చౌదరి గారి కష్టమంతా వృధాయేనా?

అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం అనంత‌పురం అర్బన్‌. గ‌త 20 ఏళ్లలో ఇక్కడ నుంచి ఒక్క 2014లో మాత్రమే టీడీపీ విజ‌యం సాధించింది. 2014కు ముందు కాంగ్రెస్ [more]

Update: 2020-04-13 11:00 GMT

అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం అనంత‌పురం అర్బన్‌. గ‌త 20 ఏళ్లలో ఇక్కడ నుంచి ఒక్క 2014లో మాత్రమే టీడీపీ విజ‌యం సాధించింది. 2014కు ముందు కాంగ్రెస్ హ‌వా ఉన్నప్పటికీ.. రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో ఇక్కడ ప్రజ‌లు టీడీపీవైపు మ‌ళ్లారు. టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన వైకుంఠం ప్రభాక‌ర్ చౌద‌రి 2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. నిజానికి ప్రభాక‌ర్ చౌద‌రి చాలా క‌ష్టప‌డ్డారు. అంత‌కు ముందు ఆయ‌న అనంత‌పురం మునిసిప‌ల్ చైర్మన్‌గా ప‌నిచేయ‌డంతో న‌గ‌రంపై మంచి గ్రిప్ ఉంది. ఇక ఎమ్మెల్యే అయ్యాక కూడా అర్బన్ స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌డంలోనూ ఆయ‌న ముందుచూపుతో వ్యవ‌హ‌రించారు. ర‌హ‌దారుల వెడ‌ల్పు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటివాటికి ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీ త‌ర‌ఫున కూడా ప్రభాక‌ర్ చౌద‌రి మంచి స‌హ‌కారం అందింది. అధినేత చంద్రబాబు కూడా ప్రభాక‌ర్ చౌద‌రి ఎంత చెబితే అంత‌గా ముందుకు సాగి నిధులు విడుద‌ల చేశారు. పార్టీని పుంజుకునేలా చేయ‌డ‌మే ల‌క్ష్యంగా చౌద‌రి ముందుకు న‌డిచారు.

జేసీ అడ్డుతగలడంతో…..

అయితే, 2017 సంవ‌త్సరం నుంచి ఇక్కడి రాజ‌కీయాలు రంజుగా మారాయి. అప్పుడు అనంత‌పురం ఎంపీగా ఉన్న జేసీ.దివాక‌ర్ రెడ్డి జిల్లా కేంద్రమైన అనంత‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వ‌ర్గాన్ని పెంచి పోషించుకోవ‌డంతో ప్రభాకర్ చౌద‌రి టార్గెట్‌గా రాజ‌కీయం చేయ‌డం ప్రారంభించారు. దివాక‌ర్ రెడ్డి అనంత‌పురం అర్బన్‌ను కూడా త‌న చెప్పు చేత‌ల్లోకి తెచ్చుకునేందుకు ప్రయ‌త్నించారు. ఈ క్రమంలోనే చౌద‌రితో క‌య్యానికి కాలుదువ్వారు. ఆధిప‌త్య రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించారు. త‌న అనుకున్నవారికి పెద్దపీట వేశారు. ఎమ్మెల్యే చౌద‌రిని అడుగ‌డుగునా అడ్డుకున్నారు. దీంతో అప్పటి వ‌ర‌కు సాగిన అభివృద్ధి కాస్తా కుంటు ప‌డింది.

రాజకీయ వైరం నేపథ్యంలో…..

తొలి రెండేళ్లు అభివృద్ధి విష‌యంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభాక‌ర్ చౌద‌రి హ‌వా జేసీతో రాజ‌కీయ వైరం నేప‌థ్యంలో త‌గ్గిపోయింది. దీంతో వైసీపీ ఈ ప‌రిణామాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది. వైసీపీ అభ్యర్థి అనంత వెంక‌ట్రామిరెడ్డి వైసీపీ జెండా ఎగ‌రాల‌నే వ్యూహంతో ముందుకు సాగారు. ఫ‌లితంగా ఇక్కడ ప్రజ‌ల‌ను వైసీపీవైపు తిప్పడంలో స‌క్సెస్ అయ్యారు. క‌ట్ చేస్తే.. టీడీపీ ఇక్కడ గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైంది. జేసీ వ‌ర్గం, ప్రభాక‌ర్ చౌద‌రి వ‌ర్గాల మ‌ధ్య నెల‌కొన్ని పోరులో టీడీపీ న‌లిగిపోయింది. ప్రభాక‌ర్ చౌద‌రి ఓడిపోయారు. మ‌రి ఇప్పుడు ప‌రిణామాల‌ను చూస్తే.. జేసీ ఇక్కడ త‌న హవాను త‌గ్గించినా.. చౌద‌రి పుంజుకోలేక పోతున్నారు. పార్టీ కార్యక్రమాల‌ను తాను ఒంట‌రిగానే నిర్వహించాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ…..

ఇటీవ‌ల అనంత‌పురం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో జేసీ ప‌వ‌న్‌కుమార్ రెడ్డి త‌న వ‌ర్గానికి కొన్ని కార్పొరేట‌ర్ సీట్లు ఇప్పించుకోవాల‌ని ప‌ట్టుబ‌ట్టినా కూడా ప్రభాక‌ర్ చౌద‌రి స‌సేమీరా అన్నారు. ఇక ప‌వ‌న్‌కుమార్ రెడ్డి కూడా ఇక్కడ ప్రభాక‌ర్ చౌద‌రికి స‌హ‌క‌రించ‌డంలేదు. పైగా నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన అనంత వెంక‌ట్రామిరెడ్డి దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. ప్రజ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొంటున్నారు. టీడీపీ అనుచ‌రులను వ‌రుస పెట్టి వైసీపీలోకి చేర్చుకున్నారు. ఇది టీడీపీని తీవ్రంగా దెబ్బ‌తీసింది. పైగా జేసీ వ‌ర్గం కూడా ఇటీవ‌ల వైసీపీ బాట ప‌ట్ట‌డంతో చౌద‌రి నామమాత్రంగా మారిపోయారు. ఈ ప‌రిణామాలు మున్ముందు మ‌రింత పెరిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీంతో అనంత‌లో ఇక‌పైనా టీడీపీ పుంజుకుంటుందా ? ప్రభాక‌ర్ చౌద‌రి నిల‌దొక్కుకుంటారా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News