తంబీలతో తందానా …..?

పొరుగు వాడిని చూసి అసూయ పడటం కామన్. తమిళనాడును చూసి దక్షిణభారతంలోని అన్ని రాష్ట్రాలు ఎంతో కొంత అసూయ పడుతుంటాయి. ఎందుకంటే అక్కడి ప్రజల్లో ఉన్న భాషాభిమానం, [more]

Update: 2021-03-17 16:30 GMT

పొరుగు వాడిని చూసి అసూయ పడటం కామన్. తమిళనాడును చూసి దక్షిణభారతంలోని అన్ని రాష్ట్రాలు ఎంతో కొంత అసూయ పడుతుంటాయి. ఎందుకంటే అక్కడి ప్రజల్లో ఉన్న భాషాభిమానం, సంప్రదాయాలను కాపాడుకోవడం ముచ్చట వేస్తుంది. ద్రవిడ సంస్కృతికి ప్రాణం పెడతారు. ఆత్మాభిమానానికి పెద్ద పీట వేస్తారు. తమ జాతి విషయాల్లో జోక్యం చేసుకుంటే ఎవరినీ సహించరు. జోలికి వస్తే తోలు తీస్తారు. జాతీయ పార్టీలను నియంత్రించి ప్రత్యేకతను చాటుకుంటారు. దక్షిణభారతమంటే ఉత్తరభారత పార్టీలకు ఇంకా ఎంతో కొంత భయం,భక్తి ఉన్నాయంటే కారణం తమిళనాడు రాజకీయాలే. జాతీయ పార్టీలు అధికారంలోకి వచ్చి పెత్తనం చేయకుండా నియంత్రిస్తున్న పెద్ద రాష్ట్రం. ఇవన్నీ పాజిటివ్ కోణాలు. కానీ ఎన్నికలు వచ్చాయంటే చాలు ఆ రాష్ట్రంలో పార్టీలకు తిక్క లేస్తుంది. ఎటువంటి హామీలు ఇస్తున్నారో అంతు పట్టదు. ఆకాశంలో చందమామను సైతం ప్రామిస్ చేసి ఇచ్చేస్తామంటారు. దానిని గుడ్డిగా ఫాలో అయ్యేందుకు సిద్ధంగా ఉంటాయి మిగిలిన రాష్ట్రాల్లోని పార్టీలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పార్టీలు. తమిళనాడు పార్టీల మ్యానిఫెస్టోలు మేధావులు, విద్యావంతుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ప్రజలను ఏం చేద్దామనుకుంటున్నారు? రాష్ట్రాన్ని ఏ బాట పట్టిద్దామనుకుంటున్నారన్న సంగతి అంతుపట్టడం లేదు.

తెలుగు రాష్ట్రాల గుండెల్లో గుబులు..

దక్షిణభారతంలో పెద్ద రాష్ట్రం తమిళనాడు. పారిశ్రామికీకరణ వికేంద్రీకరణ సాగిన రాష్ట్రం. వివిధ రకాల పరిశ్రమలు, వాణిజ్యం, సాఫ్ట్ట వేర్, చలన చిత్ర రంగాలకు కేంద్రం. అందువల్లనే ఆదాయానికి లోటు లేదు. పైపెచ్చు కేంద్రం నుంచి తమ వాటాను పోరాడి తెచ్చుకుంటారు. అధికారంలోకి రావడానికి ఇక్కడి పార్టీలు సంక్షేమ మంత్రాన్ని అవసరాన్ని మించి పఠిస్తుంటాయి. ఎంజీఆర్ కాలం నుంచి ఇది పెరుగుతూ వచ్చింది. జయలలిత పాలన సమయానికి పతాక స్థాయికి చేరింది. బియ్యం, నిత్యావసరాల వంటివే కాదు. కలర్ టీవీలు, మిక్సర్లు, గ్రైండర్లు, మొబైళ్లు అన్నీ ఇక్కడి ప్రజావసరాలే. ఎన్నికల ప్రణాళికలలలో వాటన్నిటికీ గతంలోనే ఇచ్చేశారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలకు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. పార్టీలు ఏవైనా ఇచ్చిన హామీలు చూస్తే ప్రజలు ఇకపై కష్టపడాల్సిన పని లేదు. తమ అకౌంట్లలో పడుతున్న డబ్బులను చూసుకుని బ్రతికేయడమే అన్నట్లుగా ఉన్నాయి. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, ఉచిత గ్యాస్ సిలండర్లు, మత ప్రదేశాల సందర్శనకు ప్రయాణ ఖర్చులు వంటివి కొత్తగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ సాధ్యమా? కాదా? అన్నది పక్కనపెడితే కాపీ కొట్టేందుకు సిద్దంగా ఉండే తెలుగు రాష్ట్రాల భవిష్యత్ ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. బియ్యం రాయితీ మొదలు, అన్న క్యాంటీన్ల వరకూ తమిళనాడు నుంచి తీసుకున్నవే. ఈ తరహా పథకాలను అమలు చేస్తామని అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణల్లోని పార్టీలు సిద్దమవుతాయేమోననే ఆందోళన పుడుతోంది.

ఇప్పటికే దివాళా…

మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు మెరుగైన ఆర్థిక పరిస్థితిలో ఉంది. అక్కడ ప్రభుత్వానికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వస్తోంది. ఎన్నిరకాల సంక్షేమ పథకాలు, వితరణలు కొనసాగించినా దాని ప్రభావం తక్షణం కనిపించదు. అప్పు పుట్టేందుకు అవసరమైన వనరులు ఉన్నాయి. కానీ ఆంద్రప్రదేశ్, తెలంగాణల పరిస్థితి భిన్నం. విపరీతమైన పథకాలతో ఏపీ ఇప్పటికే దివాళా తీసింది. రానున్న ముప్ఫై నలభై సంవత్సరాల పాటు అధికస్థాయిలో పన్నులు వేస్తే తప్ప ఒడ్డున పడని స్థితి. తెలంగాణ హైదరాబాద్ ను నమ్ముకుని లాగించేస్తోంది. కేరళలో వామపక్ష ప్రభుత్వాలు సైతం సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నాయి. అయితే పర్యాటకం, విదేశాల్లో ఉన్న ప్రవాసులు పంపుతున్న నిధులు కేరళను ఒడ్డున పడేస్తున్నాయి. విద్య, వైద్యం, పంచాయతీల పరిపాలన లో సాధించిన విజయాలు నిధుల దుర్వినియోగాన్ని అరికడుతున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలకు తోడ్పడుతున్నాయి. తద్వారా సంక్షేమంలో చేస్తున్న వృథా ఖర్చు పెద్ద బారంగా కనిపించడం లేదు. దక్షిణాదిలోని తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకల్లో ఈ పరిస్థితి లేదు. సంక్షేమ పథకాల దుర్వినియోగం, విద్య, వైద్య రంగాల్లో అవ్యవస్థ కొనసాగుతున్నాయి. వీటిని సరిదిద్దకుండా గుడ్డిగా తమిళనాడు ప్రణాళికలను చూసి ఆచరిస్తే కొంపలంటుకుంటాయి. కానీ తమిళనాడులోని రెండు ప్రధాన కూటముల మేనిఫెస్టోలు ప్రజలనే కాదు, పక్క రాష్ట్రాల పార్టీలను ఆకర్షిస్తున్నాయి. ఉత్తరభారతంతో పోలిస్తే దక్షిణాది చాలా ప్రగతిని సాధించింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అయినా ప్రజలను ఇంకా ప్రభుత్వ సాయంపై మితిమీరి ఆధారపడే విధంగా చిత్రీకరిస్తున్నాయి పార్టీలు. దీనివల్ల మరింత ముందడుగు వేయాల్సిన రాష్ట్రాలు వెనకవరసకు చేరతాయి..

షో …కు సర్కారుది…

రాజకీయ పార్టీలలో దార్శనికత లోపించడం, ప్రజలలో అవగాహన కొరవడటంతో బిహార్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉత్తమ ఫలితాలను సాధించలేకపోయాయి. బీమార్ రాష్ట్రాలుగా మిగిలిపోయాయి. అదే సమయంలో దక్షిణభారత ప్రజలు ప్రపంచంతో అనుసంధానమయ్యారు. అవకాశాలను అందిపుచ్చుకున్నారు. గుజరాత్ సైతం అదే ధోరణిలో తన ఆర్థిక మూలాలను పటిష్టం చేసుకుంది. ఇది ప్రజలు సాధించిన విజయం. తమ ఆర్థిక పరిస్థితితో పాటు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. పెట్టుబడులు తెచ్చారు. నిధులను కుమ్మరించారు. ఇక్కడి ప్రజల్లో నూటికి ఎనభై శాతం మంది ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి బయటికి వచ్చేశారు. ప్రభుత్వాలకు ఇదొక చక్కని అవకాశం . విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతులపై ప్రభుత్వ నిధులను వెచ్చించవచ్చు. అవి సామాజిక వనరులుగా మారుతాయి. దీర్ఘకాల ఫలితాలతో రాష్ట్రాలు ముందంజ వేస్తాయి. భవిష్యత్ తరాలు బాగుపడతాయి. కానీ అంతటి దీర్ఘకాలిక దృష్టి ప్రభుత్వాలకు కొరవడింది. ఉచితంగా వచ్చే సొమ్ములంటే ఎవరికైనా ఆశ కలుగుతుంది. ప్రజల్లోని ఈ అత్యాశను ఆసరాగా చేసుకుంటూ ప్రభుత్వాలు డబ్బులను వివిధ రూపాల్లో పంపిణీ చేసేస్తున్నాయి. ఉచితానుచితాలను మరిచి ఉద్దేశపూర్వకంగానే సర్కారు షోకు చేస్తోంది. ప్రజలు నిరంతరం ప్రభుత్వాన్ని దేబిరించేలా తయారు చేస్తున్నాయి. ఇదంతా చేతినిండా సొమ్ములు ఉన్నప్పుడు చెల్లుబాటవుతుంది. అప్పులు చేసి మరీ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఆ నిధులన్నీ రాబోయే కాలంలో ప్రజలు చెల్లించాల్సిందే. రాష్ట్రాలు రుణ సంక్షోభంలోకి మళ్లుతున్నాయి. భవిష్యత్ తరాలు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నాయి. తల్లిదండ్రులు అప్పులు చేసి తీర్చకుండా మరణిస్తే వాటిని చెల్లించేటప్పుడు పిల్లలు ఏవిధంగా తిట్టుకుంటారో అందరికీ తెలుసు. అయిదు, పదేళ్లు అధికారంలో ఉండే ఈ ప్రభుత్వాలు చేస్తున్న అప్పులకు భవిష్యత్ తరాలు ఎంతగా బాధపడతాయో..కదా..?

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News