వేటు పడినా భయంలేదా?

తెలుగుదేశం పార్టీ వృధా ప్రయాస పడుతుంది. ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ను పదే పదే కోరుతుంది. టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, [more]

Update: 2020-10-12 08:00 GMT

తెలుగుదేశం పార్టీ వృధా ప్రయాస పడుతుంది. ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ను పదే పదే కోరుతుంది. టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాధరెడ్డలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ కోరుతుంది. గత శాసనమండలి సమావేశాల్లో సీఆర్డీఏ రద్దు బిల్లు, పాలన వికేంద్రీకరణ బిల్లులపై టీడీపీ జారీ చేసిన విప్ ను వీరు ఉల్లంఘించారన్నది టీడీపీ ఆరోపణ. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విచారణకు హాజరుకాకుండా…..

అయితే ఇప్పటికి మూడు సార్లు విచారణకు హాజరు కావాలని కోరినా పోతుల సునీత, శివనాధరెడ్డిలు హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలతో తాము హాజరుకాలేకపోతున్నామని వారు మండలి ఛైర్మన్ కు తెలుపుతూ వస్తున్నారు. అయితే వీరిద్దరిపై అనర్హత వేటు పడినా తెలుగుదేశం పార్టీకి ఒనగూరే ప్రయోజనం లేదు. అనర్హత వేటు పడి ఆ స్థానాలు ఖాళీ అయినా అవి వైసీపీకి మళ్లీ దక్కుతాయి.

వైసీపీ కండువా కప్పేసుకుని…..

ఇప్పటికే పోతుల సునీత వైసీపీ కండువాను కప్పేసుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదు. తనపై అనర్హత వేటు పడేందుకోసమే పోతుల సునీత రాజీనామా చేయడం లేదు. ఒకవేళ అనర్హత వేటు పడినా తిరిగి ఎన్నిక జరిగితే తనకు జగన్ అవకాశం కల్పిస్తారని ఆమె విశ్వాసంతో ఉన్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసి ఖాళీ అయిన స్థానాన్ని తిరిగి ఆయనకే జగన్ కేటాయించారు.

రెండు స్థానాలను…..

మరో ఎమ్మెల్సీ దేవగుడి శివనాధరెడ్డి మౌనంగా ఉంటున్నారు. ఆయన పార్టీ విప్ ను థిక్కరించి వైసీపీకి దగ్గరయ్యారు. తన సోదరుడు ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరినా ఆయన మాత్రం చేరలేదు. అయితే తన ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిన తర్వాత ఆయన ధోరణిలో మార్పు వచ్చినట్లు కన్పిస్తుంది. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరికను ఆయన వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాధ రెడ్డిపై అనర్హత వేటు పడినా చివరకు ఆ స్థానాలు దక్కేది వైసీపీకి మాత్రమే. ఇంతోటి దానికి ఎందుకింత ప్రయాస అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తుండగా, పార్టీని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని తెలుగుదేశం పార్టీ నేతలు కోరుతున్నారు.

Tags:    

Similar News