అనకాపల్లి కేరాఫ్ క్యాంప్ ఆఫీస్…?

ఇదేటో సినిమా టైటిల్ గా ఉంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. విశాఖ జిల్లాలో రాజకీయ కేంద్రంగా ఉన్న అనకాపల్లి ప్రజలు తమ బాధలను మరచిపోవడానికి సెటైరికల్ గా [more]

Update: 2020-11-07 15:30 GMT

ఇదేటో సినిమా టైటిల్ గా ఉంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. విశాఖ జిల్లాలో రాజకీయ కేంద్రంగా ఉన్న అనకాపల్లి ప్రజలు తమ బాధలను మరచిపోవడానికి సెటైరికల్ గా పెట్టుకున్న పేరు ఇది. అనకాపల్లిలో గత రెండు దశాబ్దాలుగా వలస నేతల పాలనతో సతమతం అవుతున్నామని జనం ఆవేదన ఇది. అనకాపల్లికి కూడా దిగుమతి నేతల బెడద చాలానే ఉంది. 1999లో తొలిసారిగా ప్రకాశం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు దిగుమతి అయి ఎంపీగా నెగ్గారు. ఆయనకు టీడీపీ ఇచ్చి ప్రోత్సహించింది. అలా ఆయన ఎంపీ అయిపోయారు. అపుడు మొదలైంది క్యాంప్ అఫీస్ పాలిటిక్స్.

కధ అలా నడిపించారు ….

గంటా ఎంపీగా ఉంటే ఢిల్లీలో ఉండేవారు. లేకపోతే విశాఖలోని తన భవనంలో ఉండేవారు. అపుడపుడు ఆయన తనకు ఓట్లేసి గెలిపించిన అనకాపల్లి వెళ్ళి క్యాంప్ ఆఫీస్ లో కూర్చునేవారు. ఇక ఆ క్యాంప్ ఆఫీస్ బాధ్యతలను గంటా మనుషులు చూసుకునేవారు. వారే ఒక విధంగా ప్రజలు చెప్పింది విని గంటాకు చెప్పేవారు అంటారు. ఆయన 2009లో అనకాపల్లి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అపుడు కూడా క్యాంప్ ఆఫీస్ కల్చర్ కంటిన్యూ అయింది. దాంతో ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే ఎక్కడ అని జనం నిలదీసిన జవాబు లేకుండా పోయిందని అంటారు.

ఈయన అంతేగా…?

ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పీలా గోవింద సత్యనారాయణ గెలిచారు. ఆయన విశాఖలోని పెందుర్తి ప్రాంతానికి చెందిన వారు. ఆయన అక్కడ నివాసం ఉంటూ అనకాపల్లిలో క్యాంప్ ఆఫీస్ ఒకటి పెట్టి గంటా బాటలోనే రాజకీయం చేస్తూ వచ్చారు. ఎమ్మెల్యే తప్ప ఆ క్యాంప్ ఆఫీస్ లో అందరూ ఉండేవారు. దాంతో జనానికి తమ బాధలు అలాగే కొనసాగాయి. తమ మధ్య నివాసం ఉండని ఎమ్మెల్యే ఎందుకు అని జనం తిట్టుకోవడమూ పరిపాటిగా మారింది. ఇక 2019 ఎన్నికల నాటికి ఆయన ఓడి వైసీపీ నుంచి గుడివాడ అమరనాధ్ వచ్చారు.

రిమోట్ పాలన…..

ఇక అమరనాధ్ విశాఖలోని గాజువాకకు చెందిన వారు. ఆయన. తన సొంత ఇల్లు మింది నుంచి రిమోట్ పాలన సాగిస్తున్నారని ఇపుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.చిత్రమేంటంటే గుడివాడ కూడా క్యాంప్ ఆఫీస్ ఒకటి తెరచారు. పార్టీ నాయకులను అక్కడ ఉంచి తానున్నాను అనుకోమంటున్నారు. మంత్రులు, పెద్దలు వచ్చినపుడు వారితో పాటే తానూ వచ్చి వెళ్లిపోయే చుట్టంలా గుడివాడ తీరు ఉందని విమర్శలు వస్తున్నాయి. అయినా ఆయన అనకాపల్లిలో నివాసం ఏర్పాటుచేసుకోలేదు అంటున్నారు. ఇదే కాదు, 2009లో అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచిన సబ్బం హరి కూడా విశాఖ నుంచే పాలన సాగించారు తప్ప అనకాపల్లి ముఖం తొంగి చూడలేదు అంటారు. 2014లో అనకాపల్లి ఎంపీగా గెలిచిన ప్రస్తుత వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా విశాఖలోనే నివాసం ఏర్పాటు చేసుకుని అపుడపుడు అక్కడ కనిపించేవారని చెబుతారు. మొతానికి తమకు వలస నాయకులు వద్దు, నిఖార్సు అయిన లోకల్ లీడర్ కావాలని అనకాపల్లి ప్రజ‌ మొరపెట్టుకుంటోందిట. మరి 2024లో ఆ మొర కాస్తా ఉద్యమంగా మారితే చాలా మంది నేతలకు దెబ్బ పడిపోవడం ఖాయం.

Tags:    

Similar News