అవంతికి అదిరేటి షాక్

వైసీపీ అధికారంలోకి వచ్చింది, ఇక దర్జా ఒలకబోయవచ్చునని ఎంతో మురిసిన ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఇపుడు దిగాలుపడుతున్నారు. ఎందుకంటే చేతిలో అధికారం ఉన్న కనీసం కానిస్టేబుల్ [more]

Update: 2019-08-18 05:00 GMT

వైసీపీ అధికారంలోకి వచ్చింది, ఇక దర్జా ఒలకబోయవచ్చునని ఎంతో మురిసిన ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఇపుడు దిగాలుపడుతున్నారు. ఎందుకంటే చేతిలో అధికారం ఉన్న కనీసం కానిస్టేబుల్ ని కూడా బదిలీ చేయించుకునే సత్తా లేకపోతోందట. దానికి కారణం ప్రతి జిల్లాలో ఎస్పీ స్థాయి అధికారులు నేరుగా జగన్ కి జవాబుదారులుగా ఉన్నారు. బదిలీల విషయంలో ఎవరి సిఫార్సులు పట్టించుకోవద్దు అని ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు రావడంతో మంత్రులను సైతం పక్కన పెట్టి పోలీస్ అధికారులు పని కానిచేస్తున్నారుట. దీంతో లోపల మండిపోతున్నా బయటపడలేక వైసీపీ మంత్రులు సతమతమవుతున్నారట.

సొంత నియోజకవర్గంలో….

విశాఖ జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాసరావు సిఫార్సులకు విలువ లేకపోయిందట. తన సొంత నియోజకవర్గం భీమిలీలో ఎస్సైలను సైతం ఆయన కోరుకున్న వారిని నియమించుకోలేకపోతున్నారుట. దాంతో ఎవరో వచ్చి ఆ పోస్టుల్లో కుదురుకుపోతుంటే మంత్రి నోరెళ్ళబెట్టాల్సివస్తోందని అంటున్నారు. ఇదే విషయమై విశాఖలోని ఎమ్మెల్యేలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట. పెందుర్తి, గాజువాక, అనకాపల్లి, చోడవరం వైసీపీ ఎమ్మెల్యేలు తమ పరిధిలోని స్టేషన్లో తాము కోరుకున్న వారిని నియమించుకుందామ‌ని పోలీస్ ఉన్నతాధికారులకు సిఫార్స్ లేఖలు ఇచ్చారట. ఇపుడవన్నీ బుట్టదాఖలు అవడంతో వారు కుంగిపోతున్నారుట. ఈ పరిస్థితులు చూసుకుంటే మనం అధికారంలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అని వైసీపీ ప్రజా ప్రతినిధులు తల్లడిల్లుతున్నారట.

టీడీపీ హయాంలో వారికేనా…

ఇక టీడీపీ అధికారంలో ఉన్నపుడు హవా చలాయించిన పోలీస్ అధికారులే ఇపుడు కూడా హవా చలాయించడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారుట. ఇలా జరిగితే తమ రాజకీయ పెత్తనం ఏముంటుందని కూడా వారు వాపోతున్నారుట. అప్పట్లో టీడీపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా తనకు కావాల్సిన వారిని కనీసం కానిస్టేబిల్ స్థానంలో కూడా కూర్చోబెట్టు కోలేకపోయారని గుర్తు చేసుకుంటున్నారు. ఇపుడు కూడా సరిగ్గా అదే పరిస్థితి తమకు ఏర్పడిందని అంటున్నారు. మరో వైపు ఎన్నడూ లేని విధంగా విశాఖలో రాయలసీమకు చెందిన పోలీస్ అధికారులు బదిలీపై రావడాన్ని కూడా స్థానిక వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. నేరుగా విజయసాయిరెడ్డి సిఫార్సులతోనే ఇదంతా జరుగుతోందని అంటున్నారు. అంటే విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న విజయసాయి మాటే నెగ్గుతోంది తప్ప మరెవరినీ అసలు పట్టిచుకోరన్న సంగతి తెలిసి ఇంకా కుమిలిపోతున్నారుట. మరి ఈ బడబాగ్ని ఎపుడు బద్దలవుతుందో జగన్ ముందు అయినా బయటపడతారో లేదో చూడాలి.
.

Tags:    

Similar News