కిషోర్ కు అప్పగించారు. అన్ని రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్ ను తమ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంటున్నాయి. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడులో కమల్ హాసన్, డీఎంకేలు కూడా ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనల కోసం పాకులాడుతున్నాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ప్రశాంత్ కిషోర్ ను ఎందుకు దూరం చేసుకున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఈ అక్టోబరులోనే….

బీహార్ లో ఈ ఏడాది అక్టోబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. మరో మరో ఏడు నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో అన్ని రకాలుగా పనికొచ్చే ప్రశాంత్ కిషోర్ ను ఎందుకు దూరం చేసుకున్నారన్నదే పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రశాంత్ కిషోర్ తో పాటుగా, మరో నేత పవన్ వర్మపై కూడా నితీష్ కుమార్ వేటు వేశారు. వీరు ముఖ్యంగా పౌరసత్వ చట్ట సవరణపై పార్టీ లైన్ ను థిక్కరిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ.

బీజేపీనేతలు గుర్రుగా…..

అయితే నితీష్ కుమార్ ఇంతటి నిర్ణయం తీసుకోవడం వెనక బీజేపీ ఉందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. సీఏఏ విషయంలోనూ, ఢిల్ల ఎన్నికల విషయంలో తమకు ఇబ్బందులు కల్గిస్తున్న ప్రశాంత్ కిషోర్ పై బీజేపీ అగ్రనేతలు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా అమిత్ షా అంతర్గత సమావేశాల్లో ప్రశాంత్ కిషోర్ విషయం చర్చించినట్లు తెలుస్తోంది. ఒకవైపు బీహార్ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి వెళ్లాలనుకుంటే అదే పార్టీకి చెందిన నేత ప్రశాంత్ కిషోర్ తమపై విమర్శలు చేస్తుంటే ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారన్న ప్రశ్న తలెత్తుతోంది.

షా చెప్పడం వల్లనేనా?

అంతేకాకుండా నితీష్ కుమార్ నేతృత్వంలోనే తాము ఎన్నికలకు వెళుతున్నామని అమిత్ షా పదే పదే చెబుతున్నారు. సీట్ల సర్దుబాటు కూడా దాదాపు ఖాయం అయిపోయిందనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ లాంటి నేతల కారణంగా ప్రజల్లో పలుచన అయిపోతామని అమిత్ షా స్వయంగా నితీష్ కు చెప్పినట్లు తెలిసింది. పీకేను కంట్రోల్ చేయాలని కొద్దిరోజుల క్రితమే అమిత్ షా సూచించారని చెబుతున్నారు. నితీష్ కుమార్ ఎంత చెప్పినా ప్రశాంత్ కిషోర్ వినకపోవడంతోనే వేటు వేశారంటున్నారు. మొత్తం మీద నితీష్ కుమార్ పీకే లేకుండానే బీహార్ ఎన్నికలకు వెళుతున్నారు మరి.

Tags:    

Similar News