సెంటిమెంట్లకు చెక్ పడింది.. కారణమదేనా?

ఏదైనా ఉప ఎన్నిక ఎందుకు జరుగుతుంది. సిట్టింగ్ శాసనసభ్యుడు మరణిస్తే ఆ ఎన్నిక అనివార్యమవుతుంది. అధికార, ప్రతిపక్షానికిచెందిన ఏ సభ్యుడైనా మరణిస్తే అక్కడ పోటీ పెట్టకుండా ఉండాలని [more]

Update: 2021-05-10 03:30 GMT

ఏదైనా ఉప ఎన్నిక ఎందుకు జరుగుతుంది. సిట్టింగ్ శాసనసభ్యుడు మరణిస్తే ఆ ఎన్నిక అనివార్యమవుతుంది. అధికార, ప్రతిపక్షానికిచెందిన ఏ సభ్యుడైనా మరణిస్తే అక్కడ పోటీ పెట్టకుండా ఉండాలని రాజకీయ పార్టీలు భావిస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కలసి ఉన్నప్పుడు ఈ సెంటిమెంట్ కు రాజకీయ పార్టీలు విలువ ఇచ్చేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి లేదు. దీనికి కారణాలు కూడా రాజకీయంగా ఉన్నాయంటున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో…

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు ఉన్నా వాటి మధ్య సయోధ్య ఉండేది. ఎన్నికలప్పుడే రాజకీయం చేసేవారు. మిగిలిన సమయాల్లో అభివృద్ధి పైనే దృష్టి సారించేవారు. విపక్షాలు చేసే సూచనలు కూడా అధికార పార్టీలు పరిగణనలోకి తీసుకునేవి. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయింపులు చేయడం చాలా తక్కువ. దీనికి కారణం నాయకత్వంపై నమ్మకం, పార్టీ పట్ల విధేయల నాటి నేతలకు ఉండేవి.

విడిపోయిన తర్వాత…?

కానీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఒక్క నందిగామలోనే ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయింది. తెలంగాణలో అయితే అదీ కూడా లేదు. పాలేరు లో కాంగ్రెస్ సభ్యుడుమరణిస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ పోటీకి దింపింది. ఇక ఏపీలో కూడా నంద్యాలలో భూమా నాగిరెడ్డి మరణిస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అభ్యర్థిని బరిలోకి దింపింది. అప్పటి నుంచి ఎవరు మరణించినా ఏకగ్రీవం అనే మాట రెండు రాష్ట్రాల్లో విన్పించడం లేదు.

బలం తెలుసుకోవడానికేనా?

దీనికి కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. ఒక్క సారి అవకాశమిస్తే ప్రత్యర్థి బలపడి పోతాడని, క్యాడర్ లో నైరాశ్యం అలుముకుంటుందని ఒక కారణం. మరో ముఖ్యమైన కారణం తమ బలాన్ని మరోసారి పరీక్షించుకోవడం, ఓట్ల శాతం మెరుగుపడిందా? బలహీనపడిందా? అనేది తెలుసుకోవడం కోసం ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. తమ బలాన్ని పరీక్షించుకుని అందుకు తగిన విధంగా వ్యూహాన్ని రచించుకోవచ్చన్న అభిప్రాయంతోనే బరిలోకి దిగుతున్నాయి. అందుకే టీడీపీ నిన్న తిరుపతిలో, రానున్న కాలంలో బద్వేల్ లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది.

Tags:    

Similar News