దాదా...వెళ్లింది అందుకేనా?

Update: 2018-06-11 17:30 GMT

ప్రణబ్ ముఖర్జీ...పరిచయం అక్కర్లేని పేరు. భారత రాజకీయాల్లో అత్యంత సుపరిచితమైన పేరు. రాజకీయ కురువృద్ధుడు. ఆయన చేసిన పదవులు మరెవరూ చేయలేదు. అత్యంత చిన్న వయస్సులోనే, నాలుగు పదుల వయస్సులోనే కీలకమైన కేంద్ర ఆర్థిక మంత్రిగా పనచిచేసిన ఘనత ఆయన సొంతం. 80వ దశకంలో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. 2004లో మన్మోహన్ ను మంత్రివర్గంలో అదే ప్రణబ్ ముఖర్జీ రక్షణ శాఖ మంత్రిగా పనిచేయడం రాజకీయ వైచిత్రి. పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్ గా, కేంద్ర ఆర్థిక,రక్షణ, విదేశాంగ మంత్రిగా, పీవీ నరసింహారావు హయాంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతిగా పనిచేసిన నాయకుడు. ఆయనజీవితంలో ఏదైనా అసంతృప్తి అన్నది ఉందంటే అది ప్రధాని కాకపోవడం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ప్రణబ్ సమర్థత,దక్షత, చాకచక్యం, లౌక్యం, సమస్యలను పరిష్కరించే తీరు గురించి ఎవరికీ రెండో మాట లేదు. ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు లేరు. కరడు గట్టిన కాంగ్రెస్ వాది. నెహ్రూ, ఇందిర, రాజీవ్ లను ఇప్పుడు సోనియా, రాహుల్ ను అత్యంత దగ్గరగాచూసిన వ్యక్తి. రాజీవ్ హయాంలో 80వ దశకంలో మధ్యలో కాంగ్రెస్ తో విభేదించి ప్రాంతీయ పార్టీ పెట్టి విఫలమయ్యారు. చివరకి తన పరిమితులను గుర్తించితిరిగి సొంతగూటికి చేరుకున్నారు.

వ్యూహాత్మకంగానేనా....?

ప్రణబ్ ఆర్ఎస్ఎస్ ఆహ్వానంపై వివిధ వర్గాల నుంచి విభిన్నమైన వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ శ్రేణులు సహజంగానే వ్యతిరేకించగా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వర్గాలు స్వాగతించాయి. వెళ్లక ముందు ఆయన ఏం మాట్లాడుతారో అన్న ఉత్కంఠ ఉండేది. తీరా ప్రణబ్ ప్రసంగం విన్న తర్వాత ఆయన ఎవరిని సమర్ధించారో...? ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడారో అర్థంకాక చాలా మంది తలపట్టుకుంటున్నారు. ఎవరికి వారు తమకు అనుకూలంగా ‘‘పెద్దాయన’’ మాట్లాడారన్న విశ్లేషణలు వెలువరిస్తున్నారు. ఒకటి మటుకు వాస్తవం. ప్రణబ్ నాగపూర్ వెళ్లక ముందు కాంగ్రెస్ స్కంధావారాలు ఒకింత గుర్రుతో, ఆగ్రహంతో ఉన్నాయి. తల్లీ, తనయుడు సోనియా, రాహుల్ మాట్లాడకపోయినా కింది నుంచి పై స్థాయి వరకూ ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రణబ్ ను తప్పుపట్టారు. ఆఖరుకు ఆయన కూతురు శర్మిష్ట ముఖర్జీ సైతం తండ్రిని తప్పు పట్టారు. ఈమె ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాలీలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. జంగీపూర్ ఎంపీ అయిన ప్రణబ్ కుమారుడు అభిజిత్ ముఖర్జీ మౌనం పాటించారు. అసెంబ్లీతో పాటు, ఉప ఎన్నికలు, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బెంగాల్ లో బీజేపీ బలపడటాన్ని గుర్తించిన ప్రణబ్ వ్యూహాత్మకంగానే ఆర్ఎస్ఎస్ సమావేశానికి వెళ్లారన్న వాదన ఉంది. బెంగాల్ లో భవిష్యత్తులో కాంగ్రెస్ కు అవకాశం లేదని గుర్తించిన ప్రణబ్ కుమారుడు, కూతరు రాజకీయ అవసరాల కోసమే బీజేపీకి చేరువవుతున్నారన్న అభిప్రాయం లేకపోలేదు. బెంగాల్ లోని ‘‘మాల్దా’’ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కూతురు శర్మిష్టా ముఖర్జీకి, కుమారుడు అభిజిత్ కు జంగీపూర్ టిక్కెట్ ఖరారు కోసమే‘‘పెద్దాయన’’ పావులు కదిపినట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. వాస్తవానికి మాల్దా స్థానం మొదటి నుంచి కాంగ్రెస్ దే. రైల్వే శాఖతో పాటు వివిధ శాఖల మంత్రిగా పనిచేసిన అబ్దుల్ ఘనీఖాన్ చౌదరి మాల్దా ఎంపీగా చాలాకాలం పనిచేశారు. ఇక్కడ ముస్లింలు ఎక్కువ. ప్రణబ్ కుమారుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జంగీపూర్ లో కూడా ముస్లిం ఓటర్లు ఎక్కువే. అయితే ముస్లిం ఓట్లు ఎక్కువగా తృణమూల్ కాంగ్రెస్ కు పడతాయి. మిగిలిన వర్గాల వారి ఓట్లు బీజేపీకి పడతాయి. ఈ ఉద్దేశ్యంతోనే ప్రణబ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న వాదన ఉంది.

ఎవరికీ అంతుచిక్కకుండా.....

ఇక తెరవెనక రాజకీయాలను పక్కనపెట్టి ప్రణబ్ ప్రసంగాన్ని పరిశీలిస్తే ఒక పట్టాన అంతుపట్టదు. ఎవరికి అనుకూలంగా మాట్లాడారో? ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడారో అర్థంకాదు. భారత్ భిన్నత్వానికి ప్రతీక అని, వివిధ మతాల జన్మస్థానం అని చెబుతూనే జాతీయవాదాన్ని ప్రస్తావించారు. భిన్నత్వానికి ప్రతీక అన్న విషయాన్ని బీజేపీ సహజంగానే అంగీకరించదు. అదే సమయంలో అది జాతీయవాదాన్ని సమర్థిస్తుంది. భిన్నత్వాన్ని కాంగ్రెస్ సమర్థిస్తుంది. అంతే తప్ప జాతీయ వాదానికి అది బహుదూరం. ఇక హెగ్డేవార్ జన్మస్థలాన్ని సందర్శించడం ఆర్ఎస్ఎస్ కు అత్యంత సంతోషదాయకం. కాంగ్రెస్ కు ఎంతమాత్రం మింగుడుపడని పరిణామం. బీజేపీ విశ్వసించే జాతీయవాదం స్థానంలో రాజ్యాంగ బద్ధ జాతీయ వాదాన్ని ప్రణబ్ ప్రస్తావించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న అవాంఛనీయ పరిస్థితులను ఎత్తి చూపారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు తదతర మతాల సమ్మిళతమే జాతీయత అని ఉద్భోదించారు. భారతీయుల బలం, విశిష్టత ఇదేనని చాటిచెప్పారు. ఈ వైరుథ్యమే విశిష్టతని, దానిని కాపాడుకోవాలని పిలుపునివ్వడం విశేషం. సహనం, సంయమనం ముఖ్యమని, అది భారతీయత బలమని విశ్లేషించారు. దానికి భంగం వాటిల్లితే మొత్తం జాతి దెబ్బతింటుందని హెచ్చరించారు. వ్యక్తుల కన్నా, నాయకుల కన్నా, చట్టాల కన్నా, రాజ్యాంగం కన్నా భారతీయ మూలాలు ముఖ్యమైనవని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని హితోపదేశం చేశారు. భిన్నాభిప్రాయాల మధ్య చర్చలు, సంవాదం అవసరమని, అవిలేకపోతే ప్రజాస్వామ్యం మనుగడే ఉండదన్న ప్రణబ్ విశ్లేషణను ఎవరూ తోసిపుచ్చలేరు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన బాల గంగాధర తిలక్ జాతీయ వాదాన్ని, తొలి ప్రధానిగా లౌకిక, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించిన నెహ్రూను కొనియాడటం ప్రణబ్ ప్రత్యేకత.

గతంలో అనేక మంది.....

ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు ఇతర వ్యక్తులు హాజరుకావడం ఇదే ప్రధమం కాదు. గతంలో ఎంతో మంది అతిధులుగా వెళ్లారు. మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్ వంటి ఉద్దండులు వెళ్లారు. వారెవరూ ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించలేదు. అలాగని సమర్థించలేదు. భిన్నత్వంలో ఏకత్వం సిద్ధాంతాన్ని నమ్మి తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు, వారి అభిప్రాయాలను ఆలకించేందుకు అక్కడికి వెళ్లారు. అంతే తప్ప ఒకరి అభిప్రాయాలను ఒకరు మార్చుకోలేదు. 2007లో అప్పటి ఆర్ఎస్ఎస్ అధినేత సుదర్శన్ ఆహ్వానం మేరకు వైమానికదళం మాజీ అధిపతి ఏవై టెప్నీస్ వెళ్లారు. ఆర్ఎస్ఎస్ పై అనేక సందేహాలు వ్యక్తం చేయడంతో పాటు కొన్ని ప్రశ్నలను కూడా సంధించారు టెప్నీస్. సందేహాలను నివృత్తి చేసి, సమాధానాలను కూడా ఇచ్చారు సుదర్శన్. అందువల్ల ఆర్ఎస్ఎస్ సమావేశానికి వెళ్లిన వారంతా వ్యతిరేకులు అనికూడా చెప్పలేం. మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య సారం చర్చా సంవాదం. ఇవి లేకుండా ప్రజాస్వామ్యం మన జాలదు. ప్రజాస్వామ్యంలో ఒకరి అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించనక్కరలేదు. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తే చాలు. మనిషిని మనిషిగా గుర్తించడమే మానవత్వం. ఇప్పుడు కావాల్సింది అదే.....!

 

ఎడిటోరియల్ డెస్క్

Similar News