వార్ గట్టిగానే వుందే …?

ఆంధ్రప్రదేశ్ లో వరద రాజకీయం వేడెక్కిపోతుంది. గోదావరి వరద బాధితులను ఆదుకునే అంశంలో అధికార విపక్షాల నడుమ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. బాధితులను ఆదుకోవడంలో సర్కార్ [more]

Update: 2019-08-09 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో వరద రాజకీయం వేడెక్కిపోతుంది. గోదావరి వరద బాధితులను ఆదుకునే అంశంలో అధికార విపక్షాల నడుమ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. బాధితులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం అంటూ విపక్షం రోడ్డెక్కింది. అంతే ధీటుగా అధికారపక్షం ఎదురుదాడి మొదలు పెట్ట్టింది.

గాల్లో తిరుగుతారా అంటున్న లోకేష్ ….

వరదలో జనం నానా బాధలు పడుతుంటే ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతూ సమీక్షలు చేపట్టడం ఏమిటంటూ టిడిపి యువ నేత లోకేష్ విరుచుకుపడ్డారు. దేవీపట్నం మండలంలో క్షేత్ర స్థాయిలో పర్యటించిన ఆయన గతంలో తమ ప్రభుత్వ హయాంలో హుద్ హుద్, తితీలి సమయంలో ఎలా పనిచేశామో ఇప్పుడు వైసిపి చేస్తున్నది చూశారా అంటూ ధ్వజమెత్తి మాటల యుద్ధానికి తెరతీశారు. బాధితులకు పదివేలరూపాయలు సాయం అందించాలని డిమాండ్ చేశారు లోకేష్. చంద్రబాబు పనితీరు కు జగన్ పనితీరుకు తేడా తెలిసివస్తుందా అని తమ పార్టీ గొప్పను చెప్పుకొచ్చారు.

నీట ముంచింది మీరేగా ….

టిడిపి పోలవరం ప్రాజెక్ట్ ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం ఫలితంగానే తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం వరద కష్టాలనుంచి గట్టెక్కడం లేదని ఆరోపిస్తుంది వైసిపి.అసలు ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు బాధితులకు సరుకులు పంపిణి చేసి గతంలో టిడిపి సర్కార్ చేతులు దులుపుకునేదాని మంత్రి ఆళ్ళనాని గుర్తు చేశారు. అదే జగన్ సర్కార్ నిత్యావసరాలతో బాటు బాధితులకు ఆర్ధిక సాయం అందజేస్తుందని తెలిపారు. ఇప్పటికే మంత్రుల బృందాలు వరదసాయం అందించేందుకు ఎప్పుడో రంగంలోకి దిగి పని ప్రారంభించాయని తమ అధినేత నిరంతరం వరద బాధితుల పరిస్థితులపై సమీక్షలు చేస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. వరద రాజకీయం టిడిపి మానుకుని వైసిపి పై బురద జల్లడం వదిలేయాలని హితవుపలికారు.

పిలుపు ఇచ్చి జనసేన …

గోదావరి వరదలు మొదలైన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హుందాగా వ్యవహరించారు. ప్రభుత్వం చేసే సాయం చేస్తుంది జనసేన సైనికులు వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చి సైలెంట్ అయ్యారు. అయితే అటు అధికార, విపక్షాలు మాత్రం ఏ అంశాన్ని తమ రాజకీయానికి పక్కన పెట్టడం లేదు. ముఖ్యంగా విపక్షం వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాకుండానే ఎక్కడికక్కడ కడిగి పారేయడమే పనిగా కార్యాచరణ మొదలు పెట్టడం విశేషం.

Tags:    

Similar News