అంత కాన్ఫిడెన్స్ ఎందుకో?

ప్రశాంత్ కిషోర్ మంచి ఎన్నికల వ్యూహకర్త. ఆయన వరసగా సక్సెస్ లను చవి చూస్తున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మమత బెనర్జీకి కాదు ప్రశాంత్ కిషోర్ [more]

Update: 2020-12-28 17:30 GMT

ప్రశాంత్ కిషోర్ మంచి ఎన్నికల వ్యూహకర్త. ఆయన వరసగా సక్సెస్ లను చవి చూస్తున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మమత బెనర్జీకి కాదు ప్రశాంత్ కిషోర్ కు సవాల్ గా మారాయని చెప్పక తప్పదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తే ప్రశాంత్ కిషోర్ గ్రాఫ్ మరింత పెరుగుతుంది. తన సక్సెస్ ను నిలబెట్టుకోవడానికి ఆయన తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

నేతలు వీడుతున్నా…..

294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే అధికారంలో ఉన్న టీఎంసీ నుంచి ఇప్పటికే అనేక మంది నేతలు బీజేపీ వైపు వెళ్లిపోయారు. మమత బెనర్జీకి కుడిభుజంగా ఉన్న నేతలు, పార్టీలో నెంబర్ 2 గా ఉన్న వారు సయితం మమత బెనర్జీని వీడిపోయారు. దీంతో మమత బెనర్జీకి కష్టాలు తప్పేట్లు లేవన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు టీఎంసీదేనని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

ఢిల్లీ తరహాలో…..

ఏపీలో ప్రశాంత్ కిషోర్ వైసీపీ తరుపున వ్యూహకర్తగా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయగలిగారు. తర్వాత ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ను మూడోసారి ముఖ్యమంత్రిగా చేయడంలోనూ ప్రశాంత్ కిషోర్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లోనూ అదే పరిస్థితి. మమత బెనర్జీ పదేళ్లుగా అధికారంలో ఉన్నారు. అయినా ఢిల్లీ తరహా విజయం బెంగాల్ లో ఉంటుందని ప్రశాంత్ కిషోర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తన టీం ఇచ్చిన నివేదికతోనే….

బీజేపీకి కనీసం రెండంకెల స్థానాలు కూడా రావని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 200 స్థానాలు ఖాయమని విశ్వాసాన్ని ప్రకటించారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం గత ఏడాదిన్నరగా పశ్చిమ బెంగాల్ లో పనిచేస్తుంది. తన టీం ఇచ్చిన నివేదికల మేరకే ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారనిపిస్తోంది. కానీ బీజేపీకి రెండంకెల స్థానం దాటదన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు మాత్రం టీఎంసీ క్యాడర్ లో ధైర్యాన్ని నింపడానికి చేసినట్లుగానే అనిపిస్తున్నాయి. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో మమత మళ్లీ గెలిస్తే ప్రశాంత్ కిషోర్ గ్రాఫ్ మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.

Tags:    

Similar News