వారితోనే జగన్ కి ముప్పు

ముత్యాల ముగ్గు భజంత్రీలు రాజకీయ పార్టీలకు అధినేతలుగా వున్నవారికి తగిలితే ఇక అంతే సంగతులు. అన్న అడుగేస్తే మాస్ అంటూ సొంత పార్టీ వారు కొట్టే చిడతలు [more]

Update: 2019-07-29 12:30 GMT

ముత్యాల ముగ్గు భజంత్రీలు రాజకీయ పార్టీలకు అధినేతలుగా వున్నవారికి తగిలితే ఇక అంతే సంగతులు. అన్న అడుగేస్తే మాస్ అంటూ సొంత పార్టీ వారు కొట్టే చిడతలు ఇప్పుడు చంద్రబాబు లాగే వైఎస్ జగన్ కి వినిపిస్తున్నారు కొందరు. ఇవి వినడం అలవాటుగా మార్చుకుంటే మాత్రం వైసిపికి ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. నలభై ఏళ్ళ రాజకీయ జీవిత అనుభవం వున్న చంద్రబాబు మొన్నటి ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకోలేక బొక్కాబోర్లా అందుకే పడ్డారని కూడా గుర్తు చేస్తున్నారు. వందేళ్ళకు పైబడిన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చివరకు రాహుల్ వదులుకోవడానికి హస్తం పార్టీలో పెరిగిన అధినేత భజనే అని సాక్ష్యాలు సైతం చూపించేస్తున్నారు.

అసెంబ్లీలో తారాస్థాయికి …

సాధారణంగా పొగడ్తలు, ప్రశంసలు సన్మానాలు, సత్కారాలు జరిగే సమయంలో వక్తలు ఇవి పొందే వారికోసం నాలుగు మాటలు చెప్పడం రివాజుగా వస్తుంది. సభలు సమావేశాల్లో ఇలాంటివి చూసే ప్రజలు ఇప్పుడు రోజు చట్టసభల్లో కూడా చుడాలిసి వస్తుంది, వినాలిసి వస్తుంది. తమ నేత శూరుడు, వీరుడు అంటూ కళ్ళముందు ఏమి జరుగుతుందో కూడా తెలియకుండా ఎపి అసెంబ్లీలో వైఎస్ జగన్ కేంద్రంగా స్వామి భక్తులు గట్టిగానే చేశారు. జగన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కొందరు పోల్చారు. దేవుడు అన్నారు. ఇలా ఒకటి కాదు ప్రతి సందర్భంలో ఎమ్యెల్యేలనుంచి మంత్రుల వరకు నడిచింది. చాలా సందర్భాల్లో తమ నేతలు చేస్తున్న ప్రసంగాల్లో పొగడ్తలు తట్టుకోలేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం వారికి నమస్కారం చేసినా ఎవ్వరు ఎక్కడా తగ్గడం లేదు.

సొంత మీడియా ఇంకా …

ఇక వైసిపి సొంత మీడియా ప్రచార బాకా ఇక చెప్పనలవి కానిది. 2014 ఎన్నికల్లో అధికారానికి దగ్గరగా వచ్చి వైసిపి చతికిల పడటంలో వైఎస్ జగన్ సొంత మీడియా కూడా ఒక కారణంగా విశ్లేషకులు చాటి చెప్పారు. అదే విధంగా టిడిపి ఘోరంగా పరాజయం పొందడానికి చంద్రబాబు బాకా మీడియా లు కూడా ఆయనకు ప్రజల నాడి తెలియకుండా కళ్ళకు గంతలు కట్టేసిందనే విశ్లేషకులు తేల్చారు. ఇది కూడా టిడిపి ఓటమిలో ఒక కారణంగా చెబుతున్నారు. ఒక పొగడ్త కన్నా విమర్శ ఆలోచనలో పడేసి గాడి తప్పిన వారిని దారిలో పెడుతుందంటారు. కానీ రాజకీయ నాయకులు భజన బృందాలకు ఇచ్చే ప్రాధాన్యత పార్టీలో జరిగే తప్పులు ముక్కుసూటిగా చెప్పేవారిని దూరం పెడుతూ ఉండటంతో ముప్పు ఎదుర్కొవాలిసి వస్తుంది. నిజం చెబితే చేదుగా అబద్ధం తీయగా ఉండటంలో ఇన్ని అనుభవాలు ఎదురుగా వున్న నేపథ్యంలో వైఎస్ జగన్ జాగ్రత్తపడి ఆచితూచి అడుగులు వేయకపోతే చేదు అనుభవాలని చవిచూడాలిసి వస్తుందన్న హెచ్చరికలు వైసిపి అధినేత ఈమేరకు పరిగణలోనికి తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News