అల్లరికి అర్థం ఉందా?

ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అయినా ఒకటే లక్ష్యంగా కనిపిస్తుంది. అది నిత్యం అల్లరి చేయడం. అది అసెంబ్లీ కావొచ్చు లేదా సమావేశాలు ముగిసాక ఉద్యమాలు కావొచ్చు. [more]

Update: 2019-12-06 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అయినా ఒకటే లక్ష్యంగా కనిపిస్తుంది. అది నిత్యం అల్లరి చేయడం. అది అసెంబ్లీ కావొచ్చు లేదా సమావేశాలు ముగిసాక ఉద్యమాలు కావొచ్చు. ప్లేస్ ఏదైనా అల్లరి చేయడం నిత్యం ప్రజల్లో ఉన్నట్లు ప్రచారం కల్పించుకోవడం తప్ప అభివృద్ధి పై మాత్రం ఏ పార్టీ ఫోకస్ పెడుతున్నట్లే కనిపించడం లేదు. దీనికి అధికారపార్టీ కూడా అతీతం కాకపోవడం గమనార్హం. విపక్షాలతో సమానంగా అధికార పక్షం సైతం ఈ అల్లరిలో తమవంతు పాత్రను పోషించేందుకు దూకుడుగా సాగుతుంది. అనవసర అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన విషయాలపై మాత్రం తమకేమీ సంబంధం లేనట్లు అధికార విపక్షాలు సాగుతున్నాయి.

మౌలిక వసతులు లేవు …

ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అధ్వాన్న పరిస్థితిలో వున్నాయి. అనేక కీలక ప్రాజెక్ట్ లు కేంద్రం నిధులపైనా బ్యాంకు ల రుణాలపై ఆధారపడి ముందుకు సాగుతున్నాయి. మరో పక్క విభజన సమస్యలు ఇప్పటికి కొలిక్కి రాలేదు. పక్క రాష్ట్రం సహకారం తో ఏపీ ముందుకు సాగుతున్నా ఇంకా ఇరు రాష్ట్రాలకు కేంద్రం నుంచి సహకారం పూర్తి స్థాయిలో అందడం లేదు. ఆస్తుల పంపకం కానీ, ప్రత్యేక హోదా అంశం వంటి విషయాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయాయి.

బలోపేతం చేసుకోవడమే…..

రెండు రాష్ట్రాల్లో రాజకీయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని బలోపేతం చేసుకోవడమే టార్గెట్ గా కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి పావులు కదుపుతుంది. ఇరు రాష్ట్రాలకు రాజకీయ చతురులైన గవర్నర్ లను నియమించి తమ ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెప్పింది కమలం పార్టీ. ఈ నేపథ్యంలో తమ హక్కులు సాధించుకోవడం లో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కిందా మీదా పడుతున్నాయి. అభివృద్ధి అంశాలు పక్కన పెట్టి రాజకీయ అంశాలకు ప్రాధాన్యత కల్పించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో అధికారం దూరం అయిపొతుందెమో అన్న ఆందోళనే వారిని వెంటాడుతూ ఓటు బ్యాంక్ రాజకీయం వైపే అధికారపార్టీ అడుగులు పడేలా చేస్తుంది.

కులం, మతం, ప్రాంతం …

ఇక అన్ని పక్షాలు చేస్తున్నది ఒకటే కులం, మతం, ప్రాంతం ప్రధాన అంశాలుగా ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ విమర్శలు, ఆరోపణలతో రేపే సార్వత్రిక ఎన్నికలన్నంతగా హడావిడి సాగిస్తున్నాయి. అరకొర నిధులతో రాష్ట్రం కేంద్ర నిధులపై ఆధారపడిన పరిస్థితుల్లో, రాజధాని లో ఎలాంటి సౌకర్యాలు లేక ఒక పక్క పోలవరానికి కేంద్రం సహకారం ఉంటుందా లేదా అన్న సందేహాల్లో నిత్యం కొట్టుకు చావడమే తమ హక్కుగా బాధ్యతలు విస్మరించి ప్రచార వేదికలపై తమ సత్తా చూపించడం శోచనీయమని రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే వారు వాపోతున్నారు.

భావితరాలకు అన్యాయమే…..

ఇలాంటి రాజకీయాలతో రాష్ట్రాభివృద్ధి జరగడం అటు ఉంచి భావితరాలకు అన్యాయం చేసినట్లే అవుతుందని ఆవేదన చెందుతున్నారు. పక్కనున్న తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలకు ఆరునెలల ముందు రాజకీయాలకు అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రాభివృద్ధి అంశంలో కేంద్రం పై వత్తిడి తేవడం అవసరమైతే పోరాటం చేయడం అందరికి కనిపిస్తుంది. ముఖ్యంగా సాగు, తాగు నీరు భారీ ప్రాజెక్ట్ ల వంటి విషయాల్లో విపక్షాలన్నీ అధికారపక్షంతో కలిసే అడుగులు వేస్తాయి. కానీ ఏపీ లో దీనికి భిన్నమైన వాతావరణం ఇప్పుడు అన్ని వర్గాల్లో ఆందోళన పెంచుతుంది. అభివృద్ధి రాజకీయం ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో చూడలేమా అన్నది మేధావులు సైతం మధన పడుతున్న అంశం. మరి మార్పు ఎప్పుడో .

Tags:    

Similar News