పోలీసులు – అంతేగా…అంతేగా…!!

“ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి?” “మీ నాన్న పేరేంటి” “వయస్సు ఎంత” “అడ్రసు ఏంటి” “ఫోన్ నెంబరు ఎంత?” “ఏ కులం” “ఏ మతం” పోలీసులు అడిగే [more]

Update: 2020-01-12 08:00 GMT

“ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి?”
“మీ నాన్న పేరేంటి”
“వయస్సు ఎంత”
“అడ్రసు ఏంటి”
“ఫోన్ నెంబరు ఎంత?”
“ఏ కులం”
“ఏ మతం”

పోలీసులు అడిగే ప్రశ్నలు ఇవి. ఈ వివరాల తర్వాతే పోలీసులు ఇతర వివరాల్లోకి వెళతారు. బ్రిటిషు పాలనల నుండి ఇప్పటి పాలన వరకూ పోలీసులు అడిగే ప్రశ్నలివే. ఈ ప్రశ్నల పరంపర కొద్దిగా అటూ, ఇటుగా ఉంటుంది తప్ప తేడా ఉండదు. పోలీసులు ఫిర్యాదు రాసినా, FIR రాసినా, నోటీసు పంపించినా, ఇవన్నీ ఖచ్చితంగా ఉండే అంశాలు. నిత్యం పోరాటాలు చేసే పేదలు, కార్మికులు, కిందిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బంది… ఇలా ఒక్కరేమిటి… అనేక రకాల జనానికి పోలీసులు అడిగే ఈ ప్రశ్నలు అలవాటే. ఇప్పుడు కొత్తగా పోలీసులు “పేరు, కులం, ఫోన్ నెంబరు” అడగడం కొత్త కాదు. చిత్రం ఏమంటే ఈ విషయాన్ని వివాదం చేస్తున్న ప్రజలకు ఈ ప్రశ్నలు కొత్తవి. అందునా పోలీసులు అడగడం వీరికి కొత్తగా ఉంది.

కొత్తగా మొదలయినట్లు…..

ఉద్యమాలు చేసింది లేదు. పోలీసులు అరెస్టు చేసింది లేదు. అందుకే వారికి “పోలీసు చర్యలు” కఠినంగానూ, మానవ హక్కుల ఉల్లంఘన గానూ, తీవ్ర అభ్యంతరకరంగానూ ఉంది. విచిత్రం ఏమంటే ఇలాంటి వాటిని, ప్రత్యేకించి డ్వాక్రా మహిళల నుండి, అంగన్ వాడీ మహిళలు, వామపక్ష పార్టీల మహిళలు చేస్తున్న పోరాటాలు చూసిన మీడియా కూడా ఈ ప్రశ్నలను కొత్తగా విశ్లేషిస్తోంది! ఈ దృశ్యాలను కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇవన్నీ తీవ్ర అభ్యంతరకర అంశాలు, చర్యలు అయినప్పటికీ ఇవి ఇప్పుడే మొదలైనట్టు చెప్పే ప్రయత్నం కూడా మీడియా చేస్తోంది. ఇప్పుడు పోరాటం చేస్తున్న వారికి పోరాటం కొత్త కావచ్చు. పోలీసులతో సలాములు చెప్పించుకోవడానికి అలవాటుపడిన వీరికి పోలీసుల ఆగ్రహం కొత్తగా కనిపించొచ్చు. కానీ, అధికారంలో ఉన్నప్పుడు తమ కనుసన్నల్లో ఇలాంటి పనులే పోలీసులతో చేయించే నేతలు కూడా ఈ చర్యలను కొత్తగా, చూడడం, వింతగా మాట్లాడడం, అమానవీయంగా తలంచడం, ఏకంగా జాతీయ మహిళా కమిషన్ వరకూ ఫిర్యాదులతో వెళ్ళడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

గతంలో జరగలేదా?

మహిళలను మహిళా పోలీసులే “హ్యాండిల్” చేయాలి. మహిళలను మహిళా పోలీసులే అరెస్టు చేయాలి. మహిళలను సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఉంచరాదు. ఒక వేళ ఉంచాల్సి వస్తే సదరు పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులు ఉండాలి. ఇవన్నీ కీలకమైన అంశాలు. ఇప్పుడు అమరావతి పేరుతో పోరాటం చేస్తున్న మహిళలు, వారికి మద్దతుగా మాట్లాడుతున్న మేధావులు సమాజానికి సంధిస్తున్న ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలను స్వాగతిస్తున్నాను. అయితే మహిళలను బూటుకాళ్ళతో తన్నే మగ పోలీసులు, లాఠీలతో కుమ్మేసే మగ పోలీసులు, చేతులతో ఎత్తి వ్యాన్లో పడేసే మగ పోలీసులు… ఇవన్నీ ఇప్పటివరకూ చూడలేదంటే సమాజానికి ఈ మహిళలు ఎంత దూరంలో బ్రతుకుతున్నారో తెలుస్తోంది. ఎప్పుడైనా దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో సాయంత్రం 6 గంటల తర్వాత మహిళలను నిర్బంధించిన సందర్భాలు “సామాజిక బాధ్యత”గా అయినా చూశారా? అలా చూడకపోవడం వల్లనే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో రాత్రి 9 గంటలకు కూడా మహిళలను నిర్బంధించి ఉంచడం తీవ్ర అభ్యంతరకరం అయింది. ఎప్పుడైనా రోడ్డుపై తమ హక్కులకోసం పోరాటం చేస్తున్న మహిళలను ఈ పోలీసులు ఎలా “హ్యాండిల్” చేస్తున్నారో చూశారా? ఖండించే ప్రయత్నం చేశారా? ఈ రోజు అరెస్టు అయిన మహిళల్లాగే వారుకూడా మహిళలేకదా? వారికి కూడా హక్కులు ఉంటాయి కదా? అవెప్పుడన్నా ప్రశ్నించే ప్రయత్నం చేశారా? కనీసం అలాంటి సంఘటనలు చూసినప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా హక్కుల కమిషన్ ఉన్నయని, వాటికి ఒక మెసేజ్ పంపితే సరిపోతుందని ఆలోచించారా?

బాబు హయాంలోనూ…..

ఉమ్మడి రాష్ట్రంలోనూ, విడిపోయిన రాష్ట్రంలోనూ కలిపి 14 యేళ్ళకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తన హయాంలో మహిళలను పోలీసులు ఎలా “హ్యాండిల్” చేశారో తెలియదా? మహిళలను మగపోలీసులే “హ్యాండిల్” చేస్తున్నారని తెలియదా? మహిళలను సాయంత్రం 6 గంటల తర్వాత పోలీస్టేషన్లో నిర్బంధించి ఉంచుతున్నారని తెలియదా? ఇప్పుడు మాత్రమే ఆయన జాతీయ మహిళా కమిషన్ కు (ట్వీట్) ఫిర్యాదు చేశారు. ఈ మహిళలకు మాత్రమే ఈ హక్కులు వర్తిస్తాయా? చంద్రబాబు కాకుండా వేరే వారు ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే మహిళల హక్కులు, మానవ హక్కులు, మహిళా కమిషన్ గుర్తు వస్తాయా? లేక ముఖ్యమంత్రి పదవి ఈ వాస్తవాలను కనపడనివ్వకుండా కళ్ళు నెత్తికెక్కిస్తుందా? అలాంటి ఇప్పుడు జగన్ కు కూడా ఆ పదవిలో ఉన్న కారణంగా మహిళల హక్కులు కనిపించడం లేదా?

హక్కుల కోసం….

ఏమైతేనేం, ఇప్పటికైనా ఓ వర్గం మహిళలు రోడ్డుమీదకు వచ్చారు. పోలీసులు ఎలా ప్రవర్తిస్తారో చూశారు. మహిళా హక్కులు ఎలా కాలరాయబడతాయో చూశారు. హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుందో తెలుసుకున్నారు. చంద్రబాబుతో సహా పాలక పార్టీలకు మానవ హక్కులు, మహిళా హక్కులు గుర్తొచ్చాయి. రోడ్డుపై మహిళలను మగపోలీసులు ఎలా “హ్యాండిల్” చేస్తున్నారో అనుభవించారు. అవమానం పొందారు. ఇకనుండైనా నోరు తెరవండి. హక్కులకోసం పోరాటం చేస్తున్న మహిళలను పాలకుల అండతో పోలీసులు ఇలాగే “హ్యాండిల్” చేస్తున్నారు. మగాళ్ళను, పిల్లలను, వృద్ధులను, వికలాంగులను… బలహీనులను… ఇలాగే “హ్యాండిల్” చేస్తున్నారు. హక్కులు కాలరాస్తున్నారు. వారికోసం మీరు పోరాటం చేయనక్కరలేదు.

అప్పుడు కూడా…

ఇప్పుడు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టే అప్పుడు కూడా స్పందించండి. ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్టే సాయంత్రం 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్ లో మహిళను నిర్బంధించినట్టు కనిపిస్తే స్పందించండి. అప్పుడప్పుడూ సాటి మనుషులకోసం కూడా స్పందించండి. అప్పుడు సమాజం మీకోసం స్పందిస్తుంది.

 

– దారా గోపి, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News