ఈ ముగ్గురు అందుకు తగరా…?

‘‘ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి. కేసీఆర్ రాజీనామా చేయాలి. ’’ మరి పరిపాలించేదెవరు? ప్రజావిశ్వాసాన్ని కోల్పోయి అధికారం కోసం అంగలార్చుతున్న ప్రతిపక్షాలా? [more]

Update: 2021-05-08 15:30 GMT

‘‘ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి. కేసీఆర్ రాజీనామా చేయాలి. ’’ మరి పరిపాలించేదెవరు? ప్రజావిశ్వాసాన్ని కోల్పోయి అధికారం కోసం అంగలార్చుతున్న ప్రతిపక్షాలా? నిరంతరం అసంతృప్తి గళం వినిపించడం తప్ప ఆచరణాత్మక సూచనలు ఒక్కటి కూడా చేయని సూడో మేధావులా? వాస్తవిక పరిస్థితులతో సంబంధం లేకుండా తీర్పులు చెప్పే న్యాయస్థానాలా? ఏదేమైనా దేశంలో కోరస్ పెరుగుతోంది. ప్రభుత్వాలు విఫలమైన మాట వాస్తవం. అంగీకరించాల్సిందే. కానీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసుకుని కొట్టాడుకునే సమయం కాదిది. బలమైన నాయకత్వం, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉండాలి. ఈ స్థితిలో కాట్టాటకు తెర తీస్తూ రాజకీయ నాయకులు ప్రజల్లో పలచనై పోతున్నారు. వర్గాల వారీ గా ప్రజలనే విభజన చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఉన్న మతాలు, కులాలు సరిపోవన్నట్లు రాజకీయ ఉన్మాదం, విద్వేషాగ్ని లతో కూడిన కులం ఒకటి కొత్తగా పుట్టుకుని వచ్చింది. ఇది దేశానికి ఏమాత్రం మంచిది కాదు. నిజంగానే అధికారంలో ఉన్నవారు తగిన వారు కాదని భావిస్తే ప్రజలే తీర్పు చెబుతారు. ఎన్నికల వంటి సందర్బం వచ్చినప్పుడు తప్పిస్తారు. అప్పుడు వారి నాయకత్వం దేశానికి, రాష్ట్రానికి ఎందుకు సరిపోదో ప్రతిపక్షాలు ప్రజలకు వివరించి చెప్పాలి. అంతే తప్ప పనిగట్టుకుని సమయం, సందర్భం లేకుండా రాజీనామాల డిమాండ్ వల్ల ఒరిగేదేమీ ఉండదు.

బాద్యతారాహిత్యం…

అధికార పార్టీలు సహా రాజకీయ పార్టీలన్నీ కోవిడ్ మహమ్మారి విషయంలో తమ పాత్రను పోషించలేకపోతున్నాయనే చెప్పాలి. ఎన్నికలు వస్తే ఒక్కో నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలు కుమ్మరించే నేతలు ఇప్పుడు కనిపించడం లేదు. అధికారం పరుగులో తప్ప సాధారణ పరిస్థితుల్లో వారు నిధులను బయటికి తీయరన్నమాట. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసమర్థత, ప్రయివేటు ఆసుపత్రుల్లో దోపిడీ కరోనా సాకుతో యథేచ్చగా కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలకు కొన్ని లక్షల మంది కార్యకర్తలతో కూడిన యంత్రాంగాలున్నాయి. ప్రభుత్వ సిబ్బందినే పూర్తిగా నమ్ముకునే పరిస్థితి లేదు. రకరకాల కారణాల వల్ల వారిలో అలసత్వం పెరిగిపోయింది. ప్రభుత్వ అధినేతలు సైతం అదుపు చేసేందుకు సాహసించలేకపోతున్నారు. ఈ స్థితిలో రాజకీయ పార్టీలే చొరవ తీసుకోవాలి. ఎందుకంటే వారికి ప్రజలతో నేరుగా సంబంధాలుంటాయి. కరోనా రోగులకు ఆహారసరఫరా, అత్యవసర మందుల పంపిణీ, పట్టణానికి రెండు, మూడైనా ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు వంటివి పార్టీలు ఏర్పాటు చేస్తే మంచిది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేవాటికంటే ఇవే బాగా పనిచేస్తాయి. నాయకులు వ్యక్తిగతంగా నిధులు ఖర్చు పెడతారు కాబట్టి జవాబుదారీతనం ఉంటుంది. లోపాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళుతూ తాము సైతం సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం అవశ్య కర్తవ్యం.

కలిసి నడుద్దాం..

సోషల్ మీడియా యోదులు, అరుంధతీరాయ్ వంటి ఆవేశపరులు ఎన్నైనా చెప్పవచ్చు. ఎన్ని డిమాండ్లైనా చేయవచ్చు. ప్రధానమంత్రి రాజీనామా చేస్తే ప్రపంచం భారత్ ను ఏ కోణంలో చూస్తుంది. పాండమిక్ ను అదుపు చేయలేక దేశాధినేత తప్పుకోవాల్సి వచ్చిందంటే భారత్ తలఎత్తుకోగలుగుతుందా? అత్యంత బలహీనమైన బనానా రిపబ్లిక్ గా దేశాన్ని ఇతర దేశాలు జమకట్టి నవ్వుకోవా? ఆందోళన వాతావరణం నెలకొంది. దానికి ఆజ్యం పోసేందుకు తాము కూడా ఏదో అనేస్తే సరిపోతుందనే ధోరణి . అంతే తప్ప వాస్తవిక దృక్పథం కరవు అవుతోంది. అటు ప్రధాని నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోట్టాది ప్రజల ఆదరాభిమానాలతో ఎన్నికయ్యారు. ప్రజల విశ్వాసం ఉన్నంతకాలం వారే కొనసాగుతారు. అంతే తప్ప సామాజిక మాధ్యమాల్లో ఉద్యమాలు చేస్తే ప్రచారం తప్ప ఏదో జరిగిపోతుందనుకోవడం భ్రమ. బలమైన నాయకత్వం ఉంటేనే ఇప్పుడు ప్రజలను దారిలో పెట్టడం సాధ్యం అవుతుంది. అయితే నాయకులకు మార్గదర్శకత్వం అవసరం. ఆ బాధ్యతను ప్రతిపక్షాలు, మేధావులు పోషించాలి. నాయకులు మారిపోయినంత మాత్రాన కరోనా కట్టడి అయిపోదు. అనవసర గందరగోళం, రాజకీయ రచ్చ తప్ప సమస్యకు పరిష్కారం కాదు. అసలు సమస్యను పక్కదోవ పట్టించడమే అవుతుంది.

అద్దాల మేడలో…

తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాకు అవసరం లేదని ప్రజలు తెగేసి చెప్పారు. ఒకసారి కాదు . అసెంబ్లీ ఎన్నికల్లో , స్థానిక ఎన్నికల్లో, పురసాలక ఎన్నికల్లో టీడీపీని విపక్షానికే పరిమితం చేశారు. కేవలం 23 స్థానాలతో బలహీనమైన ప్రతిపక్ష బాధ్యతను అప్పగించారు. నిర్మాణాత్మక విధానాలతో ఎదిగితేనే టీడీపీకి భవిష్యత్తు ఉంటుంది. ఆ పార్టీ ప్రస్తుతం అత్యంత విషమ స్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు చంద్రబాబు నాయుడి వృద్ధనాయకత్వం, ఇంకా పుంజుకోని వారసత్వం, కుల, మతపరమైన పోలరైజేషన్ తో పటిష్ఠమైన ఓటు బ్యాంకుతో కొనసాగుతున్న అధికార పార్టీ. ఇవన్నీ టీడీపీకి ప్రతికూల పరిస్తితులే. క్షేత్ర స్థాయిలో పార్టీ పునర్నిర్మాణం , పునర్వ్యవస్థీకరణ అవసరం. దానికి నాయకత్వం గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేయాల్సి ఉంది. మొత్తం పార్టీ అంతర్గత సంక్సోభాన్ని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేయాలంటూ టీడీపీ రాగాలాపన మొదలు పెట్టింది. ఆ పదవిలో ఉండేందుకు జగన్ అనర్హుడంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ బాణాలు సంధిస్తున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రంలో ఉంటూ ప్రతిపక్షం గా అతిథి పాత్ర పోషిస్తున్నారంటూ చంద్రబాబుపై విమర్శలు పెరుగుతున్నాయి. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే ఆలోచన చేయకుండా తన సీనియార్టీని బాధ్యతగా వినియోగిస్తే రాష్ట్రానికి మంచిది.

ఇప్పటికైనా మేల్కోవాలి…

ప్రతిపక్షాలు పక్కా రాజకీయం చేస్తున్నమాట నిజమే. ప్రభుత్వాలు విఫలమవుతున్న మాట కూడా అంతే నిజం. ఉదాసీనత, నిర్లక్ష్యంతో రెండో విడత విజృంభణకు కారణమయ్యాయి ప్రభుత్వాలు. ఇందులో ప్రజల పాత్ర కూడా తోసిపుచ్చలేనిది. అంతా అయిపోయిందన్నట్లుగా విచ్చలవిడితనం ప్రదర్శించారు. మద్యం దుకాణాలు, హోటళ్లు, బార్ల వద్ద క్యూలు కడుతున్న తీరే ఇందుకు నిదర్శనం. ఇప్పటికీ ఈ ధోరణిలో పెద్దగా తేడా లేదు. ప్రభుత్వాలు కేవలం ఆర్థిక సంగతులనే ఆలోచించకుండా వ్యసనపరులను కంట్రోల్ చేయడంపైనా దృష్టి పెట్టాలి. వారివల్ల ఆర్థిక పరిస్థితులే కాదు, కుటుంబాల ఆరోగ్య పరిస్థితులూ దిగజారుతున్నాయి. రాజీనామాల తీవ్ర డిమాండ్ రావడానికి నాయకుల స్వయంకృతాపరాధమూ కారణమే. కనీసం మూడో వేవ్ అయినా రాకుండా కాపాడితే దేశానికి మేలు చేసినవారవుతారు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News