కర్ణాటకలో అంతేగా…అంతేగా…!!

దక్షిణాదిన పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. తమిళనాడు తర్వాత అత్యధిక లోక్ సభ స్థానాలు (28) ఉన్న రెండో అతి పెద్ద రాష్ట్రం కూడా ఇదే. ప్రత్యేకించి [more]

Update: 2019-07-19 17:30 GMT

దక్షిణాదిన పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. తమిళనాడు తర్వాత అత్యధిక లోక్ సభ స్థానాలు (28) ఉన్న రెండో అతి పెద్ద రాష్ట్రం కూడా ఇదే. ప్రత్యేకించి ఇది సంపన్న రాష్ట్రం. ఒక్కలిగ, లింగాయత్ లు బలమైన సామాజిక వర్గాలు. వీటి తర్వాత ఓబీసీలు రాజకీయ శక్తిగా ఎదిగారు. లింగాయత్ లు బీజేపీ వైపు కేంద్రీకృతం కాగా, ఒక్కలిగలు జనతాదళ్ (ఎస్) వైపు ఉన్నారు. ఈ రెండు వర్గాల్లో కొంతమందితో పాటు ఓబీసీలు కాంగ్రెస్ పార్టీ వైపు మొహరించారు. దక్షిణాదిన అంతగా కనిపించని సంకీర్ణ ప్రభుత్వాలు కర్ణాటకలో కనపడతాయి. దాదాపు గత నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రంలో సంకీర్ణ సర్కార్లు రాజ్యమేలుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం, జాతీయ పార్టీలు పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా పేర్కొన వచ్చు.

దినదినగండమే…..

సంకీర్ణ రాజకీయాల కారణంగా రాష్ట్రంలో ప్రభుత్వాల పనితీరు దినదిన గండంగా మారుతుంది. ఎంతోమంది ముఖ్యమంత్రులు అర్థాంతరంగా నిష్క్రమించారు. ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయాయి. ఇందుకు కారణాలు సిద్ధాంత రహిత రాజకీయాలు, అపవిత్ర పొత్తులు, అవసరార్థ స్నేహమే తాజాగా కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్ పేకమేడలా ఏ క్షణమైనా కూలిపోయే పరిస్థిితిలో ఉంది. ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప ప్రభుత్వం మనుగడ కొనసాగే పరిస్థితి లేదు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా, ముంబయిలో మకాం, నేపథ్యంలో ఏదో ఒకరోజు సర్కార్ కూలిపోక తప్పని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేల రాజీనామాలు, స్పీకర్ ఆమోదం తదితర సాంకేతిక అంశాలు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నాయి. గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. 104 సీట్లతో మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచింది. కాంగ్రెస్ 75, జనతాదళ్ ఎస్ 37 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ చకచకా పావులు కదిపింది. కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించింది. ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల పదవులు తీసుకుంది. ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి లుకలుకలు మొదలయ్యాయి. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) ఘోర పరాజయం అనంతరం పరిస్థితి మరింతగా దిగజారింది. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 28కి గాను 25స్థానాలను సాధించిన బీజేపీ కుమారస్వామి సర్కార్ ను కూలగొట్టేందుకు బహిరంగంగానే పావులు కదిపింది. గవర్నర్ వాజుభాయి వాల తమ మనిషి కావడం, కేంద్రంలో అధికారంలో ఉండటం దానికి కలసి వచ్చిన పరిణామాలు. దీంతో తన ప్రయత్నాలను తీవ్రతరం చేసింది.

ఎనిమిదో దశకంలోనే….

కర్ణాటక రాష్ట్రంలో సంకీర్ణ సర్కార్ కు ఎనిమిదో దశకంలోనే బీజం పడింది. 1983లో తొలిసారిగా జనతా పార్టీ ఆధ్వర్యంలో రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో ఏర్పాటైన తొలి సంకీర్ణ సర్కార్ నైతిక కారణాలతో రాజీనామా చేయడంతో సంక్షోభం ఏర్పడింది. 95 స్థానాలు సాధించిన జనతా పార్టీ, వామపక్షాలు, 16 మంది స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1984లో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 28 స్థానాలకు 24 గెలుచుకోవడంతో నైతిక కారణాలతో రామకృష్ణ హెగ్డే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హెగ్డే మళ్లీ గెలవడం విశేషం.

కుప్పకూలిన ప్రభుత్వాలు….

1988లో హెగ్డేపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన స్థానంలో ఎస్ ఆర్ బొమ్మయ్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో జనతా పార్టీ జనతాదళ్ గా మారింది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బొమ్మయ్ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. ఇది అక్రమమని ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఇప్పటికీ బొమ్మయ్ కేసుగా పేరుగాంచింది. అప్పటి నుంచి ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులకు మార్గదర్శిగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వాల రద్దుతో గవర్నర్ ఏకపక్ష అధికారాలకు కత్తెర పడింది. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ గెలిచినప్పటికీ రామకృష్ణ హెగ్డే సీఎం కాలేకపోయారు. హెచ్.డి.దేవెగౌడ ముఖ్యమంత్రి అయ్యారు. 1996లో దేవెగౌడ ప్రధాని కావడంతో జె.హెచ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయ కారణాల వల్ల తర్వాత రోజుల్లో ఏర్పడిన ప్రభుత్వాలు పూర్తికాలం పనిచేయలేకపోయాయి.

ఇప్పుడు కూడా….

2004 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 79, కాంగ్రెస్ 65, జనతాదళ్ (ఎస్) 58 స్థానాలను గెలుచుకున్నాయి. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ నేత ధరమ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. 19 నెలల తర్వాత జనతాదళ్ ఎస్ మద్దతు ఉపసంహరించు కోవడంతో ధరమ్ సింగ్ సర్కార్ కూలిపోయింది. తర్వాత బీజేపీ, జనతాదళ్ ఎస్ సంకీర్ణ సర్కార్ ఏర్పడింది. కుమారస్వామి ముఖ్యమంత్రిగా, యడ్యూరప్ప ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఒప్పందం ప్రకారం 2007 అక్టోబరు 3న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కుమారస్వామి నిరాకరించడంతో బీజేపీ మద్దతు ఉప సంహరించుకుంది. దీంతో రాష్ట్రపతి పాలన విధించారు. తిరిగి ఒప్పందం పునరుద్ధరించుకోవడంతో అదే ఏడాది నవంబరు 12న యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పై సీనియర్ నేత గాలి జనార్థన్ రెడ్డి తిరుగుబాటు చేశారు. ఆయన సూచన మేరకు 43 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి హైదరాబాద్ లోని ఒక రిసార్ట్ కు వెళ్లారు. అసమ్మతి ఎమ్మెల్యేలకు పదవులు ఎరవేసి యడ్యూరప్ప గండం నుంచి గట్టెక్కారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. 104 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 78 స్థానాలతో కాంగ్రెస్, 37 స్థానాలతో జనతాదళ్ ఎస్ సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశాయి. అంతకు ముందు బీజేపీ నేత యడ్యూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ సభలో బలం నిరూపించుకోలేక రాజీనామా చేశారు. తాజా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కుమారస్వామి ఎంతకాలం ఉంటారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కన్నడ రాజకీయాల తీరే అంత మరి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News