ఎంతైనా పరవాలేదట

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు క్షణం తీరిక దొరికేట్లు లేదు. ఆయన వెంట రాజకీయ పార్టీలు పడుతుండటం విశేషం. తమకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించాలంటూ ప్రశాంత్ [more]

Update: 2019-12-03 18:29 GMT

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు క్షణం తీరిక దొరికేట్లు లేదు. ఆయన వెంట రాజకీయ పార్టీలు పడుతుండటం విశేషం. తమకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించాలంటూ ప్రశాంత్ కిషోర్ ను అభ్యర్థిస్తున్నాయి. తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడంతో ప్రశాంత్ కిషోర్ పేరు దేశమంతటా పొలిటికల్ సర్కిళ్లలో మారు మోగిపోతుంది. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరించాలంటే కనీసం వంద కోట్ల ప్యాకేజీ ఉంటుంది. అయినా సరే దానిని భరించేందుకు రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. ఎంతైనా పరవాలేదు తమకు వ్యూహకర్తగా వ్యవహరించాలని కోరుకుంటున్నాయి.

అన్నీ డిఫరెంట్ గా….

ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు గతంలోలా లేవు. ఎన్నికలకు ఒక వ్యూహమంటూ అవసరం. సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం ఎక్కువగా ఉండటంతో దానిని మెయిన్ టెయిన్ చేయడానికి ఒక గ్రూపు అవసరం. ఇక ఎన్నికల్లో ధీటైన అభ్యర్థులను ఎంపిక చేయడంలో కూడా రాజకీయ పార్టీలు గతంలో లాగా కాకుండా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నాయి. అలాగే ప్రచారంలోనూ, అంతకు ముందు కూడా పార్టీ అధినేతలు కొనసాగించాల్సిన తీరుతోనే విజయం వరిస్తుంది.

ఎప్పటికప్పుడు నివేదికలతో….

అయితే వీటన్నింటినీ ప్యాకేజీ రూపంలో ప్రశాంత్ కిషోర్ టీం తీసుకు వచ్చింది. సోషల్ మీడియా, ప్రచారం, సర్వేలు, అభ్యర్థుల పరిశీలన వంటి విషయాలను సమగ్రంగా అధ్యయనం చేసి మరీ నివేదికలను ఇస్తుంది. ఎన్నికలు జరగబోయే ముందు, తర్వాత ఇలా నాలుగైదు నివేదికలను పార్టీ అధినేతకు ప్రశాంత్ కిషోర్ టీం ఇస్తుంది. ఇది పార్టీ నాయకత్వానికి అన్నింటిలో సులభం చేస్తుంది. ఇలాగే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగలిగారు.

అన్ని పార్టీల నేతలూ…..

ఏపీలో వైసీపీ విజయం సాధించిన తర్వాత ప్రశాంత్ కిషోర్ వెంట దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తమ వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఉద్ధవ్ థాక్రే తన కుమారుడు ఆదిత్య ఠాక్రే రాజకీయ భవిష్యత్ కోసం ప్రశాంత్ కిషోర్ తో చర్చించారు. సలహాలు తీసుకున్నారు. కమల్ హాసన్ కూడా ప్రశాంత్ కిషోర్ తో సమావేశమయ్యారు. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ సయితం రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇద్దరి మధ్య త్వరలోనే చర్చలు జరగనున్నాయి. మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ బ్రాండ్ ఇమేజ్ అమాంతంగా పెరిగిందనే చెప్పాలి.

Tags:    

Similar News