మోడీకి పీకే ‘షా’క్….?

రాజకీయ వ్యూహకర్త గా తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ప్రశాంత్ కిశోర్ తన కొత్త పాత్రలో నెమ్మదిగా కుదురుకుంటున్నారు. అడుగు తీసి బయట పెట్టాలంటే ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయ [more]

Update: 2021-06-13 16:30 GMT

రాజకీయ వ్యూహకర్త గా తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ప్రశాంత్ కిశోర్ తన కొత్త పాత్రలో నెమ్మదిగా కుదురుకుంటున్నారు. అడుగు తీసి బయట పెట్టాలంటే ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయ పార్టీలు గతంలో పీకేకి కోట్ల రూపాయలు వెచ్చించేవి. కానీ ఇప్పుడు తన సేవలను ఉచితంగా, ఉదారంగా అందచేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. సొంత ఖర్చుటతో దేశ రాజకీయ చిత్రంలో మరో మార్పును ఆవిష్కరించాలని ప్రయత్నిస్తున్నారు. తద్వారా చరిత్రలో స్థానంతోపాటు రాజకీయంగా తన కెరియర్ కు పటిష్ఠమైన పునాదులు వేసుకోవాలని యోచిస్తున్నారు. ప్రధాని మోడీని గద్దె దించి విపక్షాలను పీఠమెక్కించాలనేది ప్రశాంత్ కిశోర్ ఆలోచన. అయితే వ్యూహకర్తగా మాత్రం కాదు. వివిధ పార్టీలకు రాష్ట్రాల్లో సర్వీసును తాను నెలకొల్పిన ‘ఐ’ ప్యాక్ సంస్థ చూసుకుంటుంది. తాను మాత్రం రాజకీయ పార్టీల మధ్య అనధికార సమన్వయ కర్త పాత్రను పోషించేందుకు ప్రశాంత్ కిశోర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఎత్తుగడలు ఎలా ఉన్నప్పటికీ పీకే కదలికలు బీజేపీకి తలపోటు తెప్పిస్తున్నాయి. అసలేం జరిగింది? ఎందుకు ఇంతగా కేంద్రంపై పీకే కక్ష గట్టారనే చర్చ బీజేపీలో పెద్ద ఎత్తున సాగుతోంది.

కక్ష గట్టిన వ్యూహకర్త…

ప్రశాంత్ కిశోర్ ను దేశ రాజకీయాలకు పరిచయం చేసింది నరేంద్రమోడీనే. అతనిలోని నైపుణ్యాన్ని గుర్తించి గుజరాత్ లో ప్రభుత్వ పరమైన బాధ్యతలు అప్పగించి ఒక అస్త్రంగా రాటు దేలడానికి వేదిక కల్పించారు మోడీ. 2012 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో మోడీ గెలుపు వెనక కీలక పాత్రధారిగా నిలిచారు. అయితే అప్పటికి ప్రశాంత్ కిశోర్ పేరు దేశానికి పెద్దగా తెలియదు. 2014లో మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు పీకే తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. దేశ విదేశాల్లోని రాజకీయ వ్యూహాలను, పొలిటికల్ ఇమేజ్ బిల్డింగ్ ఎత్తుగడలను దేశీయ పద్దతులకు మేళవించి మోడీని లార్జర్ దేన్ లైఫ్ పొలిటిషియన్ గా ప్రజల ముందు ఆవిస్కరించారు. అనితర సాధ్యమైన గెలుపు తర్వాత జాతీయంగా తనకు కీలకమైన బాధ్యతలు ప్రధాని మోడీ అప్పగిస్తారని ప్రశాంత్ కిశోర్ భావించారు. కానీ అది నెరవేరలేదు. తనకు అనుంగు సహచరుడు, విశ్వాసపాత్రుడు అయిన అమిత్ షా కు బీజేపీ అధ్యక్ష పదవితోపాటు వ్యూహరచనలోనూ పెద్ద పీట లభించింది. అమిత్ షా, ప్రశాంత్ కిశోర్ ల మధ్య గుజరాత్ ఎన్నికల్లోనే విభేదాలున్నాయనేది పార్టీ అంతర్గత సమాచారం. మోడీ వద్ద షా హవా సర్వంసహా చెలామణి కావడంతో ప్రధానికి దూరం కావాల్సి వచ్చిందంటున్నారు. ఆ తర్వాతనే రాజకీయ నైపుణ్యాలతో వివిధ రాష్ట్రాలలోని పార్టీలకు సేవలందించి స్వతంత్ర వ్యూహకర్తగా తనను తాను మలచుకున్నారు. ఇప్పుడు తన పరిధిని మరింతగా విస్తరించుకుంటున్నారు. పార్టీలకు సేవలందించే బదులు తానే రంగంలోకి దిగి , అందరినీ కూడగట్టి మోడిని గద్దె దించాలని ప్రశాంత్ కిశోర్ పావులు కదుపుతున్నారు.

దక్షిణాది సంక్లిష్టం..

వివిధ రాష్ట్రాల్లో పెద్ద పార్టీలుగా ఉన్న తృణమూల్ కాంగ్రెసు, ఎన్సీపీ, డీఎంకే ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ ఆలోచనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వామపక్సాలు ఎటూ మద్దతు పలుకుతాయి. కాంగ్రెసు పార్టీ కి రాహుల్ గాంధీ అధ్యక్షుడు కావడమే కాకుండా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ‘ ఐ’ ప్యాక్ సేవలు అందించడానికి సిద్దమవుతోంది. టీఆర్ఎస్, వైసీపీ, కర్ణాటకలోని జెడీఎస్ లను కూడా మోడీ వ్యతిరేక వేదికపైకి తీసుకురావాలనేది ప్రశాంత్ కిశోర్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఇక్కడే పీకే టీమ్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టడానికి జగన్ మోహన్ రెడ్డి సిద్దంగా లేరు. కాంగ్రెసుతో కూడిన కూటమికి మద్దతు పలకడం అసాధ్యమని ఇప్పటికే వైసీపీ వర్గాలు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవరి మాటా వినే రకం కాదు. పీకే వంటి వ్యూహకర్త చెప్పినట్లు నడుచుకుంటారనుకోవడం భ్రమే. స్వతంత్ర శైలి, వైఖరితోనే టీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంటుంది. కర్ణాటకలో జేడీఎస్ అస్తిత్వ సమస్యలు ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో పరిమిత ప్రాంతాల్లో అయినా పట్టు నిలబడితే చాలనుకుంటోంది. జాతీయంగా తమ పార్టీ పెద్దగా భూమిక పోషించగలదని ఆ పార్టీ నేతలే నమ్మడం లేదు. ఈ పరిస్థితుల్లో దక్షిణాది ప్రశాంత్ కిశోర్ స్ట్రాటజీలో భాగం కావడమనేది చాలా కీలకమే కాదు, సంక్లిష్టమనే చెప్పాలి.

ఉచితం… ఉదారం..

ఐ ప్యాక్ సంస్థ ఆర్థికంగా ఇప్పటికే పటిష్టంగా మారింది. తమకు సేవలందిస్తే చాలు వందల కోట్ల రూపాయలు గుమ్మరించడానికి రాజకీయ పక్షాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రశాంత్ కిశోర్ కు వాస్తవాలు తెలుసు. వ్యూహకర్తగా తన పాత్ర రాజకీయాలను మొత్తంగా ప్రభావితం చేసి మలుపు తిప్పలేదు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నచోట్ల మరింత బలోపేతం చేయడానికి వ్యూహాలు పనిచేస్తాయి. పోటాపోటీ వాతావరణం ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఎడ్జ్ సాధించడానికి తమ క్లెయింట్ కు ఉపకరిస్తాయి. సాధారణంగా మీడియా సైతం ఇదే పాత్ర పోషిస్తూ ఉంటుంది. అనుకూలంగా ఉన్న పార్టీల తరఫున పనిచేసే మీడియా మరింతగా ఆ పార్టీ బలపడానికి తోడ్పడుతుంది. తాము మద్దతునిచ్చే పార్టీ బలహీనంగా ఉన్నచోట్ల మీడియా ప్రజలను ప్రభావితం చేయలేదు. ఈ సూత్రం బాగా తెలిసిన వాడు కావడం వల్లే వివిధ రాష్ట్రాలలో బలమైన పార్టీలను సమీకరించడం ద్వారానే మోడీకి చెక్ పెట్టడం సాధ్యమవుతుందని ప్రశాంత్ కిశోర్ బావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఐ ప్యాక్ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేల్లో మోడీ వ్యతిరేక పవనాలు బలంగా ఉన్నట్లు గుర్తించింది. దానిని ఆసరాగా చేసుకుంటూ ఉచితంగా, ఉదారంగా సేవలు అందించడానికి ఐ ప్యాక్ , పీకే సిద్దమవుతున్నారు. 1977, 1989, 1996 నాటి రాజకీయ వాతావరణం ప్రస్తుతం దేశంలో నెలకొంటోందనేది పీకే అంచనా. కలగూరగంపగా అయినా ప్రతిపక్షాలు కలిస్తే ప్రత్యామ్నాయం సాధ్యమవుతుందనేది ప్రశాంత్ కిశోర్ అవగాహన.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News