ఎన్నియో యుద్ధముల ఆరితేరి..

Update: 2018-06-05 04:30 GMT

దాదాపు రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెసుతో గడిపిన ప్రణబ్ దా ఎందుకిలా చేశారు. కాంగ్రెసు ఆగర్భశత్రువుగా భావించే ఆర్ఎస్ఎస్ శిక్షణ సమావేశానికి అతిథిగా ఎందుకు వెళుతున్నారు. ఈ జీవన చరమాంకంలో తాను నమ్మిన విలువలకు తిలోదాలిచ్చేసి ఏం సాధించాలనుకుంటున్నారు? జూన్ ఏడో తేదీన ఆర్ఎస్ఎస్ మీటింగుకు హాజరయ్యేందుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంగీకరించారని తెలిసినప్పట్నుంచీ సాగుతున్నచర్చ ఇది. ఆయన రాజకీయ జీవితం దాదాపు ముగిసిపోయినట్లే. ఇంకా ఎందుకీ తాపత్రయం అనేవాళ్లూ ఉన్నారు.

ప్రణబ్ తో పరాచికమా?...

ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని అంగీకరించి ఉండకూడదని మెజార్టీ కాంగ్రెసు నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆరుదశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగరించుకున్న అతను అలా ఎందుకు చేశారనేది ఎక్కువమందిని వేధిస్తున్న ప్రశ్న. అందులోనే సమాధానం కూడా దాగి ఉంది. ఆ అనుభవమే ఆయనను అటువైపు నడిపించింది. యువకునిగా ఇందిరాగాంధీ కాలంలోనే తన వ్యూహనైపుణ్యాన్ని నిరూపించుకున్న సీజన్డ్ పొలిటీషియన్. అరవయ్యోదశకంలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎనభైలనాటికి ఇందిరకు అత్యంత సన్నిహితమైన కీలక మంత్రిగా విశ్వాసపాత్రుడయ్యారు. 80 లలో ప్రణబ్ ఆర్థికమంత్రిగా మాజీప్రధాని మన్మోహన్ సింగ్ ను రిజర్వు బ్యాంకు గవర్నరుగా నియమించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు సకాలంలో అప్పులు చెల్లించి ఇందిర వద్ద అత్యంతసమర్ధునిగా మార్కులు పొందగలిగారు. నిజానికి ఆర్థిక సంస్కరణల ప్రస్థానం మొదలైందప్పుడే. రాజీవ్ గాంధీకంటే ప్రధాని పదవికి తానే సమర్థుడినని భావించడంతో ప్రణబ్ కు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెసును వీడి 1986 రాష్ట్రీయ సమాజ్ వాదీకాంగ్రెసును స్థాపించుకున్నారు. మూడేళ్లలో మళ్లీ మాత్రుసంస్థ కాంగ్రెసులో విలీనం చేసేశారు. విదేశీ,రక్షణ, ఆర్థిక సహా కీలకమైన మంత్రిత్వశాఖలన్నిటినీ ఆయన నిర్వహించారు. పార్టీ అధ్యక్షపదవి మినహా కాంగ్రెసు వర్కింగు కమిటీ సహా దాదాపు అన్ని పార్టీ పదవులు నిర్వహించారు. మేన్ ఆఫ్ ఆల్ సీజన్స్ గా పేరుపొందిన ప్రణబ్ పార్టీ సంక్షోభాల పరిష్కర్త. తెలంగాణ సహా అనేక రాజకీయ ప్రభుత్వ కమిటీలకే కాకుండా దాదాపు అన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీల్లోనూ ఆయన ప్రాతినిధ్యం కొనసాగింది. చాలా కమిటీలకు ఆయనే అధ్యక్షుడు. ముందు వెనుకలు ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకునేంత అపరిపక్వ రాజకీయవేత్త కాదు. అందుకే ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని మన్నించడంలో ఆయన లెక్కలు ఆయనకున్నాయి.

కలహమా..? కలయికా?...

రాజకీయంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను కోట్లమంది వ్యతిరేకించవచ్చు. కానీ అంతకు రెట్టింపు అభిమానులున్నారు. పార్టీలు విభేదించవచ్చు. కానీ అధి ఫక్తు రాజకీయమే. అవునన్నా, కాదన్నా ఆర్ఎస్ఎస్ దేశ జనజీవన స్రవంతిలో అంతర్బాగం. 31వేల ప్రాంతాల్లో 54 వేల శాఖలతో విస్తరించిన ఒక సైద్దాంతిక మహావ్రుక్షం. ఏబీవీపీ, వీహెచ్పీ,బీఎంఎస్ వంటి 90 కి పైగా అనుబంధ సంఘాలతో లక్షా 70 వేల కు పైగా సాంఘిక, విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఒక భావ ప్రవాహం. దేశాన్నేలుతున్న ప్రధాని సహా మూడింట రెండు వంతుల మంది కేంద్రమంత్రులు ఈ నీడనుంచి వచ్చినవారే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులందరూ ఈ మూలాల నుంచి ఎదిగినవారే. రాష్ట్ర పతి, ఉపరాష్ట్రపతి పూర్వాశ్రమంలో ఆర్ఎస్ఎస్ అనుబంధం కలిగినవారే. మరి ఆ సంస్థతో పాటు వీరందరినీ కూడా దూరం పెడదామా? లక్షల్లో ప్రచారకులు, కోట్లమంది అభిమానులతో ఉన్న ఆర్ఎస్ఎస్ మూలమూలలా విస్తరించింది. వరదలు, ప్రక్రుతి విపత్తులు, యుద్దసమయాల్లో సైనిక క్రమశిక్షణతో రంగంలోకి దిగుతారు ఈ సంస్థ వాలంటీర్లు. మతపరమైన , సైద్ధాంతిక భావజాలాల్లో వైరుద్ధ్యాలతో ఇతర పార్టీలు ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించవచ్చు. అది ప్రజాస్వామ్య యుతంగా ఆయా పార్టీలకు ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ అది. కానీ దానిని ద్వేషంగా మార్చుకోవడమంటే దేశంలోని దాదాపు సగం ప్రజలకు దూరం కావడమే. విచక్షణను కోల్పోయి విలువైన సమయాన్ని వ్రుథా చేయడమే. భిన్నత్వంలో ఏకత్వమని ప్రవచించే రాజకీయ పార్టీలు ఈ నిజాన్ని గుర్తించ నిరాకరించడంతోనే ఆర్ఎస్ఎస్ సైద్దాంతిక భావజాలం దేశంలో మరింతగా వ్యాపిస్తోంది.

రణనీతి..రాజనీతి..

రాజకీయాల్లో అంటరానితనముండదు. అందర్నీ కలుపుకుని పోవడమే అసలైన నీతి. విభేదించే విధానాలతో రాజకీయంగా పోరాటం చేయడమెంత ముఖ్యమో, సామాజికంగా వారితోకలిసి నడవడమూ అంతే ముఖ్యం. ప్రజాస్వామ్యంలో సామాజిక అంతరం ఉండకూడదు. ఏకపక్ష ఆలోచనలతో ఉన్నవారిని సైతం సరిదిద్ది సర్దుబాటు చేయడం సామాజిక రాజకీయ వేత్తలకు లక్ష్యం కావాలి. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ, ఇందిరాగాంధీ వంటివారు సైతం ఇదే ఆలోచనతో ఆర్ఎస్ఎస్ సమావేశాలకు హాజరయ్యారు. తనకున్న పరపతిని, సోషల్ స్పేస్ ను వినియోగించి ఏదో చెప్పాల్సిన అవసరముందన్న ఉద్దేశంతోనే ప్రణబ్ నాగ్ పూర్ ఇన్విటేషన్ ను ఇష్టపడి ఉంటారు. సోనియా గాంధీకి రాజకీయ మెలకువలతో నడక నేర్పడమే కాదు , ఇందిర వంటి ఉక్కు ప్రధానికి సలహాలిచ్చిన ప్రణబ్ నిర్ణయాన్నే ప్రశ్నించడం అవివేకం. అంతటి అనుభవజ్ణునికి ఇంతగా తనపై విమర్శలు వస్తాయని తెలియదనుకోలేం. ఏదో ఉన్మాదంతో ప్రకటనలు చేసి రచ్చ చేయడం కంటే ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. హెల్తీ పొలిటికల్ స్పేస్ ను ఎవర్ గ్రీన్ గా ఉంచడమూ ముఖ్యం. రాజనీతిని మరిచిపోయి రణఘోషలో కొట్టుకుపోతే ప్రత్యర్థికే లాభం. పతనం స్వయంక్రుతాపరాధం.

Similar News