అదిగదిగో... చందమామ....!

Update: 2018-10-02 14:30 GMT

చిన్నపిల్లాడిని కూర్చోబెట్టి అద్దంలో చందమామను చూపిస్తారు. అది మన సొంతమే అన్నట్లుగా కథ చెబుతారు. నమ్మినా, నమ్మకపోయినా అమ్మ పెట్టిన బువ్వ తిని నిదురపోతారు. మళ్లీ మరుసటి రోజు అదే కథ. రాజకీయ పార్టీలు ఓటర్లను అలాగే భావిస్తున్నాయి. ఒకే కథ పదేపదే చెబుతున్నాయి. దేశ బడ్జెట్ సమకూరిస్తే తప్ప అమలు చేయడం సాధ్యం కానంత భారీ హామీలిచ్చేస్తున్నారు. ఓటర్ల చెవిలో పువ్వులు పెడుతున్నారు. రైతు రుణమాఫీ అనేది మరోసారి ఎన్నికల మేనిపెస్టోలో ప్రధానాంశం కాబోతోంది. ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణ లో ప్రజల చెవులు పార్టీల మేనిఫెస్టోలతో హోరెత్తబోతున్నాయి. గడచిన ఎన్నికల్లో లక్ష రూపాయల వరకూ రైతు రుణమాఫీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్. 13 వేల కోట్ల రూపాయల మేరకు ఈ పద్దులో మాఫీ చేసింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రైతుబంధును అమల్లోకి తెచ్చారు. ఇది తగిన ఫలితం ఇవ్వదేమో అనే అనుమానంతో మళ్లీ రుణమాఫీ ని ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కాంగ్రెసు రెండు లక్షల రూపాయల వరకూ రుణమాఫీ చేస్తామంటూ చెప్పేస్తోంది. తెలంగాణ జనసమితి, టీడీపీదీ అదే బాట. వామపక్షాల నేతృత్వంలోని బీఎల్ఎఫ్ కైతే చేతికి ఎముక లేదు. మొత్తంగా రుణమాఫీ జపం చేస్తోంది.

సీజన్ మొదలైంది....

అడగనిదే అమ్మయినా పెట్టదు అంటుంటారు. కానీ రాజకీయ పార్టీలను అడగాల్సిన అవసరం లేదు. ప్రజల అవసరాలతోనూ వారికి సంబంధం లేదు. వారికి ఏమిస్తే సంతోషిస్తారన్నదే ప్రధాన ఆలోచన. దానికనుగుణంగా ఎన్నికల ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అసలు ప్రజలు ఊహించని వాగ్దానాలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల సీజన్ వచ్చేసింది. పార్టీల ప్రణాళికలకూ ముహూర్తాలు ఖరారు అవుతున్నాయి. అన్నిపార్టీల్లోనూ భారీ కసరత్తు సాగుతోంది. ఈ సీజన్ లో ఓటర్లను ఎలా బుట్టలో వేయాలన్నదే ప్రధాన లక్ష్యం. అన్నిపార్టీలు ప్రత్యేక కమిటీలను వేసుకున్నాయి. హామీలను వండి వార్చటమే వీటికి నిర్దేశించిన బాధ్యత. కీలకమైన నేతలకు ఇందులో చోటు కల్పించారు. ఎదుటి పార్టీలు ఏమేరకు హామీలు ఇచ్చేందుకు అవకాశం ఉందో గమనించి మరీ తమ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు సర్వేలు సైతం నిర్వహిస్తున్నారు.

హామీల వరద...

ఇప్పటికే బీజేపీ ఇంటి అద్దెల చెల్లింపుల సహా విపరీత వాగ్దానాలతో ప్రణాళికాయజ్ణానికి శ్రీకారం చుట్టింది. పేదలకు ఇళ్లు, భూమి వంటివన్నీ పాతపడిపోయాయి. ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటే ఆ సొమ్ములు మేమే చెల్లిస్తామనే వరకూ వెళ్లిపోయింది. ఫ్రిజ్,టీవీ, కేబుల్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా విద్యుత్తు ఛార్జీలు సైతం చెల్లిస్తామనే హామీలు రావడమే మిగిలి ఉంది. రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, వృద్ధాప్య పింఛన్ల వంటి వి మళ్లీ ఈసారి కూడా మేనిఫెస్టోల్లో కనిపించే సూచనలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి 40 ఏళ్లు దాటితే పింఛన్లు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. 40 ఏళ్ల వరకూ నిరుద్యోగభృతి , ఆ వయసు దాటితే వ్రుద్ధాప్య పింఛను, రూపాయికే కిలో బియ్యం.. ఇలా పథకాలతో ఇంటింటికీ అందే ప్రభుత్వ సంక్షేమ వాటా వేలరూపాయల్లోనే ఉంటోంది. దీనికి బ్రేకు పడే అవకాశం కనిపించడం లేదు. ప్రధానంగా మౌలిక వసతుల వంటి అంశాలపై ప్రభుత్వాలు నిధులు వెచ్చించలేని పరిస్థితి ఏర్పడుతోంది.

అందరిదీ అదే బాట...

ప్రభుత్వం నిజానికి ఫెసిలిటేటర్ పాత్ర పోషించాలి. మౌలిక వసతులు కల్పించడం ద్వారా ప్రజలు తమంతతాము జీవన ప్రమాణాలను పెంచుకునేందుకు మార్గం చూపాలి. శిక్షణ, ఉపాధి కల్పన, వ్యాపార నిర్వహణ అవకాశాల పెంపుదల వంటివాటిపై ద్రుష్టి పెట్టాలి. కానీ గడచిన రెండు మూడు దశాబ్దాల్లో ప్రభుత్వాల వైఖరిలో మార్పు వచ్చింది. సంక్షేమ పథకాల రూపంలో కూర్చోబెట్టి పోషించడమనే నూతన పద్ధతిని అమల్లోకి తెచ్చాయి. పార్టీలు అధికారంలోకి రాకముందే మేనిఫెస్టోల్లో ఉచితానికి అనుచితమైన ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. దాంతో ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణకు దిగక తప్పడం లేదు. వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయడం సాధ్యం కాకపోయినా నిధులైతే కరిగిపోతున్నాయి. దీర్ఘకాలిక అభివృద్ధికి సంబంధించిన పనులు చేపట్టడం సాధ్యం కావడం లేదు. ఈ లోపం వెన్నాడుతున్నప్పటికీ ఈ రోజు పబ్బం గడిస్తే చాలనుకునే పార్టీలే అన్నీ. అందుకే మేనిఫెస్టోల రూపకల్పనలో సైతం వైవిధ్యం ఉండటం లేదు. పోటాపోటీగా ఉచిత వాగ్దానాలు గుప్పించడం మినహా కొత్తదనం కనిపించడం లేదు. ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాలను మించి ప్రణాళికల్లో సంక్షేమ పథకాల చిట్టా చూపిస్తూ ఉండటం విశేషం.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News