ప్రశాంత్ భూషణ్ ది ప్రత్యేక అధ్యాయం

ప్రశాంత్ భూషణ్… నిన్న మొన్నటిదాకా న్యాయవాద వర్గాలకే ఆయన పేరు సుపరిచతం. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు, హైకోర్టు వంటి ఉన్నత న్యాయస్థానల న్యాయమూర్తులు, న్యాయవాదులకే పరిచయం. [more]

Update: 2020-08-31 16:30 GMT

ప్రశాంత్ భూషణ్… నిన్న మొన్నటిదాకా న్యాయవాద వర్గాలకే ఆయన పేరు సుపరిచతం. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు, హైకోర్టు వంటి ఉన్నత న్యాయస్థానల న్యాయమూర్తులు, న్యాయవాదులకే పరిచయం. సామాన్య ప్రజానీకానికి ఆయన ఎవరో, ఏమిటో తెలియదు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగిపోతోంది. లోతుగా చర్చ జరుగుతోంది. మొత్తానికి భారతీయ న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయానికి తెరతీశారు. కాంటెప్ట్ ఆఫ్ కోర్టు (కోర్టు ధిక్కరణ)కు సంబంధించి ఆయన లేవనెత్తిన అంశాలపై అన్ని వర్గాల్లో అధ్యయనం మొదలైంది. ఇది మున్ముందు అటు న్యాయపాలిక, ఇటు న్యాయవాద వర్గాలు తమ లోపాలను సవరించుకోవడానికి, మరింత మెరుగైన పనితీరును కనబరచడానికి దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటు శాసన, అటు కార్యనిర్వాహక వ్యవస్థలు కూడా కీలకమైన న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై అవగానకు రావడానికి దోహద పడుతుంది.

ఆయన చేసిన ట్వీట్….

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డేపై ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్ వివాదానికి ప్రధాన కారణం. బోబ్డే లాక్ డౌన్ సమయంంలో తన స్వస్థలమైన నాగపూర్ లో మోటార్ సైకిల్ ను నడుపుతున్న చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ సందర్భంగా ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లపై పిల్ ధాఖలైంది. దీన్ని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ గవాయ్, జస్టిస్ క్రిష్ణ మురారీ సభ్యుల ధర్మాసనం విచారించి ఆయన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేవిధంగా ఉన్నాయని, అందువల్ల క్షమాపణ చెప్పాలని, లేదా జైలుశిక్షను ఎదుర్కొనాలని ఆదేశించింది. తన వ్యాఖ్యలు ఎవరినీ కించపరిచే విధంగా లేవని, వాస్తవాలనే మాట్లాడానని, కోర్టు ధిక్కరణను ఎదుర్కొనేందుకు సిద్దమే తప్ప క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ కోర్టును కోరగా, హెచ్చరించి వదిలేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సూచించారు. అయితే క్షమాపణ చెబితే తప్పేంటని జస్టిస్ అరుణ్ మిశ్రా పదేపదే ప్రశ్నించారు. తన పదవీకాలంలో ఎవరినీ కోర్టు ధిక్కరణ కింద శిక్షించలేదని, తమ సహనానికి హద్దులుంటాయని, ప్రశాంత్ భూషణ్ ఏ న్యాయమూర్తినీ వదలలేదని, పదవిలో ఉన్న, పదవీ విరమణ చేసిన వారినీ కించపరిచే లక్ష్యంతో పని చేశారని ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా వ్యాఖ్యానించారు.

నికార్సయిన న్యాయవాది….

ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తుల్లో జస్టిస్ మిశ్రా ఈ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆయన సెప్టెంబరు 2న పదవీ విరమణ చేయనుండటం గమనార్హం. ప్రతిష్టాత్మకమైన అలహాబాద్ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసించిన ప్రశాంత్ భూషణ్ ముక్కుకు సూటిగా వ్యవహరించే నికార్సైన న్యాయవాది. అనేక ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో వాదించడం ద్వారా పేదల న్యాయవాదిగా పేరొందారు. కేసుల ద్వారా ఎంత సంపాదించామన్నది ఆయనకు ముఖ్యం కాదు. ఎంతమంది పేదలకు, మధ్యతరగతి ప్రజలకు తన వాదనల ద్వారా మేలు చేశానన్నదే ఆయనకు ముఖ్యం. ఈ విషయంలో ఆయన విమర్శకులు సైతం భూషణ్ ను అభినందించకుండా ఉండలేరన్నది వాస్తవం. అదే సమయంలో న్యాయవ్యవస్థలోని ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానంలోని లోపాలను, కొందరు న్యాయమూర్తుల వ్యవహారశైలిని ఎత్తిచూపడంలో కూడా ఏనాడూ వెనకడుగు వేయలేదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటంలో ఎప్పుడూ ముందుంటారు. గతంలో అన్నహజారే చేపట్టిన జన్ లోక్ పాల్ ఉద్యమంలో, ఇండియా ఎగనెస్ట్ కరప్షన్ ఉద్యమంలో పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తో విబేదాలు రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చారు.

తండ్రి వారసత్వాన్ని…..

అనంతరం తన సహచరుడు, రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ తో కలసి స్వరాజ్ ఇండియా అనే పార్టీని పెట్టారు. ప్రశాంత్ భూషణ్ తండ్రి శాంతిభూషణ్ న్యాయ, రాజకీయ దిగ్గజం. ఏడో దశకంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా యూపీలోని రాయబరేలీ నుంచి నాటి ప్రధాని ఇందిరాగాంధీ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆమె అక్రమాలకు పాల్పడ్డారంటూ దాఖలైన కేసులో వాదించింది శాంతిభూషణే కావడం గమనార్హం. 1977లో కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. 1986 వరకూ పార్టీ కోశాధికారిగా పనిచేశారు. తండ్రి న్యాయవాద వారసత్వాన్ని, పట్టుదలను ఫుణికి పుచ్చుకున్నారు ప్రశాంత్ భూషణ్ చరిత్ర సృష్టించారు.

Tags:    

Similar News