నేషనల్ సీక్రెట్ అలయన్స్…?

ప్రశాంత్ కిశోర్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ భారత రాజకీయాలకు కొత్త. గడచిన ఎనిమిది సంవత్సరాలుగా విస్తృతంగా చర్చల్లో నలిగిన వ్యూహకర్త ఆయనే. అంతకు ముందు భారత్ లో [more]

Update: 2021-07-15 16:30 GMT

ప్రశాంత్ కిశోర్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ భారత రాజకీయాలకు కొత్త. గడచిన ఎనిమిది సంవత్సరాలుగా విస్తృతంగా చర్చల్లో నలిగిన వ్యూహకర్త ఆయనే. అంతకు ముందు భారత్ లో ప్రొఫెషనల్ స్ట్రాటజిస్టుల పాత్ర చాలా పరిమితం. ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహరచనలు సొంతంగా చేసుకుంటుండేది. కానీ ఇప్పుడు దేశంలో ఇదొక వృత్తిగా మారింది. జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న వ్యక్తిగా ప్రశాంత్ కిశోర్ మారిపోయారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, రకరకాల సమీకరణలతో సామాజిక మాధ్యమాలు మొదలు సంఘటిత వేదికల వరకూ కొత్త ఒరవడిని అనుసరించడం ప్రశాంత్ కిశోర్ స్పెషాలిటీ. ఇప్పుడు మరొక కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నారు. దేశంలో మోడీ హవా తగ్గినా ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఈ స్థితిలో అందరికీ ఆమోదయోగ్యమైన జాతీయ రహస్య కూటమిని నెలకొల్పాలనేది ఆయన ఆలోచన. ఏ పార్టీకి ఆ పార్టీ సొంతంగా, స్వతంత్ర వైఖరితో తలపడుతున్నట్లు కనిపిస్తుంది. కానీ అంతర్గతంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ ప్రత్యామ్నాయానికి అవసరమైన సహకారం అందచేస్తాయి. దీనివల్ల ఆయా పార్టీలకు వచ్చిన నష్టం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విభేదించుకోవచ్చు. ఈ డేంజరస్ గేమ్ ను నడిపే సూత్రధారిగా తానే ఉండటానికి ముందుకు వస్తున్నారు ప్రశాంత్ కిశోర్. పూర్తి స్తాయి రాజకీయవేత్తగా మారడానికి ముందుగా అనుసంధానకర్తగా అడుగులు వేస్తున్నారు.

హస్తానికి హవా నహీ…

దేశంలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీ కాంగ్రెసు. సోనియా, రాహుల్, ప్రియాంక నాయకత్రయం. వీరి సహకారం లేకుండా బీజేపీని గద్దె దించడం అసాధ్యం. కాంగ్రెసుకు నాయకత్వం ఇచ్చేట్లయితే జాతీయంగా యూపీఏ కూటమి ఆయా ప్రాంతీయ పార్టీలతో అవగాహనకు సిద్దంగా ఉంది. కానీ చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు హస్తం పార్టీతో ప్రత్యక్షంగా చేతులు కలిపేందుకు సిద్దంగా లేవు. దాంతో 2024 లో కూడా మళ్లీ ఓటర్లు బీజేపీకే పట్టం గట్టవచ్చు. దీనిని ఊహించే ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగారు. బీజేపీతో ముఖాముఖిలో కాంగ్రెసు 194 స్థానాల్లో ప్రభావం చూపుతుందని ఆయన గణాంకాలను సమీకరించారు. వాటిని రాహుల్, ప్రియాంకల ముందు ఉంచారు. ఆయా స్థానాల్లో మూడో పార్టీ ప్రముఖంగా రంగంలో లేకుండా బీజేపీ వర్సెస్ కాంగ్రెసు ఉండేలా తాను బాధ్యత తీసుకుంటానని ప్రశాంత్ కిశోర్ హామీ ఇచ్చారు. బదులుగా మిగిలిన స్థానాల్లో కాంగ్రెసు నామమాత్రపు పోటీకే పరిమితం కావాలి. బలంగా ఉన్న బీజేపీ ప్రత్యర్థులకు సహకరించాలి. తద్వారా కమలం పార్టీని మట్టికరిపించాలి. ఈ ఫార్ములా వల్ల కాంగ్రెసు కు గ్యారంటీ విజయాలుంటాయి. ఇతర ప్రతిపక్షాలూ గెలుస్తాయి. మోడీని గద్దె దింపేందుకు వీలవుతుంది. ఈ ప్రతిపాదనపై తాజాగా చర్చలు మొదలయ్యాయి.

మూడో టెంటుకు నో…

ఇప్పటికే దేశ రాజకీయాల్లో రెండు కూటములున్నాయి. కాంగ్రెసు సారథ్యంలోని యూపీఏ, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ. ఈ రెంటినీ కాదని మరో కూటమి కట్టడం నేలవిడిచి సాము చేయడమే. కలగూర గంప వంటి ప్రాంతీయ పార్టీలతో ప్రయోగం చేయడం చుక్కాని లేని నావ వంటిదే. ఆమేరకు సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ప్రశాంత్ కిశోర్ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మూడో కూటమి అనేది ప్రవేశిస్తే బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుందని ప్రశాంత్ కిశోర్ అంచనా వేశారు. అందువల్ల బహిరంగంగా ఇప్పుడున్న రెండు కూటములే రంగంలో ఉంటాయి. కానీ ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెసు సహకరిస్తుంది. తద్వారా జాతీయ ప్రత్యామ్నాయానికి మార్గం ఏర్పాటు చేస్తుంది. అధికారికంగా ఎటువంటి పొత్తు ఉండదు. ఎన్నికల తర్వాత అవసరాన్ని బట్టి ఏం చేయాలనే అంశంపై కామన్ మినిమం ప్రోగ్రాం నిర్ణయించుకుంటారు. ఈ ప్రతిపాదనను కాంగ్రెసు పెద్దల ముందు ఉంచి ప్రశాంత్ కిశోర్ వారి అభిప్రాయాలను సేకరించారు. ఇప్పటికే ఈ విషయంపై శరద్ పవార్, మమతా బెనర్జీ వంటి నాయకులతోనూ ప్రశాంత్ కిశోర్ ఈ అంశాన్ని చర్చించారు. వారు సానుకూలత వ్యక్తం చేసిన తర్వాతనే కాంగ్రెసు నాయకులను కలిశారు.

గుట్టుగా గూడుపుఠాణి…

ప్రశాంత్ కిశోర్ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ ఇందులో అనేక చిక్కులు ఇమిడి ఉన్నాయి. రహస్య పొత్తుల అంశంపై ప్రజలకు వివరణ ఇవ్వడం కష్టం. అంతేకాకుండా క్యాడర్ లోనూ కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా చోట్ల పార్టీ అభ్యర్థులను బలి పశువులను చేసినట్లవుతుంది. 2019 ఎన్నికలను పరిగణనలోకి తీసుకుంటే కాంగ్రెసు పార్టీ దేశవ్యాప్తంగా 400 పైచిలుకు స్థానాల్లో పోటీ చేసింది. అందులో సీరియస్ గా పోటీ పడేవి 240 స్థానాలు ఉంటాయి. మిగిలిన 160 స్థానాల్లో నామ్ కే వాస్తే గా మాత్రమే కాంగ్రెసు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అయినా ఎంతో కొంత మేరకు ప్రతిపక్షాల ఓట్లను చీలుస్తున్నారు. ఫలితంగా చాలా చోట్ల బీజేపీ లాభపడుతోంది. ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదన ప్రకారం కాంగ్రెసు పార్టీ ముఖాముఖిగా సవాల్ విసరలేని స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దింపాలి. అక్కడ ఉన్న బీజేపీ యేతర పార్టీకి సహకరించాలి. అంటే తన అభ్యర్థులను తానే ఓడించుకుంటూ ప్రతిపక్షానికి పట్టం గట్టే విధంగా స్థానికంగా వ్యూహరచన చేయాలి. బదులుగా కాంగ్రెసు బలంగా ఉన్న చోట్ల ప్రతిపక్సాలన్నీ ఆ పార్టీకి సహకరిస్తాయి. ఈ ప్రతిపాదనపై కాంగ్రెసులో మల్లగుల్లాలు మొదలయ్యాయి. ఇటువంటి గూడుపుఠాణి వ్యూహాలు ఒక్కోసారి బూమ్ రాంగ్ అయ్యి మొదటికే మోసం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అధికారికంగా పొత్తులు లేకుండా , అవగాహన కూడా లేకుండా బీజేపీని ఓడించాలనే ఏకైక కోరిక ఇందులో కనిపిస్తోంది. పార్టీలలో సైద్ధాంతిక చిత్తశుద్ది లేని ఈ ప్రయత్నాలు గమ్యం చేరుస్తాయా? అన్నది ఒక ప్రశ్న. అసలు ప్రశాంత్ కిశోర్ చేసిన ఈ ప్రతిపాదనను మిగిలిన ప్రాంతీయ పార్టీలు మనస్ఫూర్తిగా అంగీకరిస్తాయా? అన్నది మరో ప్రశ్న.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News