ఏడుపులు.. పెడబొబ్బలు.....!!

Update: 2018-12-28 16:30 GMT

సమీక్ష... ప్రతి ఎన్నిక తర్వాత పార్టీలు నిర్వహించుకునే అంతర్గత సమీక్ష. విజయం సాధించిన పార్టీలు , అభ్యర్థులు మరింత బాధ్యతాయుతంగా ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని సంకల్పం తీసుకుంటారు. ఓడిపోయిన పార్టీలు లోపాలను సమీక్షించుకుని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుడతారు. ఇది సాధారణంగా జరగాల్సిన తంతు. ఫలితాలు వచ్చిన పదిహేనురోజుల తర్వాత కూడా తెలంగాణలో ఇంకా సమీక్షలకు తెరపడలేదు. టీఆర్ఎస్ అప్రతిహత విజయం సాధించింది. అయినా సంతృప్తి లేదు. అగ్రనాయకుల పర్యటనలతో బాగా హడావిడి చేసిన బీజేపీ బావురుమంటోంది. శపథాలు చేసి, కూటమి కట్టి ఇక ప్రభుత్వ పదవుల పంపిణీ యే మిగిలిందన్నంత ఆత్మవిశ్వాసం కనబరిచిన హస్తంపార్టీ అయోమయం నుంచి బయటపడలేదు. అయితే అన్ని పార్టీల సమీక్షల్లోనూ కనిపించిన కామన్ అజెండా ఒకటి ఉంది. నెగ్గిన వాడూ, ఓడిపోయిన వాడూ సొంత పార్టీలోని ప్రత్యర్థులను తిట్టిపోశారు. అందరు నాయకులూ సొంత పార్టీ అగ్రనాయకత్వం పైనే ఎక్కువగా ధ్వజమెత్తారు. దీనికి టీఆర్ఎస్ మాత్రం మినహాయింపు. బీజేపీ నాయకులు ఢిల్లీ పైనే గురిపెట్టారు. కాంగ్రెసు నాయకులు ఢిల్లీతో పాటు తమలో తాము తిట్టుకోవడానికి అధిక ప్రాధాన్యమిచ్చారు.

అంతా మీరే చేశారు...

2014 ఎన్నికల నుంచి బీజేపీకి ఒక బలమైన నమ్మకం. అసలు టీడీపీతో కలిసి వెళ్లకూడదని అప్పట్లో తెలంగాణ బీజేపీ నాయకులు చాలా ప్రయత్నాలు చేశారు. అధిష్టానం ససేమిరా అనడంతో టీడీపీతో కలిశారు. అయిుదు సీట్లు గెలిచారు. ఈసారి ఎటూ బీజేపీ,టీడీపీ పొత్తు చిత్తు అయిపోయింది కాబట్టి మీ సత్తా చూపమని అగ్రనాయకత్వం స్వేచ్ఛనిచ్చింది. తెలంగాణకు మోడీ , అమిత్ షాలు సైతం చాలా సమయాన్ని కేటాయించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మొదలు అగ్రనాయకులు పర్యటించి ప్రచారం చేశారు. ఇంత చేస్తే బీజేపీ 103 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. కేవలం ఒక డజను స్థానాల్లో మాత్రమే తానున్నానంటూ ఉనికి చాటుకుని ధరావతు తెచ్చుకుంది. ఒక్కస్థానం లోనే విజయం. ఈ పరాభవ భారం స్థానిక నాయకులకు రుచించడం లేదు. ఢిల్లీ మీదే తోసేయాలని నిర్ణయించుకున్నారు. కేంద్రమంత్రులు కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగడటం వల్లే తాము ఓటమి పాలయ్యామంటూ చాలామంది చక్కా చెప్పేశారు. బీజేపీకి, టీఆర్ఎస్ కు లోపాయికారీ అవగాహన ఉందంటూ సాగిన ప్రచారం కమలం అవకాశాలను దెబ్బతీసిందని తేల్చేశారు. తమకు క్షేత్రస్థాయిలో బలం లేదన్న విషయాన్ని అంగీకరించడానికి ఎవరూ ఇష్టపడలేదు. పైపెచ్చు రాష్ట్రనాయకులందరూ తమ సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఇతర జిల్లాలు, నియోజకవర్గాలకు వెళ్లడానికి కూడా సాహసించలేదు. తమ బలాన్ని అతిగా ఊహించుకున్న నాయకులకు ఢిల్లీ పెద్దల ముందు మొఖం చెల్లని పరిస్థితి. అయినా ఎదురుదాడి చేసి తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకొన్నారు.

బాబు కొంప ముంచేశారు....

చంద్రబాబు నాయుడితో జాతీయంగా ఉన్న అవసరాల దృష్ట్యా ఆయనపై విమర్శలు, ఆరోపణలు చేయవద్దని కాంగ్రెసు అధిష్టానం స్పష్టంగా పీసీసీ నాయకత్వాన్ని ఆదేశించింది. కానీ నియోజకవర్గ సమీక్షల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చేసిన హడావిడి కొంప ముంచిందని మెజార్టీ నియోజకవర్గాల్లోని నాయకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం కాంగ్రెసు పార్టీని తానే నడుపుతున్నాననే విధంగా చంద్రబాబు నాయుడు చివరి దశలో ప్రచారం చేశారు. దీనిని కేసీఆర్ తెలివిగా పట్టుకున్నారు. అమరావతి పాలకుల చేతిలోకి మళ్లీ తెలంగాణ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ సెంటిమెంటును రెచ్చగొట్టడంతో కాంగ్రెసు డిఫెన్సలోకి వెళ్లిపోయింది. తిప్పికొట్టే వ్యూహం లేక చతికిలపడిపోయింది. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ గెలిచే చాన్సులున్నాయనే అంచనాతో చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశంతోనే రంగంలోకి దిగారు. ఆ ప్లాన్ తిరగబడింది. టీడీపీ అధినేత బహిరంగంగా ప్రచారాలు నిర్వహించకుండా టీటీడీపీకి, కాంగ్రెసుకు వదిలేసి , బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసి ఉంటే కనీసం మరో పదిస్థానాలు గెలిచి ఉండేవారమని పీసీసీ నాయకులు అంతర్గత సమావేశాల్లో పేర్కొంటున్నారు. టీటీడీపీ నాయకులు సైతం దీనిని అంగీకరిస్తున్నారు. ఆర్థిక,అంగబలాలు సమకూర్చడంలో చంద్రబాబు దిట్ట. నేరుగా యుద్దం చేయడంలో కేసీఆర్ దిట్ట. తమకున్న బలం, బలహీనత తెలుసుకోకపోతే దెబ్బతింటాం. బాబు అత్యాశ, పేరు కోసం పడిన తాపత్రయం కాంగ్రెసు అవకాశాలకు గండి కొట్టిందనేది స్థూలంగా నియోజకవర్గ సమీక్షల్లో వెల్లడవుతున్న అభిప్రాయం.

మనోళ్ల వెన్నుపోటులే...

టీఆర్ఎస్ నాయకులు సైతం పూర్తిగా సంతృప్తిగా లేరు. మూడింట రెండు వంతుల మెజార్టీతో పార్టీ గెలిచింది. ఇంకా ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఎప్పుడో తెలియదు. మంత్రులుగా ఎవరుంటారో తెలియదు. కొందరు సీనియర్ నేతలు ఓడిపోయారు. కేసీఆర్, కేటీఆర్ ల చేతిలోనే పూర్తిగా అధికారాలు కేంద్రీకృతమవుతాయి. గతంలో నియోజకవర్గాల్లో కొంతమేరకు స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉంటాయో లేదో తెలియదు. అధిష్టానం చెప్పినట్లు వినడమే తప్ప తమ మాట పట్టించుకుంటారన్న నమ్మకం టీఆర్ఎస్ విజేతల్లో కనిపించడం లేదు. నామ్ కే వాస్తేగానే ఉండాల్సి ఉంటుందన్న విషయం వారి గ్రహింపునకు వస్తోంది. కనీసం ఎమ్మెల్యేల ప్రమాణ అంశాన్ని పట్టించుకోకుండా కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకొన్నారు. కేటీఆర్ సైతం ఎమ్మెల్యేలకు టైమ్ కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంద పైచిలుకు సీట్లలో గెలవాల్సి ఉన్నప్పటికీ పార్టీలో గ్రూపు నాయకులు వెన్నుపోట్లు పొడుచుకుని ఓడిపోయారంటూ కేసీఆర్ చీవాట్లు పెట్టారు. పార్టీలోనెగ్గిన, ఓడిపోయిన నియోజకవర్గాలు అన్నిటా గ్రూపులు తలెత్తాయి. సమీక్ష సమావేశాలు చాలా చోట్ల రచ్చరచ్చగా సాగుతున్నాయి. అధిష్ఠానం వీటిని పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదు. మొత్తమ్మీద ఆయా పార్టీల సమీక్షలు సాధించేది శూన్యమని రాజకీయ పరిశీలకులు తేల్చేస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News