ఇంతకీ మేయ‌ర్ ఆయనేనా.. ?

జగన్ సామాజిక న్యాయంలో వింతలూ విడ్డూరాలు బోలేడు కనిపిస్తాయి. అలాగే మహిళలకు న్యాయం చేయాలనుకుని యాభై శాతం పదవులు ఆయన వారికి పంచేశారు. మరి మహిళలు రాణిస్తున్నారా. [more]

Update: 2021-09-04 06:30 GMT

జగన్ సామాజిక న్యాయంలో వింతలూ విడ్డూరాలు బోలేడు కనిపిస్తాయి. అలాగే మహిళలకు న్యాయం చేయాలనుకుని యాభై శాతం పదవులు ఆయన వారికి పంచేశారు. మరి మహిళలు రాణిస్తున్నారా. ఆకాశంలో సగమైన వారు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారా అంటే పెదవి విరుపే సమాధానం అవుతోంది. జగన్ చాలా చోట్ల ఇంట్లో ఇల్లాళ్ళను తెచ్చి సమున్నతమైన పదవులు అప్పగించారు. ఒక నాయకుడు సీనియర్ అయినా కూడా మహిళా కోటా భర్తీ కావాలంటే ఆ ఫ్యామిలీకే పదవి ఇస్తున్నాం కానీ మహిళలకే అంటూ భార్యకు కానీ తల్లికి కానీ కట్టబెట్టారు. వారికి చూస్తే రాజకీయంగా అనుభవం లేదు. దాంతో షాడోలుగా మారిపోతున్నారు.

స్మార్ట్ సిటీలో…?

విశాఖ మెగా సిటీగా ఉంది. ఆసియాఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ప్రధమ పౌరుడే మేయర్. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ పదవిలో మహిళా కోటా కింద గొలగాని హరి వెంకట కుమారికి అప్పగించారు. ఆమె పూర్వాశ్రమంలో టీచర్ గా పనిచేశారు. కానీ రాజకీయంగా అనుభవం లేదు. ఆమె భర్త కూడా విశాఖలో అగ్ర నేత కాదు. కానీ జగన్ మార్క్ పదవుల పంపిణీలో ఈ కుటుంబానికి లక్ తగిలింది. ఇక మేయర్ అయి నెలలు గడుస్తున్నా కూడా వెంకటకుమారి రాటుతేలడంలేదు. ఒక వైపు కార్పోరేటర్లు సీనియర్లుగా ఉన్నారు. జీవీఎంసీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. మేయర్ గట్టిగా ఉంటేనే సభ సజావుగా సాగుతుంది. అలాగే ఆమె తన సత్తాను కూడా చాటుకుంటేనే జీవీఎంసీలో పాలకపక్షం మాట నెగ్గుతుంది.

అన్నింటా ఆయనే ….

ప్రతి మగవారి విజయంలో మగువలు సగం అంటారు. కానీ విశాఖ ప్రధమ‌ పౌరురాలి విషయంలో మాత్రం ఇది రివర్స్. ఆమె విజయంలో కీలకమైన పాత్ర పోషించిన భర్త మేయర్ తరఫున అన్నీ తానై వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు జోరందుకుంటున్నాయి. మేయర్ సీటులో ఆమె కూర్చుంటున్నారు తప్ప మొత్తం బయట అన్నీ ఆయనే చక్కబెడుతున్నారు అంటున్నారు. ఒక విధంగా డీఫ్యాక్టో మేయర్ గా ఆయన ఉంటున్నారు అని సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ధోరణి మంచిది కాదు అని కూడా సీనియర్లు అంటున్నారు.

సగం కాలమే….

విశాఖ వంటి సిటీలో మేయర్ సీటు కోసం పెద్ద పోటీ ఉంది. పైగా అనేక సామాజికవర్గాల కన్ను కూడా ఈ పదవి మీద ఉంది. దాంతో చేరో రెండున్నర ఏళ్ళు ఈ పదవి అంటూ వైసీపీ ఒక ఒప్పందం పెట్టింది. దాని ప్రకారం మరో రెండేళ్ళ తరువాత ఆమె మాజీ అవడం ఖాయం. ఈలోగా తన పనితీరు మెరుగుపరచుకుంటే రేపటి రోజున ఎమ్మెల్యేగా కూడా అవకాశాలు వస్తాయని అంటున్నారు. అయితే భర్త చాటునే ఆమె ఈ రోజుకీ ఉంటూ వస్తున్నారని, ఫలితంగా జగన్ ఇచ్చిన సదవకాశాన్ని చేజేతులా కోల్పోతున్నారని అంటున్నారు. మేయర్ వంటి పవర్ ఫుల్ పదవికే ఇలా నీడలు అడ్డుగోడలు ఉంటే మిగిలిన మహిళా రిజర్వేషన్ల సంగతి చెప్పనవసరం లేదనే అనుకోవాలి. ఏది ఏమైనా కూడా మహిళలు రాణించాలి అన్న జగన్ ఆశయాన్ని అర్ధం చేసుకుని భర్తలే అడ్డుతొలగాలి అంటున్నారు మహిళా సంఘాల ప్రతినిధులు.

Tags:    

Similar News